చిన్నారి గొంతులో విరిగిన టూత్‌బ్రష్‌

Update: 2017-12-23 11:13 GMT

మీ చిన్నారులు బ్రష్ చేస్తున్నారా..? ఆడుతూ పాడుతూ...ఎడా పెడా పళ్లను రుద్దేస్తూ... ? అయితే కాస్త జాగ్రత్త. వారి నోట్లో బ్రష్ ఉన్న ఫళంగా విరిగిపోవచ్చు. గొంతుకు అడ్డంపడి ప్రాణాలకు ప్రమాదం ఏర్పడవచ్చు. ఎందుకంటే విజయనగరం జిల్లాలో ఇదే జరిగింది.

పళ్ళు తోముకోవడం కూడా అంత డేంజరా అనుకుంటున్నారా..? అవునుమరి విజయనగరం జిల్లాలో ఓ టూత్ బ్రష్ ఏడేళ్ల చిన్నారికి మూడు గంటలపాటు నరకాన్ని చూపించింది. విజయనగరం జిల్లా జియమ్మవలస మండలం బిత్తరపాడు గ్రామానికి చెందిన ఏడేళ్ల చిన్నారి విద్యా ప్రసూన ఉదయాన్నే మేడపై ఆటలాడుకుంటూ బ్రష్ చేసుకుంటోంది. ఆటలో అరటిపండులా కాలుజారి పడటంతో బ్రష్ నోటిలో విరిగిపోయింది. ఎంత యత్నించినా తల్లిందడ్రులు బ్రష్ ముక్కను బయటకు తీయలేకపోయారు.

విద్యా ప్రసూన కొండనాలుకకు కింద బ్రష్ ముక్క ఇరుక్కుపోవడంతో రక్తం బాగా కారిపోయింది. నోట్లో నుంచి బ్రష్ ముక్కను తీసేందుకు వీలుపడకపోవడంతో హుటాహుటిన తల్లితండ్రులు పార్వతీపురం ఆస్పత్రికి తీసుకెళ్లారు. గంటసేపు శ్రమించిన తర్వాతగానీ కొండనాలుక కింద ఇరుక్కుపోయిన బ్రష్‌ను తొలగించారు. ఎలాంటి శస్త్రచికిత్స అవసరం లేకుండా బ్రష్‌ను తొలగించడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. 

Similar News