ప్రతిష్టాత్మకంగా వైసీపీ ప్లీనరీ.. 9 తీర్మానాలు ఉండే అవకాశం

*అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేశాం?

Update: 2022-07-06 03:10 GMT

ప్రతిష్టాత్మకంగా వైసీపీ ప్లీనరీ.. ప్లీనరీలో 9 తీర్మానాలు ఉండే అవకాశం

YCP Plenary 2022: ప్రజలకు మరింత దగ్గరవ్వడం.. ప్రజల అభివృద్ధి కోసం పాటు పడడం.. ఇవే ప్రధాన అజెండాగా వైసీపీ ప్లీనరీ సమావేశాలు జరగనున్నాయి. వైసీపీ ఏర్పాటు చేసిన తర్వాత ఇది మూడో ప్లీనరీ సమావేశం. అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి ప్లీనరీ కావడంతో వైసీపీ నాయకత్వం ప్రతిష్టాత్మకంగా ప్లీనరీ సమావేశాలు నిర్వహించాలని ప్లాన్ చేస్తోది.

ఈ నెల 8, 9 తేదీల్లో వైసీపీ ప్లీనరీ సమావేశాలు జరగనున్నాయి. గుంటూరు నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న గ్రౌండ్‌లో ఈ ప్లీనరీ జరగనుంది. వైసీపీ పార్టీ ఏర్పాటు అయ్యాక 2011లో మొదటి ప్లీనరీ ఇడుపులపాయలో నిర్వహించారు. రెండో ప్లీనరీ.. ఇప్పుడు జరగబోయే మూడో ప్లీనరీ కూడా నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న గ్రౌండ్ వేదిక కానుంది. అధికారంలోకి రావడం వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చిన హామీలు ఏ విధంగా నిలబెట్టుకున్నాము అనే ఎజెండాతో ప్లీనరీ జరగనుంది.

అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి మూడేళ్లు ఏం చేశాం? రాబోయే రెండేళ్లలో ఏం చెయ్యాలి? అనే చర్చ ప్లీనరీలో జరగనుంది. విద్య, వైద్య రంగాలకు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు మేనిఫెస్టోలో చెప్పిన అంశాలను ఏ విధంగా అమలు చేశాం.. అనేది ప్లీనరీలో చర్చిస్తారు. ప్రజలకు మరింతగా దగ్గరయ్యే విధంగా వైసీపీ కార్యక్రమాలు ఏ విధంగా చెయ్యాలి అనేది కూడా ప్లీనరీలో ప్రధానాంశంగా ఉంది.

వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరగనున్న మొదటి ప్లీనరీ సమావేశం కావడంతో సీఎం జగన్ ప్రసంగంతో పాటు ఇతర నేతల ప్రసంగాలలో ప్రజాభ్యుదయం, సంక్షేమ పథకాల అమలు జరుగుతున్న తీరుపై చర్చ జరగనుంది. గతంలో ఏ ప్రభుత్వం చెయ్యని విధంగా సంక్షేమంపై తమ ప్రభుత్వం దృష్టి పెట్టిందని ప్లీనరీ వేదికగా జగన్ చెప్పనున్నారు. ఈ మూడేళ్ళ కాలంలో విద్య, వైద్యం, సామాజిక న్యాయం, పేదలకు వచ్చే పధకాలు, ఇళ్ల స్థలాలు కేటాయింపు.. ఈ అంశాల్ని ప్రజలకు వివరించనున్నారు. వచ్చే రెండేళ్లలో ప్రభుత్వ ప్రాధాన్యాలు, అభివృద్ధి, మూడు రాజధానులు అంశాన్ని కూడా జగన్ తన ప్రసంగంలో చెప్పనున్నట్లు తెలుస్తోంది.

ఈ ప్లీనరీ సమావేశాల్లో 9 తీర్మానాలు చేస్తున్నట్టు సమాచారం. ప్రధానంగా రాజకీయ తీర్మానం. ఇప్పటికే ప్లీనరీకి సంబంధించి కమిటీలు ఏర్పాటు చేశారు. జిల్లాల వారీగా ప్లీనరీ సమావేశాలు కూడా జరిగాయి. రెండు రోజుల పాటు జరగబోయే ప్లీనరీని కూడా భారీ స్థాయిలో నిర్వహించడానికి వైసీపీ ప్లాన్ చేసింది.

Tags:    

Similar News