వంశీ చేరికకు యార్లగడ్డ ఒకే.. దాసరికి రాజ్యసభ ఇస్తారా?

Update: 2019-11-19 03:32 GMT

వైసీపీలో గన్నవరం పంచాయితీ ముగిసింది. వల్లభనేని వంశీ చేరికకు యార్లగడ్డ వెంకటరావు ఒకే చెప్పారు. అయితే తనకూ, తన కార్యకర్తలకు అన్యాయం చేసేలా వ్యవహరిస్తే మాత్రం సహించేది లేదని అధిష్టానానికి తేల్చి చెప్పారు యార్లగడ్డ. అదే క్రమంలో పార్టీలో తన వర్గం కార్యకర్తలకు సముచిత స్థానం తోపాటు.. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో తన వర్గం వారికే 70 శాతం సీట్లు ఇవ్వాలని కండీషన్ పెట్టినట్టు తెలుస్తోంది. వల్లభనేని వంశీ, యార్లగడ్డ వెంకటరావు మధ్య .. మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని సయోధ్య కుదిర్చారు. చివరిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో యార్లగడ్డ మాట్లాడినట్టు తెలుస్తోంది. వంశీతో నియోజకవర్గంలో ఎలాంటి విభేదాలు లేకుండా కలిసి పనిచేయాలని వెంకట్రావుకు జగన్‌ సూచించారు. నియోజకవర్గంలో వైసీపీ బలోపేతానికి కృషి చేయాలని వెంకట్రావుకు చెప్పినట్టు తెలుస్తోంది.

వెంక ట్రావు రాజకీయ భవిష్యత్‌ విషయం తాను చూసు కుంటానని రాబోయే రోజుల్లో ఎమ్మెల్సీ ఇస్తానని సీఎం జగన్ హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. అంతేకాదు ఈ అసెంబ్లీ సమావేశాల్లో వంశీ స్వతంత్ర అభ్యర్థిగా వేరే సీటులో కూర్చోనున్నారు. సమావేశాల అనంతరం సీఎంతో మాట్లాడి రాజీనామా గురించి చర్చించే అవకాశం ఉంది. అసెంబ్లీ సమావేశాల తరువాతే వంశీ వైసీపీలో చేరే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అయితే వీరిద్దరి పంచాయితీ ముగిసింది కానీ.. ఇదే పార్టీలో ఉన్న దాసరి జై రమేష్, బాలవర్ధన్ రావు ల పరిస్థితి ఏంటన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు. అయితే దాసరి బ్రదర్స్ లో ఎవరో ఒకరికి రాజ్యసభ లేదంటే జిల్లా పరిషత్ ఛైర్మెన్ ఆఫర్ చేసినట్టు ప్రచారం జరుగుతోంది.    

Tags:    

Similar News