ఢిల్లీలో చిమ్మచీకట్లు : భారీ వర్షం

Update: 2018-06-09 13:06 GMT

నైరుతి రుతుపవనాల ప్రభావంతో పలు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. కుండపోత వానతో ముంబై, గోవాలు నీట మునగగా దేశ రాజధాని ఢిల్లీలో గాలి దుమారం బీభత్సం సృష్టించింది. ఈదురుగాలులతో పెద్దఎత్తున దుమ్మూధూళి రేగడంతో పట్టపగలే రాత్రిని తలపించింది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించడంతో.... పలు రాష్ట్రాలు ముందుజాగ్రత్త చర్యలు చేపట్టాయి.

దేశ రాజధాని ఢిల్లీలో గాలివాన బీభత్సం సృష్టించింది. నైరుతి రుతుపవనాల రాకతో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. దాంతో ఢిల్లీలో పట్టపగలే చీకటి కమ్ముకుంది. సాయంత్రం మూడు నాలుగు గంటలకే రాత్రిని తలపించింది. గాలి దుమారానికి పెద్దఎత్తున రోడ్లపై చెట్లు విరిగిపడ్డాయి. ఉరుములు మెరుపులతో పిడుగులు విరుచుకుపడ్డాయి. గంటకు యాభై అరవై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయడంతో జనజీవనం స్తంభించిపోయింది. గాలివాన బీభత్సానికి విమాన, రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది.

ఇక ముంబై మహానగరం కూడా కుండపోత వర్షానికి తడిసిముద్దయింది. జోరువాన దెబ్బకు నగరం మొత్తం నీట మునిగింది. భారీ వర్షానికి ముంబైలో జనజీవనం అస్తవ్యస్తం కాగా... విమాన, రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. గోవాలోనూ భారీ వర్షాలు దంచికొడుతున్నాయి. నైరుతి రుతపవనాల ప్రభావంతో పనాజీలో కుండపోత వర్షం కురిసింది. దాంతో పనాజీలోనూ జనజీవనం స్తంభించింది.

నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఢిల్లీ, మహారాష్ట్ర, కర్నాటక, గోవా, బెంగాల్‌, ఒడిషా, సిక్కిం, అసోం, మేఘాలయ, ఛత్తీస్‌గఢ్‌తో తెలంగాణ, రాయలసీమ, కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణశాఖ హెచ్చరించింది. ఐఎండీ హెచ్చరికలతో ఆయా రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. ముందుజాగ్రత్త చర్యలు చేపట్టడమే కాకుండా... అత్యవసరమైతే తప్ప.... ప్రజలు బయటికి రావొద్దదంటూ సూచిస్తున్నారు.

Similar News