YSRCP: వైఎస్సార్‌సీపీకి 13 ఏళ్లు పూర్తి.. 14వ వసంతంలోకి అడుగులు

YSRCP: ఏపీలో తిరుగులేని శక్తిగా వైఎస్సార్‌సీపీ

Update: 2024-03-12 06:47 GMT

YSRCP:  వైఎస్సార్‌సీపీకి 13 ఏళ్లు పూర్తి.. 14వ వసంతంలోకి అడుగులు

Jagan: సీఎం జగన్ నేతృత్వంలోని వైసీపీ 14వ వసంతంలోకి అడుగుపెట్టింది. ఎన్నో శ్రమలకు ఓర్చి.. ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్న వైసీపీ.. నవరత్నహామీలతో, విశ్వనీయతను ప్రచారం చేసుకొని 2009లో ఏపీలో అధికారాన్ని హస్తగతం చేసుకుంది. 2019 ఎన్నికల్లో 50 శాతం ఓట్లు.., 151 శాసనసభ, 22 లోక్‌సభ స్థానాల్లో విజయం సాధించి చరిత్ర సృష్టించింది. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి కృషి చేస్తున్న క్రమంలో మహానేత వైఎస్సార్ 2009, సెప్టెంబరు 2న హెలీకాప్టర్‌ ప్రమాదంలో హఠాన్మరణం చెందారు. ఈ విషాదాన్ని తట్టుకోలేక వందలాది మంది అభిమానులు మరణించడం వైఎస్‌ జగన్‌ను, ఆయన కుటుంబీకులను కలచివేసింది.

వారిని పరామర్శించేందుకు ఓదార్పు యాత్ర చేపడతానని కర్నూలు జిల్లా నల్లకాలువ వద్ద 2009, సెప్టెంబరు 25న నిర్వహించిన వైఎస్సార్ సంస్మరణ సభలో జగన్‌ ప్రకటించారు. ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడిన వైఎస్‌ జగన్‌ 2010, ఏప్రిల్‌ 9న ఓదార్పు యాత్రను పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ప్రారంభించారు. యాత్రను ఆపేయాలని కాంగ్రెస్‌ అధిష్టానం ఆదేశించింది. ఓదార్పు యాత్ర ఉద్దేశాన్ని కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీకి వైఎస్‌ జగన్‌ వివరించినా లాభం లేకపోయింది. ఇచ్చిన మాటకు కట్టుబడి వైఎస్‌ జగన్‌ ఓదార్పు యాత్ర కొనసాగించారు. ఓదార్పు యాత్రకు ప్రజల నుంచి అపూర్వ ఆదరణ లభించింది.

వైఎస్‌ జగన్‌ ఆస్తులపై విచారణ జరిపించాలని నాటి కాంగ్రెస్‌ ఎమ్మెల్యే శంకర్‌రావుతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి కాంగ్రెస్‌ అధిష్టానం లేఖ రాయిస్తే.. నాటి టీడీపీ ఎంపీ కె.ఎర్రన్నాయుడితో టీడీపీ లేఖ రాయించింది. కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కై కుట్రలు చేస్తుండటంతో తన తల్లి విజయమ్మతో కలిసి వైఎస్‌ జగన్‌ కాంగ్రెస్‌కు, పులివెందుల ఎమ్మెల్యే, కడప ఎంపీ స్థానాలకు రాజీనామాలు చేశారు. ఆ తర్వాత ఓ వైపు ఓదార్పు యాత్రను కొనసాగిస్తూనే.. మరో వైపున ప్రజా సమస్యల పరిష్కారం కోసం జగన్‌ ఉద్యమబాట పట్టారు. ఈ క్రమంలోనే రైతులు, చేనేత కార్మికులను ఆదుకోవాలని డిమాండ్‌ చేస్తూ 2010, డిసెంబర్‌ 21న విజయవాడలో కృష్ణా నదీ తీరాన ‘లక్ష్యదీక్ష’ చేపట్టారు.

కాంగ్రెస్‌ను వైఎస్‌ జగన్‌ వీడిన తర్వాత జగతి పబ్లికేషన్స్‌కు ఆదాయపు పన్ను శాఖతో నోటీసులు జారీ అయ్యాయి. అయినా వాటిని లెక్క చేయని వైఎస్‌ జగన్‌.. మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఆశయ సాధనే లక్ష్యంగా.. రాష్ట్ర సమగ్రాభివృద్ధే ధ్యేయంగా 2011, మార్చి 11న వైఎస్సార్‌సీపీ పేరును ప్రకటించారు. ఆ మరుసటి రోజే వైఎస్సార్‌ జిల్లా ఇడుపులపాయలో మహానేత వైఎస్‌ సమాధి వద్ద వైఎస్సార్‌సీపీ పతాకాన్ని ఆవిష్కరించి.. పార్టీని స్థాపిస్తున్నట్లు మార్చి 12న ప్రకటించారు.

వైఎస్‌ జగన్, విజయమ్మల రాజీనామాతో ఖాళీ అయిన కడప లోక్‌సభ, పులివెందుల శాసనసభ స్థానానికి ఎన్నికలు నిర్వహించడానికి 2011, ఏప్రిల్‌ 12న కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ జారీ చేసింది. కడప లోక్‌సభ స్థానం నుంచి వైఎస్‌ జగన్, పులివెందుల శాసనసభ స్థానం నుంచి వైఎస్‌ విజయమ్మ వైఎస్సార్‌సీపీ అభ్యర్థులుగా పోటీ చేశారు. రెండు చోట్లా రికార్డు మెజార్టీతో గెలిచారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యే శంకర్‌రావుతో వైఎస్‌ జగన్‌పై హైకోర్టులో కేసు వేయించారు. ఈ కేసులో టీడీపీ నేతలు ప్రతివాదులుగా చేరడంతో.. దానిపై హైకోర్టు విచారణ చేపట్టింది. 2011, ఆగస్టు 10న జగన్‌ ఆస్తులపై సీబీఐ విచారణకు హైకోర్టు ఆదేశించింది.

రాష్ట్ర విభజన నేపథ్యంలో 2014లో ఎన్నికల్లో ఒంటరిగా వైఎస్సార్‌సీపీని వైఎస్‌ జగన్‌ బరిలోకి దించారు. టీడీపీ–బీజేపీ–జనసేన జట్టుకట్టి బరిలోకి దిగాయి. నరేంద్ర మోదీ ప్రభంజనంలో కేవలం ఐదు లక్షల ఓట్ల తేడాతో రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ అధికారానికి దూరమైంది. 67 శాసనసభ స్థానాలు, ఏడు లోక్‌సభ స్థానాలు గెలుచుకున్న వైఎస్సార్‌సీపీ బలమైన ప్రతిపక్షంగా అవతరించింది. టీడీపీ అరాచకాలను నిలదీస్తూ ప్రజల పక్షాన ప్రతిపక్ష నేతగా ఇటు శాసనసభలోనూ అటు బయటా రాజీలేని పోరాటాలు చేశారు.

మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి సమాధి వద్ద నుంచి 2017, నవంబర్‌ 6న ప్రజా సంకల్ప పాదయాత్రను వైఎస్‌ జగన్‌ ప్రారంభించారు. 14 నెలలపాటు 3,648 కి.మీ.ల దూరం సాగిన పాదయాత్రను 2019, జనవరి 9న శ్రీకాకుళం జిల్లాలో ఇచ్ఛాపురం వద్ద ముగించారు. రాయలసీమ, కోస్తా, ఉత్తరాంధ్రల్లో పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. 2019 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి అఖండ విజయాన్ని ప్రజలు అందించారు.

50 శాతానికిపైగా ఓట్లతో 151 శాసనసభ, 22 లోక్‌సభ స్థానాలను గెలుచుకుంది. వైఎస్సార్‌సీపీ అఖండ విజయం సాధించడంతో 2019, మే 30న ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. తొలి మంత్రివర్గంలో 56 శాతం పదవులను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఇచ్చి 2022, ఏప్రిల్‌ 11న పునర్‌వ్యవస్థీకరణ ద్వారా ఏర్పాటు చేసిన మంత్రివర్గంలో ఏకంగా 70 శాతం పదవులు ఆ వర్గాలకు అందించారు.

సీఎం జగన్ ఐదేళ్ల పాలనలో సంక్షేమానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. అయితే రాష్ట్రంలో అప్పులు, సకాలంలో జీతాలు చెల్లించలేకపోవడం, పార్టీ శ్రేణుల్లో పెరిగిన అవినీతి, బంధుప్రీతి వైసీపీని చిక్కుల్లోకి నెడుతున్నాయి. 2014 ఎన్నికల కోసం వైఎస్సార్‌సీపీ శ్రేణులను ఎన్నికలకు సన్నద్ధం చేయడానికి భీమిలి, దెందులూరు, రాప్తాడు, మేదరమెట్లలో నిర్వహించిన సిద్ధం సభలు విజయవంతం కావడంతో వైఎస్సార్సీపీ శ్రేణులు 14వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకుంటున్నాయి.

Tags:    

Similar News