ఎల్జీ పాలిమర్స్ ఘటనలో ఎవరినీ ఎందుకు అరెస్టు చేయలేదు?

ఎల్జీ పాలిమర్స్ ఘటనలో ఎవరినీ ఎందుకు అరెస్టు చేయలేదు?
x
Highlights

వైజాగ్ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజ్ దుర్ఘటనలో చిన్నారి గ్రీష్మ ప్రాణాలు కోల్పోయింది. ఆమె మాత్రమే కాదు మొత్తం 12 మంది ఆ దుర్ఘటనలో మరణించారు. మొత్తం...

వైజాగ్ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజ్ దుర్ఘటనలో చిన్నారి గ్రీష్మ ప్రాణాలు కోల్పోయింది. ఆమె మాత్రమే కాదు మొత్తం 12 మంది ఆ దుర్ఘటనలో మరణించారు. మొత్తం ఉదంతంలో చిన్నారి గ్రీష్మనే ఉదాహరణగా తీసుకుంటే ఎన్నో ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. గ్రీష్మ మరణానికి బాధ్యలెవరు ? ఈ కేసులో ఒక్కరినీ ఇంతవరకు ఎందుకు అరెస్టు చేయలేదు ? దేశంలో చట్టాలు సంపన్నులకు ఒకలా ఇతరులకు మరోలా వర్తిస్తాయా ? బహుళ జాతి సంస్థలు దేశంలో ఎలాంటి ఘోరాలకు పాల్పడినా అవి తప్పించుకోగలుగుతాయా ? గ్రీష్మ ప్రాణాలు గాల్లో కలిసిపోయినట్లుగానే ఈ కేసు కూడా గాల్లో కలిసిపోనుందా ? ఇలా మరెన్నో ప్రశ్నలు.

వైజాగ్ దుర్ఘటన చూస్తుంటే నో వన్ కిల్డ్ జెస్సికా....సినిమా గుర్తుకొస్తోంది. అది సినిమా మాత్రమే కాదు నిజజీవిత గాధ కూడా. 1999లో ఢిల్లీలో జరిగిన ఓ యధార్థ సంఘటన. ఆ ఘటనలో జెస్సికా అనే యువతి హత్యకు గురవుతుంది. నిందితుడిపై కేసు కూడా నమోదవుతుంది. చివరకు సాక్ష్యాలు బలంగా లేవని చెబుతూ నిందితుడిని న్యాయస్థానం విడిచిపెడుతుంది. నిందితుడు బాగా పలుకుబడి కలిగిన వ్యక్తి కావడంతో నిర్దోషిగా విడుదలయ్యాడు. ప్రజల నుంచి వ్యతిరేకత నేపథ్యంలో కేసు రీఓపెన్ చేస్తారు. ఈ దఫా మాత్రం నిందితుడు మనుశర్మను దోషిగా నిర్ధారించి యావజ్జీవ జైలు శిక్ష వేస్తారు. తాజాగా వైజాగ్ ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటన విషయంలోనూ అలాంటి పరిణామాలే చోటు చేసుకోనున్నాయా ? పరిస్థితి సద్దుమణిగితే కేసు సంగతి ఇక అంతేనా ? విపక్షాలు మొదలుకొని సామాన్య ప్రజానీకం దాకా అందరినీ వేధిస్తున్న ప్రశ్న ఇదే. ఆ ప్రశ్నకు సమాధానాలు అన్వేషించే ప్రయత్నం చేద్దాం.

పాహి...పాహి రామా...లోకనాయకా.....అంటూ ఆ చిన్నారి పాడుతుంటే అలా ఆ పాట మొత్తం వినాలనిపిస్తోంది. ఎన్నిసార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది. అయితే అలా పాడే అదృష్టం ఆ చిన్నారి గ్రీష్మకు లేదు అలా వినే భాగ్యం ఆ చిన్నారి కుటుంబానికీ మనకూ లేదు. అల్లారుముద్దుగా పెంచుకున్న పాపను వైజాగ్ ఎల్జీ పాలిమర్స్ విషవాయువు కాటేసింది. ఆ దుర్ఘటన జరిగి నాలుగు రోజులు గడుస్తున్నాయి. పన్నెండు మంది మృతులు వందల సంఖ్యలో బాధితులు వేల సంఖ్యలో ప్రభావితులు అయినా కూడా ఇప్పటి వరకూ ఈ కేసులో ఒక్కరు కూడా అరెస్టు కాలేదు. రోడ్డు మీద చిన్న ప్రమాదం జరిగినా ఆ ప్రమాదానికి కారణమైన వారిని అరెస్టు చేస్తారు. ఎక్కడైనా ఒక హత్య జరిగితే నిందితులను అరెస్టు చేస్తారు. పన్నెండు మందిమరణించినా వందలాది మంది బాధితులైనా ఎల్జీ పాలిమర్స్ కేసులో మాత్రం అలాంటి అరెస్టులేవీ లేవు.

