Birthplace of Hanuman: హనుమంతుని జన్మస్థానంపై అధికారిక ప్రకటన చేసిన టిటిడి

Birthplace of Hanuman: సప్తగిరుల్లోని అంజనాద్రే ఆంజనేయుడి జన్మస్థానమని తెలిపింది.

Update: 2021-04-21 08:04 GMT

Hanuman: (File Image)

Birthplace of Hanuman: హనుమంతుడి జన్మస్థానంపై తిరుమల తిరుపతి దేవస్థానం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రకటన ప్రకారం సప్తగిరుల్లోని అంజనాద్రే ఆంజనేయుడి జన్మస్థానమని తెలిపింది. ఈ మేరకు తిరుమలలోని నాదనీరాజనం వేదికగా జాతీయ సంస్కృత వర్సిటీ వీసీ ఆచార్య మురళీధర శర్మ ప్రకటించారు. ఆంజనేయుడి జన్మస్థానంపై అన్వేషణకు తితిదే కమిటీని ఏర్పాటు చేసింది. క‌మిటీలోని పండితులు ప‌లుమార్లు స‌మావేశమై లోతుగా ప‌రిశోధ‌న చేసి హ‌నుమంతుడు అంజ‌నాద్రిలోనే జ‌న్మించాడ‌ని రుజువు చేసేందుకు బ‌ల‌మైన ఆధారాలను సేక‌రించారు. హనుమ జన్మస్థలంపై నాలుగు నెలల పాటు తమ కమిటీ అన్వేషణ కొనసాగిందని ఆచార్య మురళీధర శర్మ చెప్పారు. అన్వేషణకు సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించారు.

వేంకటాచల మహత్యాన్ని పౌరాణిక ఆధారంగా...

హనుమ జన్మస్థానంపై సంకల్పం తీసుకున్నాం. శాసన, భౌగోళిక, పౌరాణిక, వాజ్ఞ్మయ ప్రమాణాలతో ఆధారాలు సేకరించాం. వేంకటాచల మహత్యాన్ని పౌరాణిక ఆధారంగా తీసుకున్నాం. వేంకటాచలానికి అంజనాద్రితో పాటు 20 పేర్లు ఉన్నాయి. త్రేతాయుగంలో దీన్ని అంజనాద్రిగా పిలిచారు. అంజనాద్రికి హనుమ పుట్టాడని పురాణాలు చెబుతున్నాయి. అంజనాదేవికి తపోఫలంగా హనుమంతుడు జన్మించాడు. సూర్యబింబం కోసం వేంకటగిరి నుంచే హనుమ ఎగిరాడు. 12 పురాణాలు ఆంజనేయుడు తిరుమల కొండల్లోనే పుట్టాడని చెబుతున్నాయి. ఛత్తీస్‌గఢ్‌, నాసిక్‌ పరిశోధకులు సహా అందరికీ దీన్ని స్పష్టం చేస్తున్నాం. 12, 13 శతాబ్దం నాటి ఎన్నో రచనల్లో అంజనాద్రి ప్రస్తావన ఉంది. అన్నమయ్య కీర్తనల్లో వేంకటాచలాన్ని అంజనాద్రిగా వర్ణించారు '' అని మురళీధర శర్మ వెల్లడించారు.

డా.ఆకెళ్ల విభీష‌ణ‌శ‌ర్మ క‌న్వీన‌ర్‌గా...

హనుమ జన్మస్థానంపై అన్వేషణకు ఏర్పాటు చేసిన కమిటీకి తితిదే ఎస్వీ ఉన్న‌త వేదాధ్య‌య‌న సంస్థ ప్రాజెక్టు అధికారి డా.ఆకెళ్ల విభీష‌ణ‌శ‌ర్మ క‌న్వీన‌ర్‌గా వ్య‌వ‌హ‌రించారు. మురళీధర శర్మతో పాటు ఎస్వీ వేద విశ్వ‌విద్యాల‌యం ఉప‌కుల‌ప‌తి ఆచార్య స‌న్నిధానం సుదర్శ‌న‌ శ‌ర్మ‌, ఆచార్య రాణి స‌దాశివ‌మూర్తి, ఆచార్య జాన‌మ‌ద్ది రామ‌కృష్ణ‌, ఆచార్య శంక‌ర‌నారాయ‌ణ‌, ఇస్రో శాస్త్రవేత్త రేమెళ్ల మూర్తి, రాష్ట్ర పురావ‌స్తు శాఖ డిప్యూటీ డైరెక్ట‌ర్ విజ‌య్‌కుమార్ స‌భ్యులుగా ఉన్నారు.

Tags:    

Similar News