రాజ్యాంగాన్నే సవరించారు.. బిజినెస్ రూల్స్ మార్చితే తప్పేంటి?
సచివాలయంలో జరుగుతున్న మంత్రులు, హెచ్ఓడీలు, సెక్రటరీల సదస్సులో సీఎం చంద్రబాబు నాయుడు ‘‘దేశంలో రాజ్యాంగాన్నే అనేక సార్లు సవరించుకున్నాం...ప్రజలకు మంచి చేయడానికి బిజినెస్ రూల్స్ మార్చుకుంటే తప్పేంటి’’ అని అభిప్రాయపడ్డారు.
అమరావతి : సచివాలయంలో జరుగుతున్న మంత్రులు, హెచ్ఓడీలు, సెక్రటరీల సదస్సులో సీఎం చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశంలో రాజ్యాంగాన్నే అనేక సార్లు సవరించుకున్నాం.....ప్రజలకు మంచి చేయడానికి బిజినెస్ రూల్స్ మార్చుకుంటే తప్పేంటని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. ఫైళ్ల క్లియరెన్స్ వేగవంతం చేయడమే కాదని,అనవసర ఫైళ్లు సృష్టించే విధానం మారాలని స్పష్టం చేశారు. దీని కోసం అవసరం అయితే బిజినెస్ రూల్స్‌ను మార్చాలని సీఎం అన్నారు. పాలనను సులభతరం చేయడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని, దీని కోసం అధికారులు అనవసరంగా ఉన్న నిబంధనలను తొలగించాలన్నారు. శాఖల్లో పూర్తిస్థాయి మార్పులు తీసుకురావాలని, టెక్నాలజీ, డేటాలేక్ ద్వారా మరింత సమర్థంగా పాలన అందించాలన్నారు. ప్రతి శాఖలో ఆడిటింగ్ జరగాలని స్పష్టం చేశారు. ప్రతి అధికారి, ప్రతిశాఖ పనితీరు ఏ విధంగా ఉందో ప్రభుత్వం వద్ద పూర్తిస్థాయిలో సమాచారం అందుబాటులో ఉందని, దీన్ని దృష్టిలో పెట్టుకుని పనిచేయాలన్నారు. ప్రజలకు జవాబుదారీగా ఉంటూ...విజన్‌తో ప్రతి అధికారి పనిచేయాలని సీఎం సూచించారు.
‘‘ప్రభుత్వం ప్రజల కోసం పని చేస్తోంది. ప్రజలు మెచ్చే పాలన అందివ్వాలి. ఫైళ్లు పెండింగులో లేకుండా ఎప్పటికప్పుడు క్లియర్ చేయాలి. డేటా లేక్ రెడీ అయింది. ఇకపై డేటా డ్రివెన్ గవర్నెన్స్ దిశగా అందరూ పని చేయాలి. డేటా లేక్‌లో ఉన్న సమాచారంతో సుపరిపాలన అందివ్వాలి. నాలెడ్జ్ ఎకానమీ దిశగా ఏపీ అడుగులు వేస్తోంది. అందుకే పెద్ద ఎత్తున కంపెనీలు వస్తున్నాయి. విశాఖలో 1 గిగా వాట్ డేటా సెంటర్ ఏర్పాటు కాబోతోంది. ప్రధాని మోదీని మైక్రో సాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్ల కలిసి ఇండియాలో రూ.1.50 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టడానికి సిద్దమని చెప్పారు. ప్రజలు తమ పనుల కోసం ప్రభుత్వాఫీసులకు ఎందుకు రావాలి? ఇళ్ల వద్దకే సేవలు చేరే పరిస్థితి రావాలి. కేంద్ర ప్రాయోజిత పథకాలు చాలా ముఖ్యం. గత పాలకులు పూర్తిగా ఈ కేంద్ర ప్రాయోజిత పథకాలను నాశనం చేశారు.నిలిపేశారు.’’ అని చెప్పారు.