చిన్నారి గ్రీష్మ ఉదంతాన్నే తీసుకుంటే ఆ చిన్నారి మరణానికి కారణమెవరో చెప్పలేమా ? కారకులను శిక్షించలేమా ? లేదంటే ఆ చిన్నారి తనకు తానే విషవాయువును సృష్టించుకొని ఆ గాలిని పీల్చి చనిపోయిందా ? ఊపిరాడక ఆ చిన్నారి విలవిలలాడుతుంటే అందుకు కారణం ఆమెనే అని అంటామా ? ఆ చిన్నారి కన్నతల్లి ఆవేదనను తొలగించగలమా ? పరిహారం ఎంతిచ్చినా సరే పోయిన ప్రాణాన్ని తిరిగి తెచ్చివ్వలేం కదా ? మరో నెల రోజుల్లో ఆనందంగా పుట్టిన రోజు చేసుకోవాల్సిన బిడ్డకు అంత్యక్రియలు చేయాల్సిన దుస్థితి ఎందుకు వచ్చింది ? ఆ బిడ్డను నేను కన్నాను చేజేతులా వదులుకుంటానా ? ఎంతో ముద్దుగా పెంచుకున్నాను చిన్నారి ప్రాణం కాపాడేందుకు ఎంతో ప్రయత్నించాం కానీ బతికించుకోలేకపోయాం బాధ ఎవరూ తీర్చలేరు మళ్లీ రాదు అంటూ ఆ తల్లి విలపిస్తుంటే బాధతో గుండె మెలి తిరిగిపోతుంది. ఇలాంటి పరిస్థితిలో ఆ తల్లి తనకు న్యాయం కావాలని కోరింది. న్యాయం ఆమెకు దక్కడం ప్రశ్నార్థకంగా మారడమే అతిపెద్ద విషాదం.

ఎల్జీ పాలిమర్స్ ఘటన కేసులో చివరకు జరిగేదేంటి ? మొత్తం సంఘటనలో బాధితులు ఉంటారు తప్పితే బాధ్యులు ఉండరా ? జరుగుతున్న పరిణామాలు అంతిమంగా తేల్చిచెప్పేది ఇదే విషయాన్నా ? మనల్ని వెంటాడే ప్రశ్నలు ఇవి మాత్రమే కాదుvఇంకా మరెన్నో. కాకపోతే వాటిలో వేటికీ సమాధానాలు మాత్రం లభించవు. బహుశా ఈ విషయం ముందే ప్రజలకు అర్థమైనట్లుగా ఉంది. అందుకే ఎమ్మెల్యేలు, మంత్రులు పర్యటించి నచ్చచెప్పినా ప్రజలు మాత్రం ఆందోళనలు చేశారు. బాధ్యులను శిక్షించాలని డిమాండ్ చేశారు. ఎవరు ఎంత నచ్చచెప్పినా ఆందోళనలను కొనసాగించారు. రాజకీయం చేస్తున్నారనే విమర్శలు వచ్చాయి. అదే సమయంలో బాధ్యులను తప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ఆరోపణలూ వచ్చాయి. ఆరోపణలు ప్రత్యారోపణలు ఎలా ఉన్నప్పటికీ న్యాయం మాత్రం జరిగితీరాల్సిందే. అందుకు అవసరమైతే చట్టాలను మార్చుకోవాలన్న డిమాండ్ కూడా ఇప్పుడు తెరపైకి వచ్చింది.

సాధారణంగా స్టైరీన్ అంత ప్రమాదకరం కాదని చెబుతారు. దాంతో మరేదో చేసేందుకు ప్రయత్నించినందువల్లే ప్రమాదం చోటు చేసుకుందని అనే వారూ ఉన్నారు. దాని సంగతి పక్కనబెట్టి కేసు విషయానికే వద్దాం. దుర్ఘటన అనంతరం ఎఫ్ఐఆర్ దాఖలైంది. ఆ ప్రకారం పోలీసు విచారణ జరుగుతుంది. ఈ లోగా కేంద్రం సత్వరమే స్పందించింది. ఓ విచారణ సంఘాన్ని వేసింది. మరో వైపున జాతీయ మానవ హక్కుల సంఘం స్పందించి నోటీసులు జారీ చేసింది. ఇక నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ స్పందించి 50 కోట్ల రూపాయలను ముందుగా డిపాజిట్ చేయాలని ఆదేశించింది. అది కూడా విచారణ చేయనుంది. మరో వైపున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒక హైపవర్ కమిటీని నియమించింది. అది కూడా విచారణ జరుపనుంది. మొత్తం ఐదు రకాల విచారణ జరుగనుంది. ఎన్ని రకాలుగా విచారణ జరిగినా అంతిమంగా దక్కాల్సింది న్యాయం. మృతుల కుటుంబాలకు, బాధితులకు పరిహారం సాయం అదించారు. అది సరే మరి న్యాయం మాటేమిటి ? పరిహారం మాటున న్యాయాన్ని దాటవేస్తారా అనేదే ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.

