సీఈసీకి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి లేఖ

Update: 2019-04-13 13:11 GMT

ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలను(ఈవీఎం) భద్రపరిచిన సెంటర్ల వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కోరారు. ఈమేరకు కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌ సునీల్‌ ఆరోరాకు ఆయన లేఖ రాశారు. ఓట్లు లెక్కించడానికి చాలా సమయం ఉన్నందున స్ట్రాంగ్‌ రూమ్‌ల వద్ద గట్టి నిఘా పెట్టాలని కోరారు.

ఈసీకి రాష్ట్ర ప్రభుత్వం సహకరించే పరిస్థితులు ఏ మాత్రం లేవని అందువలన ఈవీఎంలు భద్రపరిచిన కేంద్రాల వద్ద సీఐఎస్‌ఎఫ్‌, సీఆర్‌పీఎఫ్‌ వంటి కేంద్ర బలగాలను ఏర్పాటు చెయ్యాలని విజ్ఞప్తి చేశారు. భద్రతా సిబ్బందితో పాటుగా స్ట్రాంగ్ రూమ్ ల వద్ద 24 గంటలు పనిచేసేలా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కోరారు. కాగా ఆంధ్రప్రదేశ్ లో ఈనెల 11న స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించినందుకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తరపున ఎన్నికల సంఘానికి విజయసాయిరెడ్డి ధన్యవాదాలు తెలిపారు. 

Similar News