ఆయన ఎమ్మెల్యే కాదు, ఎంపీ అంతకన్నా కాదు... అయినా పవర్‌ తనదే అంటున్నారట...

Update: 2020-10-16 13:24 GMT

ఆయన ఎమ్మెల్యే కాదు, ఎంపీ అంతకన్నా కాదు. అయినా పవర్‌ తనదే అంటున్నారట. అధికారులు ఎవరైనా తన దగ్గరకే రావాలి, తనకే చెప్పుకోవాలి, తాను చెప్పిందే వినాలి అంటూ హుకుం జారీ చేస్తున్నారట. అంతేకాదు, ఇదిగో అధికారులను మందలించాను, మాట వినకుంటే ట్రాన్స్‌ఫర్‌ చేసుకొమ్మని వార్నింగ్‌ ఇచ్చానంటూ, ఫోటోతో సహా సోషల్ మీడియాలో పోస్ట్‌ చేశారట. అదే ఇప్పడు ఆయనపై కారాలు, మిరియాలు నూరేలా చేసిందట. అధిష్టానం సైతం చాలా సీరియస్‌ అయ్యిందట. ఇంతకీ ఎవరాయన?

శ్రీకాకుళం జిల్లా అధికార పార్టీలో కొందరు నేతల తీరుపై వైసీపీ అధిష్టానం చాలా సీరియస్‌గా వుందట. గెలిచిన వారు, ఓడినవారు, ఇలా ఎవరికివారు తమతమ నియోజకవర్గాల్లో కొత్తకొత్త వివాదాలు రాజేస్తూ, పార్టీ పరువు తీసేస్తున్నారని కోపంగా వుందట హైకమాండ్. పార్టీ పెద్దల సహనానికి పరీక్ష పెడుతన్నవారిలో, దువ్వాడ శ్రీనివాస్ ఒకరని, జిల్లాలో చర్చ జరుగుతోంది.

2019 ఎన్నికల్లో వైసీపీ తరపున శ్రీకాకుళం ఎంపీ అభ్యర్ధిగా పోటీ చేసి, ఓటమి పాలయ్యారు దువ్వాడ శ్రీనివాస్. తాను ఓడిపోతేనేం అధికారంలో ఉంది, తమ పార్టీనే కదా అని దూకుడుగా వ్యవహరిద్దామని డిసైడయినట్టున్నారు. జిల్లాలో ముఖ్యమంత్రి ప్రతినిధిగా చెప్పుకునే దువ్వాడకు, సిఎం జగన్ త్వరలోనే ఎమ్మెల్సీ ఇచ్చి, విప్ పదవి కట్టబెడతారని హామీ ఇచ్చారని, ఆయన వర్గం ప్రచారం చేసుకుంటోంది. అయితే, రాబోయే పదవులు మాటేమో గానీ, ఆయన వ్యవహరిస్తున్న తీరు మాత్రం తీవ్ర వివాదాస్పదమవుతోంది. సొంత పార్టీలోనే, ఆయనపై వ్యతిరేకత పెరుగుతోందట.

తాజాగా టెక్కలి శాసన సభ్యుడిపై చేసి ఘాటు వ్యాఖ్యలు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారులపై చెలరేగిపోయిన తీరు, దానిపై తానే సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్టు, పలు విమర్శలకు తావిస్తోందట. శ్రీకాకుళం పార్లమెంట్‌కు పోటీ చేసిన దువ్వాడది, టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గం. ఇక్కడ శాసన సభ్యుడిగా ఎన్నికైంది మాత్రం అచ్చెన్నాయుడు. ఎంత ప్రతిపక్షమైనా, ఎమ్మెల్యేగా ఆయనకుండే ప్రోటోకాల్ ఆయనకుంటుంది. ఎమ్మెల్యేగా నియోజకవర్గంలో సమస్యలపై సమీక్షించడం మామూలే. కానీ ఇదే, దువ్వాడ శ్రీనివాస్‌కు అస్సలు నచ్చడం లేదట. దువ్వాడ ఎమ్మెల్యే కాదు. ఎంపీ కూడా కాదు. అయినా, నియోజకవర్గంలో అధికారులు, తన దగ్గరకే రావాలి, తాను చెప్పిందే వినాలని హుకుం జారీ చేస్తున్నారట దువ్వాడ. ఇప్పుడదే స్థానికంగా వివాదమే కాదు, పార్టీ పెద్దలకు కూడా కోపం తెప్పించిందట.

