ఆకలికి అలమటించి ముగ్గురు చిన్నారులు మృతి

Update: 2018-07-27 02:32 GMT

దేశ రాజధాని ఢిల్లీకి బతుకు దెరువు కోసం వలస వచ్చింది పశ్చిమ బెంగాల్‌ మిడ్నాపూర్‌కు చెందిన మంగళ్ కుటుంబం. భార్య బీనాని, తన ముగ్గురు పిల్లలు మన్సీ, పారో, సుఖోలను కుటుంబ పోషణ నిమిత్తం. మంగళ్ రిక్షా తొక్కేవాడు. రిక్షా తొక్కితే వచ్చే చాలీ చాలని డబ్బుతోనే జీవితాన్ని గడుపుతున్నారు. పిల్లలకి సరైన తిండి కూడా పెట్టలేకపోతున్నాడు. మగళ్ భార్య కూడా ఇల్లు గడవడం కోసం పనులకు వెళ్ళేది. కొంతకాలానికి ఆ కుటుంబంలో విషాద పరిస్థితులు నెలకొన్నాయి. ఓ ప్రమాదంలో గాయపడి మంగళ్ భార్య మతి స్థిమితం కోల్పోయింది. దీంతో పిల్లలకి ఆ నాలుగు మెతుకులు కూడా వండి పెట్టలేని పరిస్థితి. ఈ క్రమంలో భార్య బాధ చూసి మంగళ్ తాగుడుకు బానిసయ్యాడు. దీంతో పిల్లలు ఆకలికి అలమటిస్తున్నారు. ఆకలికి తాళలేక వీధుల్లో అడుక్కోవడం మొదలు పెట్టారు ముగ్గురు చిన్నారులు. దొరికిన రోజు తినడం లేని రోజు పస్తులుండడంతో చిక్కి శల్యమయ్యారు. దీంతో రోజురోజుకు నీరసించి రెండురోజుల కిందట మరణించారు. పోలీసులు వారి మృతదేహాలను పోస్ట్ మార్టంకి తరలిస్తే ముగ్గురు పిల్లలు ఆహారం లేకనే శరీర అవయవాలన్నీ పాడైపోయాయని, కిడ్నీలు, ఊపిరితిత్తులు పూర్తిగా దెబ్బతిన్నాయని డాక్టర్ అమిత్ సక్సేనా తెలిపారు. ఆకలితో అలమటించి చివరకు చనిపోయిన బిడ్డల్నిచూసి కన్నీళ్లు పెట్టుకుంటున్నారు ప్రజలు.

Similar News