Gold Rate Today: పండగ వేళ.. రికార్డు స్థాయిల నుంచి దిగొచ్చిన బంగారం, వెండి ధరలు..నేటి ధరలు ఎలా ఉన్నాయంటే?
Gold Rate Today: పండగ వేళ.. రికార్డు స్థాయిల నుంచి దిగొచ్చిన బంగారం, వెండి ధరలు..నేటి ధరలు ఎలా ఉన్నాయంటే?
Gold Rate Today: బంగారం, వెండి ధరలు గరిష్ఠ స్థాయిల నుంచి కొద్దిగా దిగివచ్చాయి. ఇటీవల వరుసగా రికార్డు స్థాయిలకు చేరుకోవడంతో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడం ఈ తగ్గుదలకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో ఫిబ్రవరి డెలివరీ గోల్డ్ ఫ్యూచర్స్ ధర 0.44 శాతం తగ్గి 10 గ్రాములకు రూ.1,41,400 వద్ద ట్రేడైంది.
వెండి విషయానికి వస్తే, మార్చి ఫ్యూచర్స్ ధరలో పెద్దగా మార్పు కనిపించలేదు. కిలో వెండి ధర దాదాపు యథాతథంగా రూ.2,68,926 వద్ద కొనసాగింది. ఇండియా బులియన్ అండ్ జువెలర్స్ అసోసియేషన్ (IBJA) విడుదల చేసిన గణాంకాల ప్రకారం, 24 క్యారెట్ల బంగారం ధర సోమవారంతో పోలిస్తే స్వల్పంగా తగ్గి 10 గ్రాములకు రూ.1,40,482గా నమోదైంది.
అంతర్జాతీయ మార్కెట్లలో పసిడి ధరలు చరిత్రాత్మక గరిష్ఠాలకు చేరడం కూడా ప్రాఫిట్ బుకింగ్‌కు దారి తీసింది. తొలిసారిగా ఔన్స్ బంగారం ధర 4,600 డాలర్ల స్థాయిని దాటడంతో ఇన్వెస్టర్లు జాగ్రత్తగా వ్యవహరించడం మొదలుపెట్టారు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ చైర్మన్‌పై న్యాయ శాఖ చర్యలు తీసుకునే అవకాశాలపై వస్తున్న వార్తలు, అలాగే ఇరాన్‌తో వ్యాపారం చేసే దేశాలపై 25 శాతం సుంకాలు విధిస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన హెచ్చరికలు బంగారం ధరలను ఇటీవల బలపరిచిన అంశాలుగా మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
ఫెడ్ చైర్మన్ జెరోమ్ పావెల్‌కు సంబంధించిన క్రిమినల్ విచారణ అంశంపై ఇన్వెస్టర్లు నిశితంగా దృష్టి సారిస్తున్నారని మెహతా ఈక్విటీస్ లిమిటెడ్ వైస్ ప్రెసిడెంట్ రాహుల్ కలాంత్రి తెలిపారు. మరోవైపు అమెరికాలో బలహీనంగా నమోదవుతున్న ఉద్యోగ గణాంకాల నేపథ్యంలో ఈ ఏడాది ఫెడరల్ రిజర్వ్ రెండు సార్లు వడ్డీ రేట్లు తగ్గించే అవకాశం ఉందన్న అంచనాలు కూడా బంగారం మార్కెట్‌కు మద్దతు ఇస్తున్నాయి. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం, ఇరాన్‌లో రాజకీయ అస్థిరత వంటి భౌగోళిక ఉద్రిక్తతలు కూడా పసిడి ధరలను నిలబెట్టే కారకాలుగా కొనసాగుతున్నాయి.
సాంకేతికంగా చూస్తే, బంగారానికి రూ.1,39,550 వద్ద కీలక మద్దతు స్థాయి ఉండగా, రూ.1,44,350 వద్ద నిరోధం కనిపిస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. వెండి ధరకు రూ.2,60,810 వద్ద సపోర్ట్, రూ.2,71,810 వద్ద రెసిస్టెన్స్ స్థాయిలు ఉన్నట్లు అంచనా. పారిశ్రామిక రంగం, గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుల నుంచి వెండికి పెరుగుతున్న డిమాండ్ నేపథ్యంలో 2026 నాటికి ఔన్స్ వెండి ధర 100 డాలర్లకు మించవచ్చని నిపుణులు భావిస్తున్నారు.