Skoda Kylaq: సేఫ్టీ రేటింగ్స్‌లో 5 స్టార్ కారు.. ఫీచర్లు ఎలా ఉన్నాయో తెలుసా?
Skoda Kylaq: స్కోడా ఇండియా దేశీయ విపణిలో అత్యంత సరసమైన ఎస్‌యూవీ కైలాక్‌ని విడుదల చేసింది. ఈ కారు ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 7.89 లక్షలు. టాప్ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 14.40 లక్షల వరకు ఉంటుంది. అయితే ఇటీవల ఈ 5 స్టార్ సేఫ్టీ రేటెడ్ ఎస్‌యూవీ బేస్ వేరియంట్ బుకింగ్ నిలిపివేసింది. తాజాగా మళ్లీ బుకింగ్ ప్రారంభించినట్లు స్కోడా ఇండియా ప్రకటించింది. ఆ పూర్తి వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
27 జనవరి 2025 నుండి బేస్ వేరియంట్ క్లాసిక్ ఆఫ్ కైలాక్ బుకింగ్‌ను తిరిగి ప్రారంభించనున్నట్లు స్కోడా ఆటో ఇండియా వెల్లడించింది. అలాగే స్కోడా కైలాక్ కూడా డీలర్స్ వద్దకు చేరుకుంటోంది. ఈ కారు టెస్ట్ డ్రైవ్ కూడా చాలా చోట్ల ప్రారంభమైంది. కైలాక్ మొదటి షిప్‌మెంట్ ఫిబ్రవరి మొదటి వారంలో డెలివరీ అవుతుందని భావిస్తున్నారు.
స్కోడా కైలాక్ ఎల్‌ఈడీ డీఆర్ఎల్‌లు, ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లతో కూడిన స్ప్లిట్ హెడ్‌ల్యాంప్ సెటప్, 17-అంగుళాల అల్లాయ్ వీల్స్, రౌండ్ టెయిల్ ల్యాంప్స్ ఉంటాయి. కైలాక్ పొడవు 3995 మిమీ, వెడల్పు 1783 మిమీ, ఎత్తు 1619 మిమీ. దీని వీల్‌బేస్ 2566 mm, ఇది 189 mm గ్రౌండ్ క్లియరెన్స్‌తో వస్తుంది.
ఇక కారు ఇంటీరియర్ విషయానికొస్తే... స్కోడా కైలాక్‌లో సైడ్ ఏసీ వెంట్స్, క్లైమేట్ కంట్రోల్ ప్యానెల్, టూ-స్పోక్ స్టీరింగ్, 8-అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 10-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ డిస్‌ప్లే, సన్‌రూఫ్, కీలెస్ ఎంట్రీ, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్, కూల్డ్ 446 లీటర్లు ఉన్నాయి. భారీ బూట్ స్పేస్ సౌకర్యం కూడా అందుబాటులో ఉంది.
భద్రత పరంగా స్కోడా కైలాక్ స్టాండర్డ్ 6 ఎయిర్‌బ్యాగ్స్, ఈబీడీతో కూడిన యాంటీ-లాక్ బ్రేక్స్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, చైల్డ్ సీట్ మౌంట్‌లతో సహా మొత్తం 25 కంటే ఎక్కువ స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్లు ఉంటాయి. భారత్ ఎన్‌క్యాప్ ఈ సబ్-ఫోర్-మీటర్ ఎస్‌యూవీకి 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ ఇచ్చింది.
స్కోడా కైలాక్‌లో 1.0 లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ ఉంది. ఇది గరిష్టంగా 115 పిఎస్ పవర్, 178 ఎన్ఎమ్ పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. వినియోగదారులు ఈ కారును 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ లేదా 6-స్పీడ్ టార్క్-కన్వర్టర్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్‌లతో కొనుగోలుచేయొచ్చు.
స్కోడా కైలాక్ లీటర్‌పై 17.75 నుంచి 18.5 కిమీ మైలేజ్ వరకు ఇస్తుంది. ఇక స్కోడా కైలాక్ ఇంజన్ పనితీరు విషయానికొస్తే... స్కోడా నుండి ఈ సరసమైన ఎస్‌యూవీ కేవలం 10.5 సెకన్లలో 0-100 కెఎమ్/హెచ్ వేగాన్ని అందుకుంటుంది. ఈ కారు ముందు టైర్లకు డిస్క్ బ్రేక్స్, వెనుక టైర్లకు డ్రమ్ బ్రేక్స్ ఉన్నాయి.