ఇకనుంచి ఎస్‌బీఐ ఏటీఎంల నుంచి నగదు డ్రా చేయాలంటే కచ్చితంగా మొబైల్ ఉండాలి..

Update: 2019-12-28 01:35 GMT

రానురానూ ఎటిఎం సంబంధిత మోసాలు పెరగడంతో, బ్యాంకులు తమ కస్టమర్లను సైబర్ మోసాల నుండి రక్షించుకునే మార్గాలను ప్రవేశ పెడుతున్నాయి. దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మోసాలను అరికట్టేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. ఇకనుంచి ఎస్బిఐ ఎటిఎంలో నగదు డ్రా చేయాలంటే కార్డుతోపాటు మొబైల్ ఫోన్ కూడా కంపల్సరీగా ఉండాలి. ఎటిఎంలో నగదు డ్రా చేయడం కోసం వన్ టైమ్ పాస్వర్డ్ ( ఒటిపి ) ఆధారిత నగదు విత్ డ్రా విధానాన్ని ప్రవేశపెడుతోంది. ఈ విధానం వచ్చే ఏడాది జనవరి 1 నుంచి అమల్లోకి రానుంది. దేశంలోని అన్ని ఎస్బిఐ ఎటిఎంలలో ఇది వర్తిస్తుంది. ఆరోజునుంచి వినియోగదారులు రాత్రి 8 నుంచి ఉదయం 8 గంటల మధ్య రూ .10,000 పైన విత్ డ్రా చేసేవారికి ఈ విధానం అమల్లో ఉంటుందని బ్యాంక్ తెలిపింది. ఎస్‌బీఐ కార్డుదారులు ఎటిఎమ్ వద్ద నగదు విత్ డ్రా ప్రక్రియను ప్రారంభించే సమయంలో ఎస్బిఐ బ్యాంకులో రిజిస్టర్ చేయబడిన వారి మొబైల్ నంబర్లో ఓటిపిని అందుకుంటారు అని బ్యాంక్ అధికారిక ఫేస్బుక్ ఖాతాలోని ఒక పోస్ట్ లో పేర్కొంది.

ఇది ఎలా పని చేస్తుందంటే..

ముందుగా ఏటీఎం కార్డును ఏటీఎం మెషీన్‌లో ఉంచి ఎంత నగదు కావాలో ఎంటర్ చేసిన తర్వాత ఖాతాదారుల రిజిస్టర్‌ మొబైల్‌ నంబర్‌కు ఒక ఓటీపీ వస్తుంది. ఆ తరువాత ఏటీఎం స్క్రీన్‌పై ఓటీపీ అడుగుతుంది.ఆ ఓటీపీ నంబర్‌ను ఆ స్క్రీన్ మీద ఎంటర్ చెయ్యాలి.. అప్పుడే నగదు విత్ డ్రా మొదలవుతుంది. తరువాత నగదు డ్రా చేసిన తరువాత ప్రక్రియ ముగుస్తుంది.

అయితే ఈ విధానం ఒక్క ఎస్‌బీఐ ఏటీఎంలలోనే అందుబాటులో ఉంటుందని. ఎస్‌బీఐ ఖాతాదారులు ఇతర బ్యాంకుల ఏటీఎంలలో నగదు ఉపసంహరణకు ఓటీపీ విధానం వర్తించదని ఎస్‌బీఐ పేర్కొంది. ఒకవేళ రాబోయే రోజుల్లో అన్ని బ్యాంకులు ఈ విధానాన్ని ఫాలో అయితే అప్పుడు అన్ని ఏటీఎంలలో ఓటీపీ అవసరముంటుందని పేర్కొంది.

ఈ విధానం వలన బ్యాంకు ఖాతాదారులు తమ కార్డును పోగొట్టుకున్నా లేదా కార్డు వివరాలను మరొకరు తెలుసుకుని అనధికారికంగా, మోసపూరిత లావాదేవీలు చేద్దామనుకున్నా ఇక నుంచి కుదరదు. కచ్చితంగా ఓటీపీ అవసరం ఉంటుంది కాబట్టి మోసం జరగడానికి వీలుందదు. అయితే అదే క్రమంలో ఇతర ఏటీఎంలలో మాత్రం ఈ విధానం అమల్లో ఉండకపోవడం వలన మోసం జరిగే అవకాశం ఉన్నట్టు వినియోగదారులు అభిప్రాయపడుతున్నారు.

Tags:    

Similar News