Palasa: కుక్కల బీభత్సం… ఏకంగా ఏడుగురిపై దాడి
Palasa: శ్రీకాకుళం జిల్లా పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీలో వీధి కుక్కలు ఏడుగురిపై దాడి చేసి గాయపరిచాయి. కేటీ రోడ్డు, ఇందిరా నగర్ ప్రాంతాల్లో జరిగిన ఈ దాడులతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.
పలాస: శ్రీకాకుళం జిల్లా పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో వీధి కుక్కలు బీభత్సం సృష్టించాయి. వేర్వేరు ప్రాంతాల్లో మూకుమ్మడిగా దాడులు చేసి ఏడుగురిని తీవ్రంగా గాయపరచడం స్థానికంగా కలకలం రేపింది.
వరుస దాడులు - గాయపడిన బాధితులు:
పలాసలోని ప్రధాన వీధుల్లో కుక్కలు రెచ్చిపోయాయి. కేటీ రోడ్డులో కోట్ని అభిలాష్, సేనాధిపతి ప్రకాశరావు, జుత్తు చంద్రశేఖర్‌లపై కుక్కలు ఒక్కసారిగా దాడి చేసి గాయపరిచాయి. అదేవిధంగా ఇందిరా నగర్, కాపు వీధి ప్రాంతాల్లో అమ్ములు, కాంతమ్మ, రవి, హెచ్. మోహనరావు అనే మరో నలుగురిని కుక్కలు ఎటాక్ చేశాయి.
ఆసుపత్రిలో చికిత్స:
కుక్కల దాడిలో గాయపడిన మొత్తం ఏడుగురిని స్థానికులు తక్షణమే పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితులకు వైద్యులు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. ఒకే రోజు ఇంతమందిపై దాడులు జరగడంతో పట్టణ ప్రజలు బయటకు రావాలంటేనే వణికిపోతున్నారు.
అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం:
వీధి కుక్కల నియంత్రణపై సుప్రీంకోర్టు స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చినప్పటికీ, మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు. కుక్కల బెడద రోజురోజుకూ పెరుగుతున్నా పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. వెంటనే అధికారులు స్పందించి, వీధి కుక్కలను పట్టుకుని షెల్టర్లకు తరలించాలని పట్టణ వాసులు డిమాండ్ చేస్తున్నారు.