ఏ పదవిని త్యాగం చేసి పార్టీలోకి వచ్చారో అదే పదవితో సత్కారం.. నమ్మినవాళ్లకు న్యాయం చేయడం..

Update: 2021-01-11 14:06 GMT

నమ్మినవాళ్లకు న్యాయం చేస్తారు. పార్టీ విధానం మేరకు నడుచుకున్నవాళ్లకు పదవులు ఇస్తారు. ఏ పదవిని త్యాగం చేసి పార్టీలోకి వచ్చారో అదే పదవితో వారిని సత్కరిస్తారు. అదే జగన్ నైజం. టీడీపీ ఎమ్మెల్సీ పదవి వదిలేసి వచ్చిన డొక్కా మాణిక్యవరప్రసాద్ ను తిరిగి ఎమ్మెల్సీని చేసిన జగన్..ఇప్పుడు పోతుల సునీతను ఎమ్మెల్సీగా చేయనున్నారు.

ఇతర పార్టీల ప్రజాప్రతినిధులు వైసీపీలో చేరాలంటే పదవులు వదులుకుని రావాలని ఆ పార్టీ అధినేత జగన్ షరతు విధించారు. తనను నమ్మి వైసీపీలోకి వచ్చిన వాళ్లకు తగిన న్యాయం చేస్తున్నారు. ఇందుకు డొక్కా మాణిక్యవరప్రసాద్, పోతుల సునీత ఉదంతాలే ఉదాహరణ అని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.

గతంలో టీడీపీ ఎమ్మెల్సీగా డొక్కా మాణిక్యవరప్రసాద్ ఉన్నారు. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి ఆయన వైసీపీలో చేరారు. తమ పార్టీలో చేరిన డొక్కా మాణిక్యవరప్రసాద్ ను తిరిగి ఎమ్మెల్సీ అభ్యర్థిగా నిలబెట్టి గెలిపించుకుంది వైసీపీ. ఇదే కోవలో ఇప్పుడు పోతుల సునీతను వైసీపీ అభ్యర్థిగా ఎంపిక చేసింది.

మూడు రాజధానులపై శాసన మండలిలో జరిగిన చర్చలో పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా టీడీపీ ఎమ్మెల్సీ సునీత ఓటేశారు. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి వైసీపీలో చేరారు. సునీత రాజీనామాతో ఖాళీ అయిన స్థానానికి ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. పార్టీ విధానం మేరకు వైసీపీలో చేరిన సునీతకు ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చారు జగన్ .

వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా తనను ఖరారు చేసిన పార్టీ అధినేత జగన్ ను సునీత మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. ఆయన చేతుల మీదుగా బీఫామ్‌ అందుకున్నారు. సునీత వెంట బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి, పోతుల సురేష్‌ ఉన్నారు. వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్ధిగా సునీత నామినేషన్ దాఖలు చేశారు. 20ఏళ్లపాటు టీడీపీలో పనిచేస్తే చంద్రబాబు నరకం చూపించారని కానీ, ఎమ్మెల్సీగా రాజీనామా చేసిన మూడు నెలల్లోనే సీఎం జగన్ తనకు మండలి టికెట్ ఇచ్చారని అన్నారు. కుట్ర రాజకీయాలు చేయడంలో చంద్రబాబు దిట్టన్న సునీత చివరికి దేవుడిని కూడా వదలడం లేదని మండిపడ్డారు.

వైసీపీకి ఎవరు ఎంత చేస్తే అంతే స్థాయిలో పార్టీ కార్యకర్తలు, నాయకులకు జగన్ ప్రతిఫలంగా తిరిగి చెల్లిస్తారు. ఇందుకు ఉదాహరణ డొక్కా మాణిక్య వరప్రసాద్ ,సునీతకు ఎమ్మెల్సీ పదవులే అని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. 

Tags:    

Similar News