కరోనా ఎఫెక్ట్ : టీటీడీ కీలక నిర్ణయం

కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తుంది. చైనాలో మొదలైన మహమ్మారి ఇప్పుడు ప్రపంచ దేశాలకి వ్యాపించి ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తుంది. ఇక భారత్ లో ఇప్పటి

Update: 2020-03-13 03:31 GMT
TTD to allow cancellation of darshan

కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తుంది. చైనాలో మొదలైన మహమ్మారి ఇప్పుడు ప్రపంచ దేశాలకి వ్యాపించి ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తుంది. ఇక భారత్ లో ఇప్పటికి 73 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక రెండు తెలుగు రాష్ట్రాలలో రెండు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈనేపధ్యంలో ప్రజలు ప్రయాణాలు చేయడానికి భయపడుతున్నారు. అయితే ఇప్పుడు ఈ ఎఫెక్ట్ తిరుమల వేంకటేశ్వర స్వామి కూడా పడింది. కరోనా వైరస్ వ్యాపించకుండా ఉండేందుకు టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. రూ.300 ప్రత్యేక దర్శనం టికెట్లు, వసతి గదుల తేదీలు మార్పు చేసుకునే అవకాశంతో పాటు వాటిని రద్దు చేసుకునే అవకాశాన్ని భక్తులకు టీటీడీ కల్పించింది.

టికెట్లను క్యాన్సిల్ చేసే విషయంలో అనుమానాలు ఉన్నవారు dyeotemple@gmail.com కు మెయిల్ చేయాలని సూచించింది. శుక్రవారం నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని పేర్కొంది. ఇలా టికెట్లు రద్దు చేసుకునే అవకాశాన్ని కల్పించడం చరిత్రలో ఇదే తొలిసారి కావడం విశేషం.. ఇక దగ్గు, జ్వరం, జలుబు ఉన్నవారు 28 రోజుల పాటు తిరుమలకు రావొద్దని పేర్కొంది. ఒకవేళ అలాంటి లక్షణాలు కనిపిస్తే అలిపిరి, శ్రీవారి మెట్టు వద్ద థర్మో స్క్రీనర్ల ద్వారా స్క్రీనింగ్ చేస్తామని.. అవసరమైతే వైద్య సాయం అందిస్తామన్నారు.

తిరుమలకి నిత్యం భక్తుల తాకిడి ఎక్కువగానే ఉంటుంది. రోజుకు 70 వేల మంది నుంచి లక్ష మంది వరకు శ్రీవారిని దర్శించుకుంటారు. దీనితో జనసమూహం ఎక్కువగా ఉండడం, అందులో ఎవరికైనా కరోనా వైరస్ సోకినట్టు అయితే అది మరింతగా వ్యాపించే అవకాశం ఉండడంతో టీటీడీ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక కరోనా పై అవగాహన కల్పించేందుకు ప్రసార సాధనాలు, ఎస్వీబీసీ భక్తి చానల్ ద్వారా కార్యక్రమాలను చేపట్టనుంది.

ఇక సుమారు 125 దేశాలకు ఈ కరోనా వైరస్‌ విస్తరించింది. ప్రపంచ వ్యాప్తంగా మొత్తం లక్షా 30వేల 237 కేసులు నమోదయ్యాయి. అందులో 68వేల 677 మంది చికిత్స తీసుకొని డిశ్చార్జ్‌ అయ్యారు. ఇంకా 56వేల 804 మంది చికిత్స పొందుతున్నారు. 5వేల 714 మందికి క్రిటికల్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. కొత్తగా వెయ్యి 600 కేసులు నమోదయినట్లు సమాచారం. కరోనాతో మొత్తం ఇప్పటి వరకు 4వేల 756 మంది మృతి చెందినట్లు సమాచారం. 

Tags:    

Similar News