GST Reforms in India: కేంద్రం సంచలన ప్రకటన.. జీఎస్టీలో భారీ మార్పులు.. మీ జేబుకు లాభమా, నష్టమా?

GST Reforms in India: దేశంలో జీఎస్టీ సంస్కరణలకు లైన్‌ క్లియర్‌ అయింది. పేదలు, మధ్యతరగతికి ఊరటనిచ్చేలా పన్ను శ్లాబుల కుదింపునకు జీఎస్టీ కౌన్సిల్‌ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

Update: 2025-09-04 07:45 GMT

GST Reforms in India: దేశంలో జీఎస్టీ సంస్కరణలకు లైన్‌ క్లియర్‌ అయింది. పేదలు, మధ్యతరగతికి ఊరటనిచ్చేలా పన్ను శ్లాబుల కుదింపునకు జీఎస్టీ కౌన్సిల్‌ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రస్తుతం 5, 12, 18, 28 శాతంగా ఉన్న పన్ను రేట్లలో 5, 18 పన్ను రేట్లు మాత్రమే కొనసాగనున్నాయి. హానికర, విలాస వస్తువులపై 40శాతం ప్రత్యేక పన్ను విధిస్తారు. ఎప్పటి నుంచో ప్రజలు కోరుతున్న మేరకు ఆరోగ్య, జీవిత బీమాలపై జీఎస్టీ పూర్తిగా రద్దయింది.

పన్ను శ్లాబులను నాలుగు నుంచి రెండుకు తగ్గించారు. ఇకపై 5శాతం, 18శాతం పన్నురేట్లు ఉంటాయి. ఈ మార్పులతో సాధారణ ప్రజలు వినియోగించే నిత్యావసరాల ధరలు చాలా వరకు తగ్గుతాయి. వ్యవసాయ రంగానికి, రైతులకు ప్రయోజనం కలుగుతుంది. ఇది దేశంలో వినియోగాన్ని పెంచి, ఆర్థిక వ్యవస్థకు ఊపునిస్తుంది. హానికర వస్తువుల కేటగిరీలోని పాన్‌ మసాలాలు, గుట్కా, సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తులపై ప్రస్తుతమున్న ధరలే కొనసాగేలా పన్నులు ఉంటాయి.

జీఎస్టీ మార్పులతో చాలా వరకు నిత్యావసరాల ధరలు తగ్గనున్నాయి. ఇప్పటివరకు 5శాతం పన్నురేటులో ఉన్న టెట్రాప్యాక్‌ పాలు, పనీర్‌, బ్రెడ్‌లపై పన్ను పూర్తిగా మినహాయించారు. ఇప్పటివరకు 18శాతం, 12శాతం పన్ను రేట్లలో ఉండి.. ఇకపై 5శాతం పన్ను పరిధిలో వస్తున్న హెయిర్‌ ఆయిల్‌, సబ్బులు, షాంపూలు, టూత్‌ బ్రష్‌లు, సైకిళ్లు, టేబుళ్లు, కుర్చీలు, పాస్తా, నూడుల్స్‌, కాఫీ, కార్న్‌ఫ్లేక్స్‌, బటర్‌, నెయ్యి, హస్తకళాకృతులు, మార్బుల్‌, గ్రానైట్‌తోపాటు కొన్ని రకాల ఔషధాలు, డయాగ్నస్టిక్‌ కిట్లు, కళ్లద్దాలు, సోలార్‌ ప్యానెళ్ల ధరలు తగ్గనున్నాయి.

పెట్రోల్‌, డీజిల్‌, సీఎన్జీ వాహనాలు, వాటి విడిభాగాలపై జీఎస్టీ తగ్గింపుతో కార్లతోపాటు ఆటోలు, బస్సులు, ట్రక్కుల ధరలూ దిగివస్తాయి. ముఖ్యంగా విలాసవంతమైన వాహనాలపై అదనపు సెస్‌ను ఎత్తివేయడంతో వాటి ధరలు మరింతగా తగ్గే అవకాశం ఉంది. ఎలక్ట్రిక్‌ కార్లపై ఎప్పటిలాగే 5శాతం పన్ను కొనసాగనుంది. ఇక 350 సీసీ సామర్థ్యంలోపు ఉన్న ద్విచక్ర వాహనాలను 28శాతం పన్నురేటు నుంచి 18శాతానికి మార్చడంతో.. వాటి ధరలు పది శాతం మేర తగ్గనున్నాయి.

40శాతం ప్రత్యేక పన్ను రేటులోని శీతల పానీయాలు, చక్కెర, ఇతర తీపి పదార్థాలు, కెఫీన్‌ కలిపిన పానీయాలు, పళ్ల రసాల ధరలు కొంతమేర పెరిగే అవకాశం ఉంది. పాన్‌ మసాలాలు, సిగరెట్లు, గుట్కాలు, ఇతర పొగాకు ఉత్పత్తుల ధరల్లో పెద్దగా మార్పులు ఉండవు.18 శాతం పన్నురేటులో మొబైల్‌ ఫోన్లను యథాతథంగా కొనసాగించారు. దీనితో వాటి ధరల్లో మార్పు ఉండదు.

