జాతీయబ్యాంకులకు బంపర్ ఆఫర్‌ ప్రకటించిన టీటీడీ

Update: 2019-08-18 11:06 GMT

ఆధ్యాత్మీక దివ్యక్షేత్రం తిరుమల తిరుపతి వెంకన్నకు భక్తులు సమర్పించిన చిల్లర నాణేలు మోయలేని భారంగా మారాయి. గుట్టలు గుట్టలుగా పేరుకుపోయిన చిల్లరను ఏం చేయాలో అధికారులకు అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు. సమస్యగా మారిన నాణెల మార్పిడికి చెక్‌పెట్టేందుకు టీటీడీ అధికారులు వినూత్న పద్ధతికి శ్రీకారం చుట్టారు. పరిష్కారం కూడా దొరకని చిల్లర సమస్యకు అధికారులు వేసిన స్కేచ్‌ ఏంటో తెలియాలంటే స్టోరీలోకి ఎంటర్‌ కావాల్సిందే.

కలియుగ వైకుంఠమైన తిరుమలలో ఆ వడ్డీకాసుల వాడికి ప్రపంచమంతటా భక్తులే. ఆ భక్తులు తమ మొక్కుబడులను శ్రీవారికి ధన, వస్తు రూపేణా హుండీలో సమర్పిస్తుంటారు. ఆ కానుకల్లో చిల్లర నాణేలు భారీగా పేరుకుపోయాయి. చిల్లర కుప్పలతో, టన్నుల, టన్నుల చిల్లర నాణేలతో పరకామణి ఖజనా పేరుకుపోయింది. వడ్డీకాసుల వాడిగా పిలవబడే వెంకన్నకు ఆ కాసులే తలనొప్పిగా మారడంతో ఆ సమస్యకు చెక్ పెట్టడానికి టీటీడీ నయా ఐడియాను ఫాలో అవ్వాలని నిర్ణయించుకుంది.

గత కొన్నేళ్లుగా టీటీడీకి సంబంధించిన ఆదాయాన్ని పలు జాతీయబ్యాంకుల్లో డిపాజిట్ చేస్తున్నారు. అయినప్పటికీ చిల్లర నాణేలు సేకరణకు బ్యాంకులు ముందుకు రాకపోవడంతో టీటీడీ వారికి బంపర్ ఆఫర్ ప్రకటించింది. టీటీడీ పరకామణి నుంచి చిల్లర నాణేలు సేకరించిన బ్యాంక్‌లకు అంతే మొత్తంలో నగదు డిపాజిట్ చేయనున్నట్లు షరత్‌లు విదించింది. స్కీం నచ్చిన పలు బ్యాంకులు డిపాజిట్ల కోసం ముందుకు వస్తున్నాయి. దీంతో టీటీడీ దగ్గర భారీగా గుట్టలు గుట్టలుగా పేరుకుపోయిన నాణేలు సేకరణకు చెక్‌పడింది.

చిల్లర నాణెలను బ్యాంకులు తీసుకోకపోవడంతో 20 కోట్ల నాణెలు ఖజనాలో పేరుకుపోయినట్లు స్పెషల్ ఆఫిసర్ ధర్మారెడ్డి తెలిపారు. నెలకు దాదాపు 5 కోట్ల వరకు చిల్లర నాణెలు వస్తుంటాయని వాటిని మార్చడం తలనొప్పిగా మారడంతో ఈ కొత్త నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు. మరో 15 రోజుల్లో చిల్లర నాణేల మార్పిడి జరిగిపోతుందని పరకామణిలో పేరుకుపోయిన చిల్లర గుట్టలను తగ్గించడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలిపారు. ఇక కొండలా పేరుకుపోయిన చెల్లుబాటులోలేని పావలా, అర్థరూపాయి నాణేలతో పాటు విదేశీ నాణేలు, కరెన్సీలను లెసైన్స్‌ ఎక్స్‌చేంజర్స్ ద్వారా మార్చేందుకు యోచిస్తోంది. మొత్తానికి టీటీడీ అమలు చేస్తున్న ఈ స్కీం సక్సెస్‌ అయితే గోనె సంచుల్లో మగ్గుతున్న చిల్లరకు మోక్షం లభించడం ఖాయమని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Full View  

Tags:    

Similar News