PPF-Sukanya: చిన్న పొదుపు పథకాలపై మీకు ఎంత వడ్డీ వస్తుందో తెలుసా?
PPF-Sukanya: చిన్న పొదుపు పథకాలపై మీకు ఎంత వడ్డీ వస్తుందో తెలుసా?
PPF-Sukanya Shemes: కొత్త సంవత్సరం ప్రారంభానికి ముందు చిన్న పొదుపు పథకాలపై పెట్టుబడిదారులు ఆశగా ఎదురుచూసినా.. కేంద్ర ప్రభుత్వం ఈసారి ఎలాంటి మార్పులు చేయలేదు. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF), నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ (NSC), సుకన్య సమృద్ధి యోజనతో పాటు ఇతర అన్ని చిన్న పొదుపు పథకాల వడ్డీ రేట్లు యథాతథంగా కొనసాగనున్నాయి. ఇది వరుసగా ఏడవ త్రైమాసికం కూడా వడ్డీ రేట్లలో మార్పు లేకుండా కొనసాగుతుండటం గమనార్హం.
ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తాజా నోటిఫికేషన్ ప్రకారం.. 2025–26 ఆర్థిక సంవత్సరానికి చెందిన నాల్గవ త్రైమాసికం అంటే జనవరి 1, 2026 నుంచి మార్చి 31, 2026 వరకు అమలులో ఉండే వడ్డీ రేట్లు, గత త్రైమాసికంలో ఉన్నవే కొనసాగుతాయి. దీంతో చిన్న పొదుపు పథకాలలో పెట్టుబడి పెట్టిన వారికి ఉపశమనం కూడా కాదు.. నిరాశ కూడా కాదు అనే పరిస్థితి నెలకొంది.
ప్రస్తుతం సుకన్య సమృద్ధి యోజన కింద డిపాజిట్లపై సంవత్సరానికి 8.2 శాతం వడ్డీ లభిస్తోంది. మూడేళ్ల కాలానికి చేసే టైమ్ డిపాజిట్లపై వడ్డీ రేటు 7.1 శాతంగానే కొనసాగుతుంది. అలాగే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) పై వడ్డీ రేటు 7.1 శాతంగా ఉండగా, పోస్టాఫీస్ సేవింగ్స్ డిపాజిట్ స్కీమ్‌పై 4 శాతం వడ్డీ అందుతుంది.
కిసాన్ వికాస్ పత్ర (KVP) పథకంలో పెట్టుబడి పెడితే 7.5 శాతం వడ్డీ లభిస్తుంది. ఈ పథకం కింద పెట్టుబడి 115 నెలల్లో పరిపక్వతకు చేరుకుంటుంది. మరోవైపు, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ (NSC) పై వడ్డీ రేటు కూడా 7.7 శాతంగా కొనసాగనుంది.
నెలవారీ ఆదాయ పథకం (Monthly Income Scheme) పెట్టుబడిదారులకు ఈ త్రైమాసికంలో కూడా 7.4 శాతం రాబడిని అందించనుంది. పోస్టాఫీసులు మరియు బ్యాంకుల ద్వారా నిర్వహించబడుతున్న ఇతర చిన్న పొదుపు పథకాల వడ్డీ రేట్లలో కూడా ఎలాంటి మార్పు లేదు.
సాధారణంగా ప్రభుత్వం ప్రతి త్రైమాసికానికి ఒకసారి ఈ పథకాల వడ్డీ రేట్లను సమీక్షించి ప్రకటిస్తుంది. గతంలో 2023–24 ఆర్థిక సంవత్సరంలో కొన్ని పథకాలపై మార్పులు చేసిన ప్రభుత్వం, ఈసారి మాత్రం స్థిరత్వానికే ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలుస్తోంది.