Air Taxi: ఆకాశంలో ఎయిర్ ట్యాక్సీలు.. ఇక నుంచి ఎక్కడికైనా నిమిషాల్లో వెళ్లొచ్చు
Air Taxi: ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో నివసిస్తున్న ప్రజలు ప్రతిరోజూ ఉదయం తమ కార్యాలయానికి చేరుకోవడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. వాస్తవానికి దీనికి కారణం అధిక ట్రాఫిక్. ఒక్కసారి ట్రాఫిక్‌లో చిక్కుకుపోతే సమయానికి ఆఫీసుకు చేరుకోవడం సాధ్యం కాదు. త్వరలో ఈ సమస్యలకు చెక్ పడనుంది. ఎయిర్ టాక్సీ మార్కెట్లోకి రాబోతోంది. ఇది మిమ్మల్ని కొన్ని నిమిషాల్లో మీ కార్యాలయానికి తీసుకెళ్తుంది.
బ్లూ యారో కంపెనీ తన ఎయిర్ టాక్సీని గ్రేటర్ నోయిడాలోని ఇండియా ఎక్స్‌పో మార్ట్‌లో ప్రవేశపెట్టింది. ఈ టాక్సీ సాంకేతికత, సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని రూపొందించారు. అలానే ఇది మంచి వేగాన్ని అందిస్తుంది, తద్వారా మీరు మీ గమ్యాన్ని సౌకర్యవంతంగా చేరుకోవచ్చు. అలాంటిది ఇప్పటి వరకు కనిపించకపోవడంతో అందరి దృష్టి ఈ ఎయిర్ ట్యాక్సీపైకి వెళుతోంది.
ఈ సందర్భంగా బ్లూ యారో కంపెనీ సీఈఓ అమర్ మాట్లాడుతూ.. గ్రేటర్ నోయిడా నుండి ఢిల్లీ చాలా దూరంలో లేనప్పటికీ, ట్రాఫిక్ జామ్‌ల కారణంగా చాలా గంటలు వృధా అవుతున్నాయని, అందుకే ఈ ఎయిర్ టాక్సీ రాకతో ప్రజలకు చాలా సమయం ఆదా అవుతుందని అన్నారు. ఇది ఒక్కసారి ఛార్జింగ్‌లో 600 కిలోమీటర్ల దూరం వరకు వెళ్లగలదు, అంటే ఢిల్లీ నుండి లక్నో వరకు ఒకే విమానంలో చేరుకోవచ్చు.
కంపెనీ నుండి అందిన సమాచారం ప్రకారం.. టాక్సీ ధర చాలా తక్కువగా ఉంటుంది, ఇది ప్రజల జేబులపై భారం పడదు. ఢిల్లీ నుండి గ్రేటర్ నోయిడాకు దూరానికి రూ. 2,000 నుండి 2,200 మాత్రమే ఉంటుంది. ఈ ఎయిర్ టాక్సీ ద్వారా సుమారు 100 కిలోల బరువును రవాణా చేయవచ్చు.