సిమెంట్‌పై పన్నును 28శాతం నుంచి 18శాతానికి తగ్గించారు. దీనితో దేశవ్యాప్తంగా నిర్మాణ రంగానికి ఊరట లభించనుంది. ఇళ్లు, ఫ్లాట్ల ధరలు కాస్త తగ్గేందుకు వీలుంటుంది. ప్రస్తుతం వెయ్యి లోపు ధర ఉన్న వస్త్రాలు, చెప్పులు, బూట్లపై 5శాతం, ఆపై ధర ఉంటే 12శాతం పన్ను వసూలు చేస్తున్నారు. ఇకపై 2,500 వరకు ధర ఉన్న వస్త్రాలు, పాదరక్షలపై 5శాతమే పన్ను వర్తిస్తుంది. అంటే 1000 నుంచి 2,500 వరకు ధర ఉన్న వాటి ధరలు తగ్గుతాయి. అయితే 2,500కుపైన ధర ఉండే వస్త్రాలు, పాదరక్షలు 18శాతం పన్నురేటులోకి వెళతాయి. అంటే.. వాటి ధరలు పెరుగుతాయి.

బొగ్గు, బొగ్గు ఆధారిత ఇంధనాలపై జీఎస్టీని ప్రస్తుతమున్న 5శాతం నుంచి 18శాతానికి పెంచారు. దీనితో బొగ్గు ధరలు పెరుగుతాయి. బొగ్గును వినియోగించే థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలపై తీవ్ర భారం పడుతుంది. విద్యుత్‌ ఉత్పత్తి వ్యయం పెరుగుతుంది. బొగ్గును వినియోగించే ఉక్కు, సిమెంటు, ఎరువులు, రసాయన పరిశ్రమలకూ భారంగా మారుతుంది. మరోవైపు బొగ్గు డిమాండ్‌ పెంచేందుకు సింగరేణి ధరలు తగ్గించాల్సి వస్తుంది. దీనితో సంస్థపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది. ఇక సిమెంట్‌పై పన్ను తగ్గించినా.. బొగ్గుపై పన్ను పెరగడంతో ధరలు తగ్గే అవకాశం ఉండదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

పలు రకాల ఔషధాలు, వైద్య పరికరాలు, డయాగ్నస్టిక్‌ కిట్లు వంటివాటిపై ఇప్పటివరకు 12శాతం, 18శాతం వరకు పన్నులు ఉండగా.. ఇప్పుడన్నింటినీ 5శాతం పన్ను పరిధిలోకి తెచ్చారు. ముఖ్యంగా కేన్సర్‌, ఇతర ప్రాణాధార, అత్యవసర ఔషధాలపై జీఎస్టీని పూర్తిగా ఎత్తివేశారు. దీనితో ప్రజా ఆరోగ్య భద్రతకు మేలు కలగనుంది.

350సీసీలోపు మోటారు సైకిళ్ల ధరలు తగ్గుతాయి. వీటిపై 28 శాతం జీఎస్టీ 18 శాతానికి తగ్గనుంది. రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌, కేటీఎం వంటి 350సీసీ కంటే ఎక్కువ ఇంజన్‌ సామర్థ్యం బైక్‌ల ధరలు పెరుగుతాయి. ఇప్పటి వరకు వీటిపై 28 శాతం జీఎస్టీతో పాటు 2-3 సెస్‌ విధిస్తున్నారు. ఇక నుంచి సెస్‌ ఉండదు కానీ 40 శాతం పన్ను పరిధిలోకి వెళతాయి.

దుర్గా నవరాత్రుల మొదటి రోజు అయిన సెప్టెంబర్‌ 22వ తేదీ నుంచి జీఎస్టీ సంస్కరణలు అమల్లోకి వస్తాయి. దేశంలోని సాధారణ ప్రజలకు ప్రయోజనం కలిగించేందుకే జీఎస్టీ సంస్కరణలు చేపట్టారు. ‘జీఎస్టీలో వినూత్న సంస్కరణలు తీసుకువస్తామని ప్రధాని మోదీ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ప్రకటించారు. ఈ సంస్కరణలు కేవలం పన్నురేట్ల హేతుబద్ధీకరణ మాత్రమేకాదు.. పేదలు, మధ్యతరగతి వారికి ఉపశమనం కలిగేలా, సులభతర వ్యాపారాన్ని ప్రోత్సహించేలా ఉండటమే లక్ష్యంగా సమీక్ష జరిపి నిర్ణయాలు తీసుకున్నారు.

దేశంలో ప్రజల ఆరోగ్య భద్రతకు ప్రాధాన్యత ఇస్తున్నామని నిర్మల చెప్పారు. వ్యక్తిగత జీవిత బీమా, ఆరోగ్య బీమా, ఫ్లోటర్‌ పాలసీలు, సీనియర్‌ సిటిజన్ల పాలసీల ప్రీమియంపై జీఎస్టీని పూర్తిగా రద్దు చేయాలని నిర్ణయించామని ప్రకటించారు. వ్యాపారులకు జీఎస్టీ రిజిస్ట్రేషన్‌, రిటర్నుల ఫైలింగ్‌, రీఫండ్‌ ప్రక్రియలను సులభతరం చేస్తున్నామని, మానవ శ్రమ అవసరమయ్యే పరిశ్రమలను ప్రోత్సహించేలా చర్యలు చేపడుతున్నామని చెప్పారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ఆరోగ్య, జీవిత బీమాపై జీఎస్టీతో 16,398 కోట్లు వసూలు చేసింది. ఇందులో జీవిత బీమా నుంచి 8,135 కోట్లు, ఆరోగ్య బీమా నుంచి 8,263 కోట్లు వచ్చాయి. జీఎష్టీ నిర్ణయాలకు మద్దతు తెలిపిన అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులకు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ధన్యవాదాలు తెలిపారు.

Tags:    

Similar News