Vizag Gas Leak : ప్రమాదానికి కారణమదే

Update: 2020-07-07 12:22 GMT

Vizag Gas Leak: : విశాఖ ఎల్జీ పాలిమర్స్ స్టైరిన్ గ్యాస్ ఉన్న ట్యాంకులో ఉష్ణోగ్రతలు పెరగడంతో ప్రజర్ ఏర్పడి గ్యాస్ లీకైందని హైపవర్ కమిటీ తేల్చింది. గ్యాస్ ప్రమాదంపై రెండు నెలలపాటు పరిస్థితులను అధ్యయనం చేసిన హైపవర్ కమిటీ నియంత్రణ వ్యవస్థలో లోపాలను గుర్తించింది. ట్యాంక్ డిజైన్, కూలింగ్ సిస్టమ్ సరిగా లేకపోవడం, సిబ్బందికి అవగాహన లేకపోవడంతో ప్రమాదం జరిగినట్లు స్పష్టం చేసింది. ప్రమాద ఘటనపై 350 పేజీల తుది నివేదికను హైపవర్ కమిటీ చైర్మన్ నీరబ్ కుమార్ ప్రసాద్ సీఎం జగన్ కు సమర్పించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలో చోటు చేసుకోకుండా తీసుకోవాల్సిన జాగ్రతలను కమిటీ నివేదికలో పేర్కొన్నది.

విశాఖ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ ప్రమాదంపై హైపవర్ కమిటీ తుది నివేదికను ఏపీ సీఎం జగన్ కు సమర్పించింది. ప్రమాద ఘటనపై అటవీ పర్యావరణం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ నేతృత్వంలో పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్‌, విశాఖ సిటీ పోలీస్ కమిషనర్ ఆర్కే మీనా, కలెక్టర్ సభ్యులుగా హైపవర్ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. గ్యాస్ లీకేజీ ప్రాంతాల్లో పర్యటించి సేకరించిన వివరాలపై పూర్తి స్థాయిలో కమిటీ సభ్యులు ఆధ్యయనం చేశారు. మొత్తం నాలుగు వేల పేజీలతో నివేదిక సిద్దం చేసిన హైపవర్ కమిటీ సభ్యులు 350 పేజీల రిపోర్టును సీఎం జగన్ కు సమర్పించారు.

ఎల్జీ పాలిమర్స్ ఘటనలో 12 మంది మృతి చెందారని 555 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందారని కమిటీ సభ్యులు వెల్లడించారు. ప్రజల నుంచి 1250 ప్రశ్నలు, 250 ఈమెయిల్, 180 ఫోన్ కాల్స్, మెసెజ్ లు వచ్చాయని హైపవర్ కమిటీ చైర్మన్ నీరబ్ కుమార్ తెలిపారు. సిబ్బంది అవగాహన లేకపోవడంతోనే ప్రమాదం జరిగిందని చెప్పారు. స్టైరిన్ గ్యాస్ ఉన్న ట్యాంక్ లో టెంపరేచర్ పెరగడంతో ప్రెజర్ ఏర్పడి గ్యాస్ లీకైందని సీఎంకు సమర్పించిన నివేదికలో వెల్లడించారు. ముందే కంపేనీ సంకేతాలు పట్టించుకోకపోవడంతో పాటు సైరన్ మోగలేదని తెలిపారు. నియంత్రణ వ్యవస్థలో కొన్ని లోపాలు గుర్తించామని, ఫ్యాక్టరీ సేఫ్టీ బోర్డు ఏర్పాటుకు సూచించామని నీరబ్‌కుమార్ చెప్పారు. భవిష్యత్‌లో ఇటువంటి ప్రమాదాలు మరోసారి పునరావృత్తం కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు, సలహాలను కమిటీ హైపవర్ కమిటీ నివేదికలో పొందుపరిచింది.

Tags:    

Similar News