Indian Economy: ఆ ఏడాది కల్లా అమెరికాను దాటనున్న భారత్.. అమితాబ్ కాంత్ క్లారిటీ
Indian Economy: ప్రస్తుతం నాలుగు ట్రిలియన్ డాలర్ల (4 Trillion Dollars) భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో నాలుగో స్థానంలో ఉంది.
Indian Economy: ఆ ఏడాది కల్లా అమెరికాను దాటనున్న భారత్.. అమితాబ్ కాంత్ క్లారిటీ
Indian Economy: ప్రస్తుతం నాలుగు ట్రిలియన్ డాలర్ల (4 Trillion Dollars) భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో నాలుగో స్థానంలో ఉంది. అమెరికా ప్రస్తుతం ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ గల దేశంగా ఉంది. ఆర్థిక నిపుణుడు, G20 షెర్పా అమితాబ్ కాంత్ ప్రకారం.. భారత్ మరో రెండున్నర దశాబ్దాల్లో అమెరికా ప్రస్తుత GDP స్థాయిని చేరుకోగలదు. 4 ట్రిలియన్ డాలర్లు ఉన్న భారత ఆర్థిక వ్యవస్థ 2047 నాటికి 30 ట్రిలియన్ డాలర్లకు చేరుకోవచ్చని అమితాబ్ కాంత్ చెబుతున్నారు.
ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ స్థానం
ప్రస్తుతం అమెరికా GDP 30 ట్రిలియన్ డాలర్లుగా ఉంది. చైనా ఆర్థిక వ్యవస్థ 19 ట్రిలియన్ డాలర్ల పరిమాణంలో ఉంది. జర్మనీ, జపాన్, భారతదేశం GDP 4 ట్రిలియన్ డాలర్ల కంటే ఎక్కువగా ఉంది. అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలలో భారత్ జర్మనీ కంటే ఒక స్థానం వెనుకబడి ఉంది.
భారత్ యువ జనాభా బలం
ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్ పోర్ట్ అసోసియేషన్ (International Air Transport Association) సమావేశంలో మాట్లాడుతూ అమితాబ్ కాంత్, భారత యువ జనాభా బలాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. "భారత్‌కు జనాభా బలం ఉంది. పాశ్చాత్య దేశాల్లో ప్రజలకు వయసు పెరుగుతోంది. జపాన్‌కు ఇప్పటికే వయసు మీరిపోయింది. చైనా కూడా వయసు పెరుగుతూ వస్తోంది. భారతీయుల సగటు వయసు ఇప్పుడు 28 సంవత్సరాలు ఉంది. 2047లో కూడా సగటు వయసు 35 సంవత్సరాలు ఉంటుంది. ఇది బేబీ బూమర్ల దేశం" అని అమితాబ్ కాంత్ వివరించారు.
భారత్‌కు కొత్త నగరాల అవసరం
భారత్‌లో పట్టణీకరణ ప్రక్రియకు అనుగుణంగా 500 కొత్త నగరాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. వచ్చే ఐదు దశాబ్దాల్లో మనం రెండు అమెరికాలను సృష్టించాలి. ప్రతి ఐదు సంవత్సరాలకు ఒక షికాగో నగరాన్ని ఏర్పాటు చేయాలి. ఇది భారతదేశానికి ఉన్న సవాలు అని మాజీ నీతి ఆయోగ్ (NITI Aayog) చీఫ్ అభిప్రాయపడ్డారు.
400 విమానాశ్రయాల ఏర్పాటు లక్ష్యం
భారత్‌లో ప్రస్తుతం 150కి పైగా విమానాశ్రయాలు పనిచేస్తున్నాయి. 400 విమానాశ్రయాల నిర్మాణం జరగాలి. ప్రజలకు మంచి విమానాశ్రయాలు, మంచి విమానయాన సంస్థలు అవసరమని అమితాబ్ కాంత్ అన్నారు.