అమరజీవి విగ్రహం ఏర్పాటు చేసే స్థోమత లేదా? : వైసీపీ
తెలుగు ప్రజలంతా ఐక్యంగా ఉండాలనే ఆశయంతో ఆమరణ నిరాహారదీక్ష చేసి ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహం ఏర్పాటుచేసే స్థోమత ప్రభుత్వానికి లేదా అని మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ సీఎం చంద్రబాబుని నిలదీశారు.
తాడేపల్లి: తెలుగు ప్రజలంతా ఐక్యంగా ఉండాలనే ఆశయంతో ఆమరణ నిరాహారదీక్ష చేసి ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహం ఏర్పాటుచేసే స్థోమత ప్రభుత్వానికి లేదా అని మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ సీఎం చంద్రబాబుని నిలదీశారు. అమరావతి కోసం రూ.లక్ష కోట్లు ఖర్చు చేస్తామని చెప్పే చంద్రబాబు, ఏడాదిన్నరలో రూ. 2.66 లక్షల కోట్లు అప్పులు తెచ్చాడని, కానీ అమరజీవి విగ్రహ ఏర్పాటుకు మాత్రం చందాలు వసూలు చేసుకోమని చెప్పడం సిగ్గుచేటని మండిపడ్డారు. ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేసే ప్రయత్నంలో భాగంగా డీపీఆర్ కోసమే రూ. 11 కోట్లు ఖర్చు చేసిన ప్రభుత్వానికి పొట్టి శ్రీరాములు విగ్రహం ఏర్పాటు చేయడం భారమైపోయిందా అని ప్రశ్నించారు. రామోజీ సంస్మరణ సభల కోసం ప్రభుత్వం ఖర్చు చేయడంలో లేని ఇబ్బంది పొట్టిశ్రీరాములు విగ్రహం ఏర్పాటుచేయడానికి వచ్చిందా అని అడిగారు. ఆయన ప్రపంచంలో ఉన్న యావత్ తెలుగు ప్రజల కోసం ప్రాణత్యాగం చేస్తే , ఆర్యవైశ్యుల నుంచి చందాలు వసూలు చేసి విగ్రహం ఏర్పాటు చేసుకోవాలని చెప్పడం సిగ్గుచేటన్నారు.
ఈ విధానాలను మాజీ సీఎం వైయస్ జగన్ ఖండించారని, వైయస్సార్సీపీ చూస్తూ ఊరుకోదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. పొట్టి శ్రీరాములు గుర్తుగా నవంబర్ 1న నిర్వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని మార్చిన చంద్రబాబుకి, ఆయన విగ్రహానికి పూలమాల వేసే అర్హత లేదని వైయస్సార్సీపీ నాయకులు స్పష్టం చేశారు. 2019లో వైయస్ జగన్ సీఎం అయ్యాక రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని నవంబర్ 1న నిర్వహించేలా జీవో ఇచ్చి ఐదేళ్లపాటు కొనసాగిస్తే, కూటమి ప్రభుత్వం వచ్చాక ఆపేయడం దారుణమన్నారు. తెలుగుజాతి ఉన్నంతకాలం పొట్టి శ్రీరాములు చేసిన త్యాగం మరువలేమని, వైయస్ జగన్ నేతృత్వంలో వైయస్సార్సీపీ ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్తుందని స్పష్టం చేశారు.
వర్ధంతి కార్యక్రమంలో భాగంగా ముందుగా ఆయన చిత్రపటం వద్ద దీపాలు వెలగించి పుష్పాంజలి ఘటించారు. అనంతరం పార్టీ నాయకులు నివాళులు అర్పించారు. తాడేపల్లిలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో వైయస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, ఎమ్మెల్సీ రుహుల్లా, వైయస్సార్సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు, పార్టీ గ్రీవెన్స్ సెల్ అధ్యక్షుడు నారాయణ మూర్తి, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధులు పుత్తా శివశంకర్‌రెడ్డి, కొండా రాజీవ్ గాంధీ, వివిధ పార్టీ అనుబంధ విభాగాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.