Budget 2020: బడ్జెట్‌ మాకు నిరాశ కలిగించింది : వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి

Update: 2020-02-01 12:04 GMT

2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పార్లమెంటులో ప్రవేశపెట్టారు. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై వైసీపీ అసంతృప్తి వ్యక్తం చేసింది. బడ్జెట్ ప్రసంగం అనంతరం మీడియాతో మాట్లాడిన వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయి రెడ్డి కేంద్ర బడ్జెట్‌ తమకు నిరాశ కలిగించిందని వ్యాఖ్యానించారు. వ్యవసాయంపై ఆధారపడి ఉన్న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి బడ్జెట్‌ నిరుపయోగమని ఆయన పెదవి విరిచారు. డిపాజిటర్ల బీమా రూ. లక్ష నుంచి రూ. 5 లక్షలకు పెంచడం మంచి పరిణామమని విజయసాయి తెలిపారు. అయితే ద్రవ్యోల్బణం పెరగడం మంచి పరిణామం కాదని స్పష్టం చేశారు.

వ్యవసాయ కేటాయింపుల్లో ఏపీకి రావాల్సిన వాటాను కచ్చితంగా ఇ‍వ్వాలని డిమాండ్ చేశారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని చెప్పారని, అయితే ఆ విధానంలో స్పష్టత లేదన్నారు. పోలవరం ప్రాజెక్టుకు త్వరితగతిన నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. నిధుల కేటాయింపుల్లో ఏపీకి కేంద్రం మొండి చేయి చూపించిందని ఆరోపించారు. పక్షపాత ధోరణితో రాష్ట్రాన్ని వివపక్షతతో చూడటం మంచిది కాదని సూచించారు. ఏపీలో వెనుకబడిన జిల్లాలకు నిధుల కేటాయింపులు లేవని ఏపీకి ఒక్క రైల్వే ప్రాజెక్ట్‌ కూడా ఇవ్వలేదని విజయసాయిరెడ్డి అన్నారు. ప్రత్యేక హోదాతో పాటు కీలక అంశాలను ప్రస్తావించలేదని వెల్లడించారు.



Tags:    

Similar News