పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్... ATM లో పీఎఫ్ డబ్బులు డ్రా చేసుకునే టైమ్ ఎంతో దూరంలో లేదు

Update: 2025-03-25 14:37 GMT

PF Withdrawals in ATMs: పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్... ఏటీఎంలో డబ్బులు డ్రా చేసుకునే టైమ్ ఎంతో దూరంలో లేదు

PF Withdrawals in ATMs: ప్రావిడెంట్ ఫండ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్. ఇప్పటివరకు పీఎఫ్ డబ్బులు డ్రా చేయాలంటే అదొక పెద్ద ప్రాసెస్. ఆ ప్రాసెస్ పూర్తి చేశాకా డబ్బులు బ్యాంకు ఖాతాలో జమ అవడానికి కనీసం వారం నుండి రెండు లేదా మూడు వారాలు సమయం పడుతుంటుంది. ముందుగా దరఖాస్తుదారుల క్లెయిమ్ అప్రూవ్ అవ్వాల్సి ఉంటుంది. ఆ తరువాత మరో మూడు పని దినాలు సమయం పడుతుంది. కానీ ఇకపై అలాంటి వెయిటింగ్‌తో పనిలేకుండా మీ ఏటీఎం కార్డు ద్వారానే డబ్బులు డ్రా చేసుకునేందుకు మార్గం ఈజీ కాబోతోంది.

ఈ ఏడాది ఆగస్టు నుండి ఆ సౌకర్యం అందుబాటులోకి తీసుకొస్తామని గతంలోనే కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించిన విషయం తెలిసిందే.

తాజాగా కార్మిక, ఉపాధి శాఖ కార్యదర్శి సుమిత దార ఈ విషయంలో లేటెస్ట్ అప్‌డేట్ అందించారు. సుమిత వెల్లడించిన వివరాల ప్రకారం, పీఎఫ్ డబ్బులను ఏటీఎం కేంద్రాల నుండి విత్‌డ్రా చేసుకునేందుకు ఆగస్టు నెల వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. మే నెలాఖరు లేదా జూన్ నెల నుండే ఆ సౌకర్యం అందుబాటులోకి వస్తుందని సుమిత తెలిపారు.

యూపీఐ ద్వారా పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చని సుమిత అన్నారు. అలాగే రూ. 1 లక్ష వరకు పీఎఫ్ ఖాతాదారులు కోరుకున్న బ్యాంక్ ఎకౌంట్‌కు పీఎఫ్ డబ్బులను తక్షణమే ట్రాన్స్‌ఫర్ చేసేందుకు వీలు కలుగుతుందని చెప్పారు.

అత్యవసరంగా డబ్బులు కావాలనుకునే వారికి ఇలా ఏటీఎం ద్వారా పీఎఫ్ డబ్బు డ్రా చేసుకునే అవకాశం అందుబాటులోకి వస్తే అది నిజంగానే గొప్ప సౌకర్యం అవుతుంది.

ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్‌లో ప్రస్తుతం 7.5 కోట్ల మంది యాక్టివ్ సబ్‌స్క్రైబర్స్ ఉన్నారు. ఇదే కాకుండా ఏ నెలకు ఆ నెల 10-12 లక్షల మంది కొత్త ఖాతాదారులు వచ్చి చేరుతున్నారు. దేశవ్యాప్తంగా 147 ఈపీఎఫ్ఓ రీజినల్ ఆఫీసులు నిరంతరాయంగా సేవలు అందిస్తున్నాయి. ఇంత పెద్ద నెట్‌వర్క్ ఉన్న ఈపీఎఫ్ఓలో సంస్కరణలు తీసుకురావడం అనేది అంత ఆషామాషీ విషయం కాదని సుమిత అభిప్రాయపడ్డారు.

Tags:    

Similar News