మహిళా సమాజానికి సీఎం కేసీఆర్ క్షమాపణలు చెప్పాలి: విజయశాంతి

Update: 2021-02-10 16:10 GMT

విజయ శాంతి ఫైల్ ఫోటో (The Hans India)

తెలంగాణ ము‌ఖ్యమంత్రి కేసీఆర్‌పై బీజేపీ మహిళా నేత, మాజీ ఎంపీ విజయశాంతి నిప్పులు చెరిగారు. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఫలితాలతో కేసీఆర్‌కు ఫ్రస్ట్రేషన్ ఎక్కువైందని ఎద్దేవా చేశారు. ప్రజలను తమ వేదన చెప్పుకోవడానికి వస్తే ఈడ్చుకుపోవాలని కేసీఆర్ అనడాన్ని విజయశాంతి తీవ్రంగా తప్పుబట్టారు. సీఎం కేసీఆర్ గూండాగిరికి తెగబడుతుంటే ఆ దొరహంకారానికి కర్రుకాల్చి ఓటు ద్వారా వాత పెట్టాల్సిన జిమ్మేదారీ ప్రజలు తీసుకోకతప్పదని అన్నారు. బాధిత మహిళలు కుక్కలా ? ఆడబిడ్డలను కుక్కలన్నందుకు యావత్ మహిళా సమాజానికి సీఎం కేసీఆర్ క్షమాపణలు చెప్పాలని విజయశాంతి డిమాండ్ చేశారు.

జీహెచ్ఎంసీ తర్వాత ప్రజలను ఇప్పుడు మరోసారి కలవక తప్పదని, ఎమ్మెల్సీ, నాగార్జునసాగర్ ఎన్నికల దృష్ట్యా అనుకున్నట్టు కనిపిస్తోందని అన్నారు. మాట నిలబెట్టుకోకుంటే ఓట్లు అడగమని... మాట తప్పితే మెడ నరుక్కుంటానని కేసీఆర్ అనడంపై విజయశాంతి ఎద్దేవా చేశారు. ఆయన మాటలన్నీ నిజమైతే.. టీఆర్ఎస్ ఇప్పటికే ఓట్లు అడగకూడదని అన్నారు. ఇక కుర్చీ వేసుకుని స్వయంగా కేసీఆర్ చేస్తానన్న అభివృద్ధి ఎంత ఘనంగా ఉంటుందో పక్కనున్న వరంగల్ జిల్లా ప్రజలకు, మిగతా తెలంగాణకు బాగా తెలుసని వ్యాఖ్యానించారు. మరోసారి ఆ మాటలకు ఇంకెవరూ మోసపోవడానికి సిద్ధంగా లేరని విజయశాంతి అన్నారు. హాలియా సభకు హాజరైన ప్రజలు సీఎం కేసీఆర్ ప్రసంగానికి స్పందించకపోవడమే ఇందుకు నిదర్శనమని వ్యాఖ్యానించారు. ప్రజలు సీఎం గారి ప్రసంగానికి స్పందించక పోవటాన్ని చూస్తేనే అర్థం అవుతోంది విజయశాంతి పేర్కొన్నారు. 

Tags:    

Similar News