కురులతో సిరులు.. తలనీలాల ద్వారా టీటీడీకి భారీగా ఆదాయం..

Tirumala News: ఏడుకొండల వాడికి ఎటు చూసినా ఆదాయమే... హుండీ మొదలుకొని తలనీలాల విక్రయం వరకు అన్ని కోటానుకోట్లు కుమ్మరిస్తున్నాయి.

Update: 2022-11-29 07:18 GMT

కురులతో సిరులు.. తలనీలాల ద్వారా టీటీడీకి భారీగా ఆదాయం..

Tirumala News: ఏడుకొండల వాడికి ఎటు చూసినా ఆదాయమే... హుండీ మొదలుకొని తలనీలాల విక్రయం వరకు అన్ని కోటానుకోట్లు కుమ్మరిస్తున్నాయి. తాజాగా జరిగిన తలనీలాల ఈ౼వేలం ద్వారా 48 కోట్ల రూపాయిల ఆదాయం సమకూరింది వడ్డీకాసుల వాడికి సిరులు కురిపిస్తోన్న కురులపై ప్రత్యేక కథనం.

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసే చాలామంది భక్తులు భక్తిశ్రద్ధలతో తలనీలాలు సమర్పిస్తుంటారు. శ్రీవారికి త‌ల‌నీలాల స‌మ‌ర్పించ‌డాన్ని భక్తులు అత్యంత ప‌విత్రంగా భావిస్తారు. భక్తితో సమర్పిస్తున్న కురుల ద్వారానూ సిరులు సమకూరుతున్నాయి.. గడిచిన ఆరు నెలల కాలంలో ఈ-వేలంలో తలవెంట్రుకలను టీటీడీ విక్రయించి 47 కోట్ల 92 లక్షల ఆదాయాన్ని గడించింది. తిరుమ‌ల‌లోని ప్రధాన కల్యాణకట్ట మినీ కల్యాణకట్టల్లో యాత్రికులు ఉచితంగా త‌ల‌నీలాలు స‌మ‌ర్పించేలా టీటీడీ ఏర్పాట్లు చేసింది. యాత్రికులు భ‌క్తితో స‌మ‌ర్పించిన త‌ల‌నీలాల‌ను టీటీడీ ప్రత్యేక శ్రద్ధతో సేకరించి నిల్వ చేస్తుంది. త‌ల‌నీలాల విక్రయం ద్వారా సంవత్సరానికి 150 కోట్ల రూపాయల ఆదాయం స‌మ‌కూరుతోంది.

యాత్రికులు స‌మ‌ర్పించిన త‌ల‌నీలాల‌ను ముందుగా హుండీల్లో వేస్తారు. వివిధ సైజుల్లో ఉన్న ముడులు, 5 అంగుళాల కంటే త‌క్కువ ఉన్న తుక్కును వేర్వేరుగా సేక‌రిస్తారు. అంత‌ర్జాతీయ ప్రమాణాలకనుగుణంగా తల వెంట్రుకలను నిర్దేశించిన సైజుల వారీగా టీటీడీ విభ‌జిస్తుంది. తిరుమ‌ల నుంచి ప్రతి రోజూ సాయంత్రం టీటీడీ వాహ‌నంలో భద్రత మధ్య తిరుప‌తిలోని హ‌రే రామ ఆల‌యం రోడ్డులోని గోడౌన్‌కు త‌ర‌లిస్తారు. ముడులు, తుక్కు క‌లిపి రోజుకు 900 కిలోల వరకు త‌ల‌నీలాలు గోడౌన్‌కు చేరుతుంటాయి. అన్నిరకాల తలనీలాలకు ఈ-వేలం నిర్వహించడం టీటీడీ ఆనవాయితీ. దంట్లో భాగంగా ఈనెలలో నిర్వహించిన ఈ-వేలంలో 21 వేల వంద కిలోల తలనీలాలు అమ్ముడుపోయాయి.

శ్రీనివాసుడి భక్తుల నుంచి సేకరించిన మహిళల శిరోజాలకు అంతర్జాతీయంగా అత్యధిక డిమాండ్ ఉంది. వీటిని నల్ల బంగారంగా పిలుస్తుంటారు. ప్రపంచవ్యాప్తంగా విగ్గులకు భారీ డిమాండ్ ఉంది. అలాగే బార్బీ బొమ్మల జుట్టుకు సైతం నేచురల్‌ వెంట్రుకలను ఉపయోగిస్తున్నారు. ఇలా ప్రపంచవ్యాప్తంగా భారతీయుల శిరోజాలకు అత్యధిక డిమాండ్ ఉంది. తలనీలాలు విక్రయం ఇలా శ్రీవారికి రెండో పెద్ద ఆదాయ వనరుగా మారింది. తలనీలాల ద్వారా టీటీడీకి ఇంత ఆదాయం లభించడం ఓ రికార్డుగా నిలుస్తోందని టీటీడీ అధికారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News