Unanimous for one person in Competition:పోటీలో ఒక్కరే ఉంటే ఏకగ్రీవమే... నోటా చెల్లదు

Unanimous for one person in Competition: గత కొంతకాలం వరకు ఎన్నికల్లో పోటీచేసిన వారిలో ఎవరో ఒక్కరికి ఓటు వేసి తీరాల్సిందే.

Update: 2020-07-21 04:09 GMT
Representational Image

Unanimous for one person in Competition: గత కొంతకాలం వరకు ఎన్నికల్లో పోటీచేసిన వారిలో ఎవరో ఒక్కరికి ఓటు వేసి తీరాల్సిందే. ఓటరుకు పోటీ చేసిన అభ్యర్థుల్లో ఎవ్వరూ ఇష్టం లేకపోయినా తప్పనిసరి పరిస్థితుల్లో ఎవరో ఒక్కరికి ఓటు వేసేవాడు. క్రమేణా కేంద్ర ఎన్నికల సంఘం నోటా ఓటును తీసుకొచ్చింది. పోటీ చేసిన అభ్యర్థుల్లో తనకు ఇష్టం లేకపోతే నోటా ఓటును వినియోగించుకునేలా ఈ అవకాశాన్ని కల్పించింది. అయితే ఒకే అభ్యర్థి పోటీ చేసిన సమయంలో నోటా వినియోగించుకోవచ్చా? లేదా? అనే దానిపై ఒక వ్యక్తి హైకోర్టును ఆశ్రయించడంతో ఇది మరోమారు తెరపైకి వచ్చింది. ఇతర సమయాల్లో మాదిరిగానే ఒక అభ్యర్థి ఉన్నప్పుడు నోటా వినియోగించుకోవచ్చో లేదో తెలపాలని కోరడంతో దీనిపై హైకోర్టు స్పష్టత ఇచ్చింది.

స్థానిక ఎన్నికల్లో 'నోటా' వినియోగంపై హైకోర్టు కీలక ఉత్తర్వులు వెలువరించింది. 'స్థానికం'లో ఒక అభ్యర్థే ఉన్న చోట నోటా వినియోగించాల్సిన అవసరం లేదని, ఆ అభ్యర్థి ఎన్నిక ఏకగ్రీవమైనట్లు ప్రకటించాల్సిందేనని తేల్చిచెప్పింది. ఒకరికి మించి అభ్యర్థులుండి, ఎన్నికలు జరిగితేనే నోటా వినియోగానికి ఆస్కారముంటుందని పేర్కొంది. ఒక అభ్యర్థే బరిలో ఉన్నా నోటా వినియోగించవచ్చనే నిబంధనలేవీ లేవని స్పష్టం చేసింది. నోటా వినియోగ నిబంధనలపై మరింత స్పష్టత కోసం అవసరమైతే పిటిషనర్‌ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించవచ్చని సూచించింది.

ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జేకే మహేశ్వరి, న్యాయమూర్తి జస్టిస్‌ బి.కృష్ణమోహన్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. స్థానిక ఎన్నికల్లో ఒక్కరే బరిలో ఉన్నప్పుడు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించరాదని, ఆ అభ్యర్థిని వ్యతిరేకించే ఓటర్ల మనోభావాలు కూడా తెలుసుకునేందుకు అనువుగా నోటా వినియోగించేలా ఆదేశాలు జారీ చేయాలని అభ్యర్థిస్తూ తూర్పుగోదావరి జిల్లాకు చెందిన బీవీ భద్రత నాగశేషయ్య, కందుకూరి ఎల్‌ఎన్‌ఎ్‌సకే రావ్‌ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్‌) దాఖలు చేయగా.. ధర్మాసనం ఈ మేరకు స్పష్టత ఇచ్చింది.


Tags:    

Similar News