విజయనగరం జిల్లాలో మహాత్మ గాంధీ విగ్రహ దిమ్మెకు గుర్తుతెలియని వ్యక్తులు వైసీపీ రంగులు వేశారు. ఈ పని చేసింది వైసీపీ ప్రభుత్వమే అని.. జనసేన, టీడీపీ ఆరోపిస్తుండగా.. అది ఫేక్ ఫొటో అంటూ ఈ దుష్ప్రచారాన్ని ఖండించింది వైసీపీ. తమ పార్టీని బద్నాం చెయ్యాలనే ఇలాంటి పనులు ప్రతిపక్షాల వాళ్ళు చేస్తున్నారంటూ వైసీపీ సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలను కూడా షేర్ చేసింది. ఈ క్రమంలో వైసీపీ విరణపై జనసేన పార్టీ స్పందించింది. గాంధీ విగ్రహానికి కూడా రంగులు వేశారన్న ఆరోపణలు రాగానే వైసీపీ ప్రభుత్వం వెంటనే అప్రమత్తమైందని, ఆ విగ్రహానికి హుటాహుటీన రంగులు మార్చేశారని ట్వీట్ చేసింది.
అంతేకాదు, గాంధీ విగ్రహం తాజా ఫొటోలు పోస్టు చేసి తెల్లరంగు వేసినా ఇంకాస్త మిగిలి ఉందని ఆరోపిస్తూ వైసీపీ రంగును రౌండప్ చేసిన ఫోటోను షేర్ చేసింది. అయితే ఇందులో వాస్తవాలు ఏంటో తెలుసుకునేందుకు అధికారులు ఎంక్వయిరీ చేస్తున్నట్టు సమాచారం. నిజంగా వైసీపీకి చెందిన వారే ఇలా చేశారా? లేక ఇంకెవరైనా ఆకతాయిలు చేశారా అని ఆరాతీస్తున్నారు. మరోవైపు ఈ పని ఎవరు చేసినా అది తప్పే అవుతుందని.. రాజకీయాలకు గాంధీజీ విగ్రహాన్ని వాడుకోవడం సరికాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.