ఇటీవల భారీ వర్షాల నేపథ్యంలో, ముంపు వాటిల్లితే రైతులకు కలిగే నష్టం, అధికారులు తీసుకుంటున్న చర్యలపై సమాచారం కోసం, స్థానిక ఎమ్మెల్యేగా అచ్చెన్నాయుడు వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారట. అయితే ఆ సమీక్షకు హాజరైన అధికారులకు వెంటనే దువ్వాడ కార్యాలయం నుంచి కాల్.. వచ్చి దువ్వాడను కలవాలి అని. అధికార పార్టీ నాయకుడు, వెళ్లకపోతే అదొక తలనొప్పిగా భావించిన అధికారులు, ఆయన కార్యాలయానికి వెళ్ళారట. ఊహించని తిట్లు, శాపానార్థాలు ఎదురయ్యారట ఆఫీసర్లకు. వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులపై, దువ్వాడ సీరియస్ అయ్యారట. ప్రజాద్రోహి అచ్చెన్నాయుడు లాంటి వ్యక్తి దగ్గరకు ఎలా వెళతారు, ఇక్కడ పనిచేయాలనే ఆలోచన లేదా, ఇష్టం లేకపోతే వేరే చోటికి బదిలీ చేయించుకోండి, నా నియోజకవర్గంలో ఇలాంటివి కుదరవు అంటూ అధికారులపై యమ ఫైర్‌ అయ్యారట దువ్వాడ.

ఈ విషయాన్ని దువ్వాడ స్వయంగా సోషల్ మీడియాలో తానే పోస్టు చేయడంపై, వైసీపీ నాయకులు సైతం నివ్వెరబోతున్నారట. దువ్వాడ వ్యవహరించిన తీరు సొంత పార్టీ నేతలకే రుచించడం లేదట. ఈ వ్యవహారాన్ని జిల్లా వైసీపీ సీనియర్లు సైతం తప్పుబడుతున్నారట. అధికారుల పట్ల ఇలా వ్యవహరించడం, పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తుందని అభిప్రాయపడుతున్నారట. ప్రతిపక్ష పార్టీకి చెందినప్పటికీ, ఆయన ఎమ్మెల్యే కాబట్టి, అధికారులు వెళ్లడంలో తప్పేం వుందని అంటున్నారట. ఎలాంటి పదవీలేకున్నా, కేవలం అధికార పార్టీ లీడర్‌గా, పెత్తనం చెలాయించడమేంటని జనం కూడా మాట్లాడుకుంటున్నారట. అధికారులను అదేపనిగా విసిగించడం, తన చుట్టూ తిప్పించుకోవడమేంటని ప్రశ్నిస్తున్నారట.

సీఎం జగన్‌కు తాను సన్నిహితున్ని అంటూ చెప్పుకునే దువ్వాడ శ్రీనివాస్‌పై, అధిష్టానం సైతం సీరియస్‌గా వుందట. అధికారులను ఇబ్బందిపెట్టడం సరికాదని చెప్పిందట. ఇలాంటి ఘటనలు పునరావృతమైతే, చర్యలు తప్పవని కూడా హెచ్చరించిందట. చూడాలి, హైకమాండ్‌ ఆదేశాలతోనైనా దువ్వాడ తన తీరు మార్చుకుంటారో, లేదంటే అలానే వ్యవహరిస్తారో.

Full View


Tags:    

Similar News