Vijayanagaram: విజయనగరంలో కబ్జా కోరల్లో కాలువలు కాలనీలను ముంచేస్తున్న వరద నీరు
విజయనగరంలో కబ్జా కోరల్లో కాలువలు కాలనీలను ముంచేస్తున్న వరద నీరు పెద్ద చెరువు అదనపు జలాలకు దారేది..? ఆక్రమణలు పట్టించుకోని అధికారులు
Vijayanagaram: విజయనగరంలో కబ్జా కోరల్లో కాలువలు కాలనీలను ముంచేస్తున్న వరద నీరు
ఎంతో గొప్ప చరిత్ర ఉన్న విజయనగరం పెద్ద చెరువు కబ్జాకోరల్లో చిక్కుకుంది. మిగులు జలాలను బయటికి పంపించే ప్రధాన కాలువలు ఆక్రమణకు గురయ్యాయి. ప్రజలకు వరద ముంపు కష్టాలు తప్పడం లేదు. కబ్జాలను అధికారులు చూసీ చూడనట్లు వదిలేస్తున్నారు.
విజయనగరం జిల్లాలో కెనాల్స్ కబ్జాకు గురవుతున్నాయి. నగరపాలక సంస్థలోని పెద్ద చెరువు, ప్రధాన కాలువలు కనుమరుగవుతుంది. ఎంతో చారిత్రక నేపథ్యం కలిగిన విజయనగరం 50 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. మూడు లక్షలకుపైగా జనాభా ఉంది. జిల్లా కేంద్రంలో భారీ వర్షాలు వస్తే మాత్రం పట్టణ వాసులు భయంతో వణికిపోతున్నారు. పెద్ద చెరువు ఉప్పొంగితే గుండెల్లో దడ పుడుతుంది. నీరంతా చెరువులోకి వెళ్లిన అదనపు జలాలు వెళ్లేందుకు మార్గం లేదు. ప్రధాన కాలువలు ముంపు బారిన పడి పలు కాలనీలు నీటి ముంపునకు గురవుతున్నాయి...
చెరువు నీరు సముద్రంలో కలిసేందుకు వీలుగా గతంలో 30 అడుగుల వెడల్పున వరద కాలువ ఉండేది. ప్రస్తుతం ఈ కాలువ 10 అడుగుల వెడల్పు మించి కనిపించడం లేదు. ఆక్రమణలతో కాలువ తగ్గిపోయింది. ఐతే గతంలో ఆక్రమణలపై సర్వే చేపట్టిన తరువాత ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. దీంతో నాటి కాలువలు కనిపించకుండా పోతున్నాయి. నీటి కాలువలపై అక్రమ నిర్మాణాలు చేపట్టడంతో కాలువ కుంచించుకుపోతున్నాయి. కొన్నిచోట్ల కాలువలు ఆక్రమణకు గురై రియల్ ఎస్టేట్ వెంచర్లు వెలుస్తున్నాయి. ప్రధాన కాలువలు గల్లంతు అవుతున్నాయి. మిగులు జలాలతోనే డెంకాడ మండలంలోని పంటపొలాలకు ఈ నీటిని ఉపయోగించి పంటలను సాగు చేసేవారని రైతులు చెబుతున్నారు.
ఇటీవల కురిసిన భారీ వర్షాలతో పెద్ద చెరువు నిండటంతో కాలనీలకు భారీ వరద నీరు చేరింది. వినాయకనగర్, నాయుడు కాలనీ, పద్మావతి నగర్, ధర్మపురి, భగవాన్ నగర్, నటరాజ్ కాలనీ, సింహాద్రి నగర్ వాసులు అవస్థలు పడ్డారు. .భారీ వర్షాల సమయంలో పైఅంతస్తుల్లోకి వెళ్తున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం ఈ కాలువపై కొంతమంది రియల్ ఎస్టేట్ వెంచర్లు వేసినా..కనీసం సంబంధిత అధికారులు అటుగా కన్నెత్తి కూడా చూడకపోవడంపై పట్టణ వాసులు మండిపడుతున్నారు. కాలువలను పరిరక్షించాల్సిన అధికారులు ఆక్రమణ దారులకు రెడ్ కార్పెట్ వేస్తున్నారంటూ విమర్శలు వినిపిస్తున్నాయి.పట్టణంలో కాలువలు ఆక్రమణ కొనసాగితే మాత్రం రానున్న రోజుల్లో విజయనగరం పట్టణం పెను విపత్తు ఎదుర్కొనే ప్రమాదం పొంచి ఉండవచ్చన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.