White Paper on TTD Assets: టీటీడీ ఆస్థులపై శ్వేతపత్రం.. ఈవో సింఘాల్ కీలక నిర్ణయం

White Paper on TTD Assets: టీటీడీ ఆస్ధులపై వస్తున్న చాలా వివాదాలు చోటుచేసుకుంటున్నాయి.

Update: 2020-07-13 02:30 GMT
TTD EO Anil Kumar Singhal (File Photo)

White Paper on TTD Assets: టీటీడీ ఆస్ధులపై వస్తున్న చాలా వివాదాలు చోటుచేసుకుంటున్నాయి. రత్నాల దగ్గర్నుంచి, అన్నింటిపై పూర్తిస్థాయి సమాచారం కోసం గతంలోనే పలువురు అడిగిన విషయం తెలిసిందే. అయితే దీనిని పక్కాగా వివరాలు తెలిపేందుకు ఈవో నిర్ణయించుకున్నట్టు తెలిసింది. టీటీడీ ఆస్తుల‌కు సంబంధించి ఈవో అనిల్ కుమార్ సింఘాల్ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. శ్రీవారి ఆస్తుల‌పై ఇప్ప‌టికే ప‌లు సంద‌ర్భాల్లో నెల‌కొంటున్న వివాదాల నేప‌థ్యంలో టీటీడీ నిర్ణ‌యం కీల‌కంగా మారింది.

టీటీడీ ఆస్తుల‌పై శ్వేత ప‌త్రం విడుద‌ల‌కు నిర్ణ‌యం తీసుకున్నామ‌ని.. వివాదాల‌కు తావు లేకుండా పూర్తిస్థాయి ప‌రిశీల‌న త‌ర్వాతే శ్వేత ప‌త్రం విడుద‌ల చేస్తామ‌ని ఈవో అనిల్ సింఘాల్ స్ప‌ష్టం చేశారు. ఇక తొలిసారిగా తిరుప‌తిలోని టీటీడీ అడ్మినిస్ట్రేష‌న్ భ‌వ‌నంలో 'డ‌య‌ల్ యువ‌ర్ ఈవో' కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు. జూన్‌ 11నుంచి జూలై 10 వరకు హుండి ఆదాయం రూ.16.73 కోట్లు వచ్చిందని ఈవో తెలిపారు. భక్తులు సమర్పించిన తలనీలాల విలువ పెరగడంతో రూ.7కోట్లు అదనంగా ఆదాయం వచ్చిందని వెల్లడించారు. కాగా, తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామి వారి హుండిలో ఓ అజ్ఞాత భక్తుడు బంగారు బిస్కెట్లు విరాళంగా వేశారు. ఒక్కొక్కటి 100 గ్రాములు ఉన్న 20 బంగారు బిస్కెట్లను సమర్పించిన విషయం వెలుగు చూసింది.

లాక్‌డౌన్‌ సడలించిన అనంతరం శ్రీవారి ఆలయంలో దర్శనం ప్రారంభమైన జూన్‌ 11వ తేదీ నుంచి జూలై 10 వరకు 2,50,176 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు టీటీడీ ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌ తెలిపారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో ఆదివారం 'డయల్‌ యువర్‌ ఈవో' కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో భక్తులను ఉద్దేశించి మాట్లాడుతూ.. శ్రీవారి దర్శనం కోసం జూన్‌ 11 నుంచి జూలై 10 మధ్య ఆన్‌లైన్‌ ద్వారా 2,02,346 మంది భక్తులు టికెట్లు బుక్‌ చేసుకోగా 1,64,742 మంది స్వామివారిని దర్శించుకున్నారు. తిరుపతిలోని కౌంటర్లద్వారా 97,216 మంది భక్తులు దర్శన టోకెన్లు తీసుకోగా అందులో 85,434 మంది దర్శనానికి వచ్చారు.

నెల రోజుల్లో హుండీ ఆదాయం రూ. 16.73 కోట్లు లభించింది. 13.36 లక్షల లడ్డూలను భక్తులకు విక్రయించారు. మొత్తం 82,563 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. జూలై 10వ తేదీ వరకు తిరుమలలో 1,865 మంది టీటీడీ ఉద్యోగులకు, అలిపిరి వద్ద 1,704 మంది టీటీడీ ఉద్యోగులకు, 631 మంది భక్తులకు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించాం. టీటీడీ ఉద్యోగుల్లో 91 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. తిరుమలలో పనిచేస్తున్న ఉద్యోగుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నాం. ఇక శ్రీవారి బ్ర‌హ్మోత్స‌వాల నిర్వ‌హ‌ణ‌కు అప్ప‌టి ప‌రిస్థితుల మేర‌కు నిర్ణ‌యం తీసుకుంటామ‌ని తెలిపారు. ఉత్స‌వాల ఏర్పాట్ల‌కు టెండ‌ర్లు నిర్వ‌హిస్తున్నామ‌ని చెప్పిన ఆయ‌న‌.. అప్ప‌టి ప‌రిస్థితులను బ‌ట్టి ఉత్స‌వాల నిర్వ‌హ‌ణ‌పై నిర్ణ‌యం తీసుకుంటామన్నారు. ఇక‌ టీటీడీకి ఆర్థిక ప‌ర‌మైన ఇబ్బందులు ఏమీ లేవని తెలిపారు.


Tags:    

Similar News