టీటీడీ ఛైర్మన్ గా భూమన కరుణాకర్ రెడ్డి?

*బీసీని చైర్మన్‌గా నియమించాలని యోచనలో సర్కార్.. ఓటు బ్యాంకు కోసం జగన్‌కు సూచిస్తోన్న సీనియర్ నేతలు?

Update: 2022-12-28 06:23 GMT

టీటీడీకి త్వరలో నూతన పాలక మండలి నియామకం జరుగనుందా?

TTD Chairman: తిరుమల తిరుపతి దేవస్థానానికి కొత్త పాలక మండలి రాబోతోందని సమాచారం. ప్రస్తుత చైర్మన్‌, సీఎం జగన్‌ బాబాయి వైవీ సుబ్బారెడ్డి సారథ్యంలోని బోర్డు పదవీకాలం వచ్చే ఏడాది ఆగస్టు వరకు ఉంది. అయితే ఉత్తరాంధ్ర వైసీపీ బాధ్యతలు తీసుకున్న సుబ్బారెడ్డి అక్కడి రాజకీయ వ్యవహారాలతో బిజీ అయ్యాడు. రెండోసారి ఆయనకు పదవి లభించినప్పుడు సైతం ఆయన వద్దనలేక కొనసాగుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్ర బాధ్యతలు తీసుకున్న తర్వాత సరైన కారణం దొరకడంతో తన అభిమతాన్ని ముఖ్యమంత్రికి చెప్పినట్లు సమాచారం. దానికి అంతర్గత కారణాలు అనేకం ఉన్నా ఇద్దరు అభిప్రాయాలు ఏకమవడంతో ముఖ్యమంత్రి కూడా కొత్త చైర్మన్ ఎంపిక కోసం కసరత్తు మొదలు పెట్టారని ప్రచారం జరుగుతోంది.

దీంట్లో భాగంగానే తిరుపతి ఎమ్మెల్యే, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డికి చైర్మన్‌గా బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సీనియర్ నాయకుడిగా జగన్ కుటుంబానికి విశ్వాసపాత్రుడిగా ఉన్న ఆయనకు కొన్ని సమీకరణలతో మంత్రి పదవి దక్కలేదు. దీంతో టీటీడీ చైర్మన్ పదవి ఇవ్వ చూపుతున్నారని ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వానికి ఏడాదిన్నర కాలం మాత్రమే ఉంది. ఈలోపు క్యాబినెట్ హోదా కలిగిన ఈ పదవి ఇవ్చడం ద్వారా ఆయనకు సముచితమైన స్థానం ఇచ్చినట్లవుతుందని అదిష్టానం భావిస్తోందని తెలుస్తోంది. రెండు వారాల్లో ఎంపిక ప్రక్రియ ముగియనున్నట్లు సమాచారం. సంక్రాంతి తరువాత నియామకం ఉంటుందని ప్రచారం జరుగుతోంది.

తిరుమలలో జనవరి 2 నుంచి పది రోజుల పాటు వైకుంఠ ఏకాదశి దర్శనాలు పూర్తయ్యాకే కొత్త బోర్డును ప్రకటించే అవకాశం ఉంది. కాగా ఇదే సమయంలో ఓ వర్గం బీసీ కార్డును ఉపయోగిస్తోందని సమాచారం. ఈసారి బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని నియమిస్తే ఎన్నికల్లో ఉపయోగపడుతుందని జగన్‌కు కొంతమంది సీనియర్ నేతలు సూచిస్తున్నారని కూడా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఉన్న బోర్డు సభ్యులతో పాటు వివిధ రాష్ట్రాల్లోని స్థానిక టీటీడీ సలహా మండలి చైర్మన్లను ప్రత్యేక ఆహ్వానితులుగా చేర్చారు. దీంతో బోర్డు సభ్యుల సంఖ్య 50కి దాటిపోయింది. ప్రస్తుతం ఈ వివాదం కోర్టులో ఉంది. ఈసారి ప్రత్యేక ఆహ్వానితులు లేకుండా నియామకాలు చేపట్టే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.

Tags:    

Similar News