Vijayawada: రసాభాసగా విజయవాడ కార్పొరేషన్ కౌన్సిల్

Vijayawada: సమావేశం నుంచి టీడీపీ సభ్యుల సస్పెన్షన్

Update: 2022-05-18 01:32 GMT

Vijayawada: రసాభాసగా విజయవాడ కార్పొరేషన్ కౌన్సిల్

Vijayawada: ప్రజా సమస్యల పరిష్కారం కోసం చర్చించాల్సిన సమావేశ మందిరాన్ని సమరానికి వేదికగా చేసుకున్నారు. ఒకరిపై ఒకరు వ్యక్తిగత దూషణలు చేసుకుంటూ.. వాగ్వివాదానికి దిగారు. అరుపులు, కేకలతో సమావేశం మొత్తం దద్దరిల్లడంతో ప్రజా సమస్యలు పక్కకు వెళ్లి రాజకీయ విమర్శలకు కేంద్రంగా మారింది. చివరకు టీడీపీ సభ్యులను సస్పెండ్ చేసి అధికారపార్టీ నేతలు ఏకపక్షంగా తీర్మానాలను ఆమోదించుకున్నారు. ఇదీ విజయవాడ కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశంలో జరిగిన తంతు అయితే ఎవరి వాదనను వారు సమర్ధించుకుంటూ మీడియా ముందు కూడా ఇదే పంధాను కొనసాగించడం విశేషం.

విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ సమావేశం రసాభాసగా మారింది. అధికార వైసీపీ, విపక్ష టీడీపీ సభ్యుల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. విజయవాడ నగర అభివృద్దిపై చర్చ పెట్టాలంటూ టీడీపీ సభ్యులు డిమాండ్ చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ది కుంటుపడిందన్నారు. కనీసం రోడ్లు కూడా వేయలేని దుస్థితిలో ఉన్నారంటూ టీడీపీ సభ్యులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అయితే ఎజెండాలో ఉన్న అంశాలపై మాత్రమే చర్చ సాగుతుందంటూ మేయర్ వారి విజ్ఞప్తిని కొట్టిపారేశారు.

సమావేశానికి హాజరైన మాజీ మంత్రి వెల్లంపల్లి, ఎమ్మెల్యే మల్లాది విష్ణులు చంద్రబాబును లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేశారు. సభలో లేని చంద్రబాబు ను దూషించడంపై టీడీపీ సభ్యులు మరోసారి ఆక్షేపణ వ్యక్తం చేశారు. చంద్రబాబుపై వెల్లంపల్లి అనుచిత వ్యాఖ్యలు చేశారని సభలో ఆందోళన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీడీపీ సభ్యులు కౌన్సిల్లో నినాదాలు చేశారు. అనేకమార్లు మేయర్ భాగ్యలక్ష్మి కూర్చోవాలంటూ టీడీపీ సభ్యులను సూచించినా వినకపోవడంతో వారిని సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే సభ్యులు బయటకు వెళ్లేందుకు అంగీకరించకపోవడంతో మార్షల్స్ సాయంతో వారందరినీ బయటకు పంపించారు.

క్వశ్చన్ అవర్ లో టిడిపి, సీపీఎం సభ్యులు సభను తప్పుదోవ పట్టించారన్నారు మాజీ మంత్రి వెల్లంపల్లి. చంద్రబాబు విజయవాడ అభివృద్ధికి ఏమి చేసారో చెప్పాలన్నారు. కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పినా టీడీపీ నేతల తీరు మారడం లేదన్నారు. కౌన్సిల్ సమావేశాలను టిడిపి ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటుందని, ఎవరి హయాంలో అభివృద్ది జరిగిందో చర్చకు తాము సిద్దమని మల్లాది విష్ణు సవాల్ విసిరారు.

సభ నుంచి బయటకు వచ్చిన టీడీపీ సభ్యులు కౌన్సిల్ హాల్ ప్రధాన ద్వారం వద్ద బైటాయించారు. చిడతలు వాయిస్తూ... వైసీపీ ప్రభుత్వ విధానాలపై సెటైర్లు వేశారు. బాదుడే బాదుడు అంటూ వినూత్న రితిలో కార్యక్రమం నిర్వహించారు. మాజీ మంత్రిగా ఉన్న వెల్లంపల్లి అనవసరంగా చంద్రబాబు పై కామెంట్లు చేశారని, సభలో లేని వ్యక్తిపై రాజకీయంగా మాట్లాడటం ఏమిటని వారు ప్రశ్సిస్తున్నారు. ప్రజా సమస్యపై చర్చ జరగకుండా మాజీ మంత్రి వెల్లంపల్లి కనుసన్నల్లో కౌన్సిల్ నడుపుతున్నారని ఆరోపించారు.

దాదాపు నాలుగు గంటల పాటు సమావేశం జరిగినప్పటికీ ప్రజా సమస్యల కన్నా కూడా వాదోపవాదాలు, విమర్శలు,ప్రతి విమర్శలకే అధికార పార్టీ సభ్యులు ప్రాధాన్యత ఇచ్చారు. కౌన్సిల్ సమావేశాలను కూడా కయ్యానికి వేదికగా మార్చడం పై సీనియర్ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపక్ష సభ్యులు సస్పెండ్ అనంతరం ఏకపక్షంగా తీర్మానాలను ఆమోదించుకుని.. సభను నిరవధికంగా వాయిదా వేశారు.

Tags:    

Similar News