YS Sharmila: ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల..!

YS Sharmila: షర్మిల నియామకానికి రంగం సిద్ధం

Update: 2023-12-26 08:41 GMT

YS Sharmila: ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల..!

YS Sharmila: ఏపీలో రాజకీయం అనూహ్య మలుపులు తిరుగుతోంది. కాంగ్రెస్ హైకమాండ్ ఏపీపై ఫోకస్ చేసింది. వైఎస్ షర్మిలకు ఏపీలో కీలక బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించింది. ఈ మేరకు మంత్రాంగం కొనసాగుతోంది. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా షర్మిల నియామకానికి రంగం సిద్దమైనట్లు సమాచారం. వచ్చే ఎన్నికల్లో ఏపీ నుంచే షర్మిల పోటీ చేస్తారని తెలుస్తోంది. ఇక ఢిల్లీలో ఏపీకి సంబంధించిన మంత్రాంగం కొనసాగుతోంది. కొత్త అధ్యక్ష బాధ్యతలు... పొత్తుల పైన ప్రకటన చేయనుంది.

వైఎస్ షర్మిల ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా నియమితులు కావటం ఖాయమైనట్లు సమాచారం. కర్ణాటక, తెలంగాణలో గెలుపు తర్వాత కాంగ్రెస్ దక్షిణాదిన తమ బలం పెంచుకోవాలని భావిస్తోంది. అందులో భాగంగా ఇప్పుడు ఏపీలో తీసుకోవాల్సిన నిర్ణయాలపై ఫోకస్ చేసింది. అన్న చెప్పినా కాదని తెలంగాణలో YSRTP ఏర్పాటు చేసిన షర్మిల... కాంగ్రెస్‌తో విలీనం కోసం ప్రయత్నించారు.

అయితే తెలంగాణ కాంగ్రెస్ నేతల అభ్యంతరాలతో తన పార్టీని విలీనం చేయలేదు. కనీసం షర్మిలకు ప్రచారానికి అవకాశం ఇవ్వలేదు. దీంతో... అటు ఎన్నికల్లో పోటీ చేయకుండా... ఇటు కాంగ్రెస్‌లో చేరకుండా షర్మిల స్తబ్దుగా ఉండిపోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో షర్మిలకు కీలక బాధ్యతలు అప్పగించాలని కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయించింది.

షర్మిల తాను తెలంగాణ రాజకీయాలకే పరిమితం అవుతానని గతంలో స్పష్టం చేశారు. అయితే కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్, ప్రియాంకతోనూ సమావేశాలు నిర్వహించారు. వైఎస్సార్ పేరు సీబీఐ ఛార్జ్‌షీట్‌లో చేర్చటం గురించి సమాచారం లోపంతోనే జరిగిందంటూ షర్మిల చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చకు కారణమమయ్యాయి. ఇప్పుడు షర్మిలను ఏపీ పార్టీ వ్యవహారాల్లో కీలకంగా వ్యవహారించేలా పార్టీ నేతలు ఒప్పించినట్లు తెలుస్తోంది.

తాజాగా షర్మిల క్రిస్మస్ వేళ పలువురికి గిఫ్ట్‌లు పంపారు. అందులో నారా కుటుంబానికి పంపిన గిప్ట్... లోకేష్ థాంక్స్ చెబుతూ చేసిన ట్వీట్ వైరల్ అయ్యింది. ఇప్పుడు షర్మిలకు ఏపీ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు అప్పగించేందుకు ఒప్పించారని ఢిల్లీ నేతల సమాచారం. కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ నేతలు సోనియాగాంధీ, రాహుల్‌ గాంధీలతో షర్మిల విషయం ఇప్పటికే చర్చించారని సమాచారం.

పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్‌గా నియమితులైన మాణిక్కం ఠాగూర్‌కు కూడా ఈ విషయంపై సంకేతాలు ఇచ్చారని చెబుతున్నారు. ఈ నెల 27న ఏపీలో పార్టీ వ్యవహారాల పైన రాహుల్ గాంధీ కీలక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ భేటీలో షర్మిల అంశంతో పాటుగా ఏపీలో పొత్తులు, రాష్ట్రంలో ప్రియాంక పర్యటన పైన క్లారిటీ రానుంది. ఇక... వచ్చే ఎన్నికల్లో షర్మిల పోటీ చేస్తారని సమాచారం. ఏపీలో తన అన్న ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో కాంగ్రెస్ నుంచి షర్మిల ఎలాంటి పాత్ర పోషించటానికి సిద్దం అవుతున్నారనే దానిపై స్పష్టత ఇవ్వాల్సి ఉంది.

Tags:    

Similar News