Tesla Robotaxi: టెస్లా రోబోటాక్సీ వచ్చేసింది.. ఇండియాలో డ్రైవర్‌లెస్ కార్లు సాధ్యమా?
Tesla Robotaxi: ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న టెస్లా కంపెనీ రోబోటాక్సీ సేవలు మొత్తానికి మొదలయ్యాయి. ఎలాన్ మస్క్ కంపెనీ హెడ్ ఆఫీస్ ఉన్న ఆస్టిన్ నగరంలో ఈ డ్రైవర్‌లెస్ కార్లు రోడ్ల మీద తిరగడం ప్రారంభించాయి.
Tesla Robotaxi: టెస్లా రోబోటాక్సీ వచ్చేసింది.. ఇండియాలో డ్రైవర్‌లెస్ కార్లు సాధ్యమా?
Tesla Robotaxi: ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న టెస్లా కంపెనీ రోబోటాక్సీ సేవలు మొత్తానికి మొదలయ్యాయి. ఎలాన్ మస్క్ కంపెనీ హెడ్ ఆఫీస్ ఉన్న ఆస్టిన్ నగరంలో ఈ డ్రైవర్‌లెస్ కార్లు రోడ్ల మీద తిరగడం ప్రారంభించాయి. కొంతమంది సోషల్ మీడియాలో ఈ రోబోటాక్సీలో ప్రయాణించిన ఫోటోలు, వీడియోలు, వారి ఎక్స్ పీరియన్స్ షేర్ చేశారు. ఎలాన్ మస్క్ స్వయంగా తన ఎక్స్ అకౌంట్ ద్వారా రోబోటాక్సీ సేవలు మొదలయ్యాయని ప్రకటించారు. ప్రతి ట్రిప్‌కు రూ. 360 రేటు నిర్ణయించినట్లు తెలిపారు. ఇవి జియోఫెన్స్డ్ ప్రాంతంలో అంటే, ఒక నిర్దిష్ట పరిధిలోని ఏరియాలో మాత్రమే తిరుగుతాయట.
టెస్లా మాత్రమే కాదు, ఇంకా చాలా పెద్ద కంపెనీలు ఈ డ్రైవర్‌లెస్ కార్ల ప్రయోగాలను చేస్తున్నాయి. గూగుల్, ఊబర్ కలిసి గత సంవత్సరం వేమో సర్వీస్‌ను మొదలుపెట్టాయి. ఈ వేమో సేవలు బాగానే ఉన్నా, కొన్ని సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. అమెరికాలోని లాస్ ఏంజెల్స్, ఆస్టిన్, శాన్ ఫ్రాన్సిస్కో, ఫీనిక్స్ నగరాల్లో ఇప్పటికే 1,500కి పైగా డ్రైవర్‌లెస్ వాహనాలు తిరుగుతున్నాయి. అలాగే, అమెజాన్ కంపెనీకి చెందిన జూక్స్ కూడా ఇటీవల తమ ట్రయల్ రన్‌లను ప్రారంభించింది.
అమెరికా లాంటి చోట్ల, రోడ్లు చాలా స్పష్టంగా, మంచి మౌలిక సదుపాయాలతో ఉన్నా కూడా డ్రైవర్‌లెస్ కార్లు కొన్ని సమస్యలను ఎదుర్కొంటున్నాయి. మరి, భారత్ లాంటి సంక్లిష్టమైన ట్రాఫిక్, రోడ్ల వ్యవస్థ ఉన్న చోట అవి పని చేయడం సాధ్యమా? అనేది పెద్ద ప్రశ్న. మన రోడ్లపై సరైన సైన్‌బోర్డులు లేకపోవడం, లేన్ డివిజన్ సరిగా లేకపోవడం లాంటి చాలా సమస్యలు ఉన్నాయి. అయినప్పటికీ, చాలా కంపెనీలు, స్టార్టప్‌లు డ్రైవర్‌లెస్ వాహనాల కోసం ప్రయత్నిస్తున్నాయి. ప్రభుత్వం కూడా ఈ దిశగా కొన్ని చట్ట సవరణలు చేసింది.
బెంగళూరుకు చెందిన మైనస్ జీరో అనే స్టార్టప్, అశోక్ లేలాండ్ కంపెనీతో కలిసి డ్రైవర్‌లెస్ వాహనాలను అభివృద్ధి చేస్తున్నాయి. టాటా మోటార్స్, టెక్ మహీంద్రా, బెంగళూరులోని స్వాయత్ రోబోస్, నయన్ టెక్నాలజీస్, రోజ్ఏఐ లాంటి మరికొన్ని స్టార్టప్‌లు, కంపెనీలు ఆటోనమస్ వాహనాల అభివృద్ధిలో నిమగ్నమై ఉన్నాయి. ప్రస్తుతానికి, ఈ డ్రైవర్‌లెస్ వాహనాలను సముద్ర ఓడరేవులు, ఫ్యాక్టరీ ప్రాంగణాలు లాంటి నియంత్రిత ప్రాంతాల్లో మాత్రమే నడుపుతున్నారు. బెంగళూరు లాంటి భారీ ట్రాఫిక్ ఉన్న నగరాల్లో ఇవి సులభంగా తిరగాలంటే పదేళ్లు అయినా పట్టొచ్చు అని నిపుణులు చెబుతున్నారు.