ఆ రెండు గంట‌ల్లోనే ట‌పాసులు పేల్చాలి : జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ దాన‌కిషోర్‌

Update: 2018-11-06 06:53 GMT

దీపావళి పర్వదినాన టపాకాయిలు పేల్చడంపై సుప్రీం కోర్టు ఆంక్షలు విధించడంతో జీహెచ్ఎంసీ అధికారులు దీనిని అమలు పరిచేందుకు సిద్ధమయ్యారు.  కేవలం రెండు గంటలు మాత్రమే పేల్చాలన్న సుప్రీం ఆదేశాలను పాటించాలని జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ ఎం.దాన‌కిషోర్ ప్రజలకు పలు సూచనలు చేశారు. జన సంచారం ఎక్కువగా ఉన్న ప్రాంతంలో భారీ శ‌బ్దాలను క‌ల‌గ‌జేసే ట‌పాసులను కాల్చడాన్ని పూర్తిగా నిషేధించినట్లు ఆయన తెలిపారు. నగరవాసులు సుప్రీం ఆదేశాలు ఖచ్చితంగా పాటించాలన్నారు. రేపు(దీపావళి) పండుగ రోజు రాత్రి 8గంట‌ల నుండి 10గంట‌ల‌లోపు మాత్రమే ట‌పాసుల‌ను కాల్చాల‌ని దాన‌కిషోర్ స్పష్టం చేశారు.

ఇదిలావుంటే పర్యావరణానికి నష్టం కలిగించే టపాసులను నిషేధిస్తూ సుప్రీం కోర్టు ఉత్తర్వులు ఇచ్చిన సంగతి తెలిసిందే. తక్కువ కాలుష్యం కలిగించేవాటిని మాత్రమే వినియోగించేందుకు ప్రజలకు అనుమతినిచ్చింది. అయితే వీటిపైనా చాలా కఠినమైన పరిమితులు, షరతులను కోర్టు విధించింది. దీపావళి, ఇతర పండుగలకు రెండు గంటలపాటు.. అర్ధరాత్రి సమయంలో ఉండే క్రిస్మస్‌, నూతన సంవత్సర వేడుకలకు 35 నిమిషాలపాటు టపాసులను కాల్చవచ్చని స్పష్టం చేయగా. తీవ్ర శబ్ద, వాయు కాలుష్యం కలిగించే టపాసులను కాల్చొద్దని ఆదేశించింది. 

Similar News