వెంకయ్య ఎదుగుదలలో వాజ్‌పేయి కీలకపాత్ర

Update: 2018-08-18 03:59 GMT

భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి మృతిని భారత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన నాయకత్వంలో ఎన్నో పదవులు అందుకొని ప్రశంసలు అందుకున్నారు. అయితే అటల్‌ ఈ లోకాన్ని విడిచివెళ్లడంతో తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. 

మాజీ ప్రధాని అటల్ బీహార్ వాజ్‌పేయికి లక్షలాది ప్రజలు అశ్రునయనాలతో వీడ్కోలు పలికారు. దేశ విదేశాల నుంచి వచ్చిన ప్రముఖులు వాజ్‌పేయికి కన్నీటితో వీడ్కొలు పలికారు. వాజ్‌పేయితో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని ఉద్వేగానికి లోనయ్యారు. అయితే భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వాజ్‌పేయి అంత్యక్రియల్లో తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు.

వెంకయ్యనాయుడు విద్యార్థి దశ నుంచి జాతీయ స్థాయి నేతగా అంచెలంచెలుగా ఎదగడంలో వాజ్‌పేయి పాత్ర మరువలేనిది. ఆంధ్రా యూనివర్శిటీలో విద్యార్థిగా ఉన్నపుడు వెంకయ్యను జనతా పార్టీలోకి తీసుకున్నారు వాజ్‌పేయి. 1977 నుంచి 1980 వరకు వెంకయ్యనాయుడు జనతాపార్టీ యువ విభాగానికి అధ్యక్షుడిగా వ్యవహరించారు. 1978, 83ల్లో జనతా పార్టీ తరపున ఉదయగిరి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1980లో భారతీయ జనతాపార్టీ యువ విభాగానికి ఉపాధ్యక్షుడిగా పని చేస్తూ వాజ్‌‌పేయి మన్ననలు పొందారు. ఆయన అండతోనే 1988లో ఏపీ బీజేపీ అధ్యక్షుడి ఎన్నికయ్యారు వెంకయ్య నాయుడు.

పార్టీ ప్రధాన కార్యదర్శి, పార్టీ అధ్యక్షుడిగా వెంకయ్యనాయుడు ఎదగడంలో వాజ్‌పేయి పాత్ర ఎంతో ఉంది. వాజ్‌పేయి కేబినెట్‌లో గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రిగా పని చేశారు. తన రాజకీయ ఎదుగుదలకు వెన్నంటి ఉండి ప్రొత్సహించిన వెంకయ్య వాజ్‌పేయి మృతిని జీర్ణించుకోలేకపోతున్నారు. స్మృతిస్థల్‌లో వాజ్‌పేయి అంత్యక్రియలకు హాజరైన వెంకయ్యనాయుడు భౌతికకాయాన్ని చివరిసారి చూసి కన్నీటి పర్యంతమయ్యారు.

Similar News