Veligonda projectr: వెలిగొండ హెడ్ రెగ్యులేటర్ కు గేట్లు బిగించేశారు..

Veligonda project: వెలిగొండ రిజర్వాయర్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

Update: 2020-07-24 17:21 GMT

మూడు జిల్లాలకు వరప్రదాయిని అయిన వెలిగొండ ప్రాజెక్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం హెడ్ రెగ్యులేటర్ పనులు దాదాపు పూర్తి అయ్యాయి. నాలుగురోజుల కిందట హెడ్ రెగ్యులేటర్ కు గేట్లు బిగించారు. దీంతో శ్రీశైలంలోకి వస్తోన్న వరద మూలంగా పనులకు ఎటువంటి ఆటంకం కలగకుండా.. టన్నెల్ పనులు సాగుతున్నాయి. వాస్తవానికి జూన్ 25కు గేట్లు బిగించటం పూర్తి చెయ్యాలని అధికారులు భావించారు కానీ.. కరోనా నేపథ్యంలో కొన్నిరోజులు పనులకు ఆటకం ఏర్పడింది. దీంతో 20 రోజులపాటు గేట్ల బిగింపు ప్రక్రియ ఆలస్యం అయింది. అయితే తాజాగా గేట్లను బిగించినట్టు ఆర్ఆర్ ఇన్ ఫ్రా కాంట్రాక్టు సంస్థ జలవనరుల శాఖకు తెలిపింది. దీంతో హెడ్ రెగ్యులేటర్ పనులు దాదాపు పూర్తయినట్టు స్పష్టం చేసింది. ఇక ఇప్పుడు అందరి చూపు మొదటి టన్నెల్ పనుల మీద ఉంది. 18.82 కి.మీ పొడవైన మొదటి టన్నెల్ లో ఇంకా 590 మీటర్లు మాత్రమే పెండింగ్ లో ఉంది. అయితే హెడ్ రెగ్యులేటర్ పనులు పూర్తి కావడంతో టన్నెల్ లోకి నీరు రాకుండా ఉంటుంది.. కాబట్టి రెండున్నర నెలల్లో మొదటి టన్నెల్ పూర్తయ్యే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

అదే జరిగితే మూడు దశాబ్దాలుగా పశ్చిమ ప్రకాశం, కడప జిల్లా బద్వేల్,నెల్లూరు జిల్లా ఉదయగిరి ప్రాంత వాసులు కల మొదటి దశపూర్తయినట్లే అంటున్నారు. మరోవైపు పునరావాస ప్యాకేజీ విషయంలో కూడా ఈ నెలాఖరులోగా ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. పునరావాసానికి ఇప్పటికే 14 వందల కోట్ల రూపాయలు విడుదల చేసింది వైసీపీ ప్రభుత్వం. ఇదిలావుంటే రెండవ టన్నెల్ 7 కి.మీ పెండింగ్ లో ఉంది. ఇది దాదాపు రెండేళ్లు పట్టే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. మొదటి టన్నెల్ పూర్తయినా.. కుదిరితే నవంబర్ నాటికి నీరు ఇవ్వవచ్చు. అయితే శ్రీశైలం జలాశయంలో ప్రస్తుతం నీటి మట్టం 847 అడుగులు మాత్రమే ఉంది. వెలిగొండకు నీరు ఇవ్వాలి అంటే నీటి మట్టం 885 అడుగులు ఉండాల్సి ఉంటుంది. వరద సీజన్ ఇంకా నెలరోజులు ఉంటుంది కాబట్టి అనుకున్నంత మేర శ్రీశైలానికి నీరు వస్తే పశ్చిమ ప్రకాశం,కడప జిల్లా బద్వేల్,నెల్లూరు జిల్లా వాసుల దశాబ్దాల కల ఖచ్చితంగా తీరవచ్చు.  

Tags:    

Similar News