గ్రీష్మ కుటుంబానికి న్యాయం జరగాలి ఆమెతో పాటు ప్రాణాలు కోల్పోయిన 12 మంది కుటుంబాలకూ న్యాయం జరగాలి. కాకపోతే ప్రస్తుతం ఉన్న చట్టాల ఆధారంగా వారికి న్యాయం జరగడం మాత్రం ప్రశ్నార్థకంగానే ఉంది. మన చట్టాలను మార్చుకుంటే తప్ప న్యాయం జరిగే అవకాశం కనిపించడం లేదు. కాకపోతే ఇకముందైనా ఇలాంటి సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం మాత్రం ఉంది. తద్వారా మరెంతో మంది ప్రాణాలను కాపాడిన వాళ్లం అవుతాం

వైజాగ్ దుర్ఘటనలో తక్షణం ఎవరినీ ఎందుకు అరెస్టు చేయలేదు అన్న ప్రశ్నకు వచ్చిన సమాధానాలు కూడా విచిత్రంగానే ఉన్నాయి. దుర్ఘటనకు టెక్నీషియన్లను బాధ్యులుగా చేస్తూ వారిని తక్షణం అరెస్టు చేయలేం అలా చేస్తే ప్రస్తుతం కంపెనీలో తీసుకుంటున్న ప్రమాద నివారణ చర్యలను కొనసాగించలేం అని కొందరు పోలీసులు అధికారులు అంటున్నారు. బహుశా అది నిజమే కావచ్చు కానీ ప్రమాద నివారణ చర్యల పేరిట ఎంత కాలం గడిపేస్తారు ఎప్పటి వరకు వారిని అరెస్టు చేస్తారు లాంటి ప్రశ్నలకు మాత్రం సమాధానాలు అంత తేలిగ్గా లభించవు. రకరకాల సాంకేతిక కారణాలను చెబుతూ కేసును సాగదీసే అవకాశాలు కూడా ఉన్నాయి. మరో వైపున ఈ దుర్ఘటన ఒక విదేశీ సంస్థతో ముడిపడింది కావడం దానిపై చర్య తీసుకుంటే అది విదేశీ పెట్టుబడులపై ప్రభావం చూపుతుందనే వాదన రావడం లాంటివన్నీ కూడా మొత్తం వ్యవహారాన్ని సంక్లిష్టంగా మార్చే అవకాశాలున్నాయి.

వైజాగ్ తరహా దుర్ఘటనలు గతంలోనూ ఎన్నో జరిగాయి. వాటిలో ముఖ్యమైంది భోపాల్ గ్యాస్ లీకేజ్ దుర్ఘటన. ఆ కేసులో కంపెనీ యాజమాన్యం పై కఠిన చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయి. అమల్లో ఉన్న చట్టాలను బట్టి న్యాయస్థానాలు సైతం ఆయా కంపెనీల పై కఠిన చర్యలకు వెనుకాడిన సందర్భాలున్నాయి. 2008 నాటి మక్సూద్ సయీద్ వర్సెస్ స్టేట్ ఆఫ్ గుజరాత్ కేసులో, 2009 నాటి కేకిహార్మస్జి గార్డా వర్సెస్ మెహర్వాన్ రుస్తుం ఇరానీ కేసులో 2015లో సునీల్ భారతి మిట్టల్ వర్సెస్ సీబీఐ కేసులో 2019లో శివ్ కుమార్ జాటియా కేసులో న్యాయస్థానాలు ఆయా చట్టాల్లో ఉన్న సంక్లిష్టతలను వెల్లడించాయి.

మొత్తం మీద చూస్తే వైజాగ్ తరహా దుర్ఘటనల్లో బాధ్యులను శిక్షించేందుకు చట్టాల్లో మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందనే విషయం స్పష్టమవుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆ దిశలో కృషి చేయాలి. దేశీయ కంపెనీ అయినా విదేశీ కంపెనీ అయి నా సమన్యాయం అనేది ఉండాలి. అప్పుడు మాత్రమే ప్రజలకు న్యాయస్థానాల మీద, ప్రభుత్వాల మీద విశ్వాసం ఉంటుంది. లేదంటే సమాజంలో అది అశాంతికి దారి తీస్తుంది. సామాజిక సంస్థలు సైతం ఇలాంటి అంశాల్లో మార్పులు తీసుకువచ్చేందుకు ప్రయత్నించాలి. అదే సమయంలో లాక్ డౌన్ లాంటి సందర్భాల్లో ఆయా ప్లాంట్లను తిరిగి తెరిచే సమయంలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలను తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. అప్పుడు మాత్రమే గ్రీష్మ లాంటి చిన్నారుల ప్రాణాలు బలికాకుండా ఉంటాయి.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories