East Godavari: తూర్పుగోదావరి జిల్లాలో ఆక్వా రైతుకు అష్టకష్టాలు

East Godavari: ఓ వైపు దిగుబడులు తగ్గి మరోవైపు ధరలు పెరిగి.. నష్టాలు చవిచూస్తున్న ఆక్వా రైతులు

Update: 2022-03-17 12:15 GMT

East Godavari: తూర్పుగోదావరి జిల్లాలో ఆక్వా రైతుకు అష్టకష్టాలు

East Godavari: ధర బాగుందన్న ఆనందం ఆక్వా రైతుకు ఎన్నో రోజులు నిలువలేదు. అసలే నాణ్యత లేని రొయ్య పిల్లలతో దిగుబడులు తగ్గి సంక్షోభంలో కూరుకుపోతున్న ఆక్వా రైతులకు దెబ్బ మీద దెబ్బ పడుతుంది. 15 రోజుల వ్యవధిలోనే రొయ్యల ధర పడిపోయి మేత ధర పెరిగింది. పెట్టుబడి ఖర్చులు అంతకంతకూ పెరిగిపోవడంతో ఆక్వా రైతులకు భారంగా మారిన రొయ్యల సాగుపై హెచ్ఎం టీవీ స్పెషల్ స్టోరీ.

15 రోజుల వ్యవధిలోనే ఆక్వా రైతుల పరిస్థితి అస్థవ్యస్థంగా మారింది. బహిరంగ మార్కెట్లో ఒక్కసారిగా రొయ్యల ధర పడిపోయింది. ఫిబ్రవరి 18న వంద కౌంట్ కేజీ రొయ్యల ధర 285 రూపాయలు పలికితే... ప్రస్తుతం 230కి పడిపోయింది. 60 కౌంట్ రొయ్యల ధర రూ.610 నుంచి రూ.520కి దిగి వచ్చింది. ప్రతికూల వాతావరణ పరిస్థితులతో దిగుబడులు రాకపోయినా జనవరి, ఫిబ్రవరిలో మంచి ధర లభించడంతో సాగుదారులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఇప్పుడు ధర పడిపోవడంతో బేజారవుతున్నారు.

వేసవి సీజన్‌లో రొయ్యల దిగుబడులు బాగా వస్తాయన్న ఆశతో కౌలు రైతులు పోటీ పడి మరీ ఎకరాకు లక్షా 80 వేల కౌలు చెల్లించి చెరువులు లీజుకు తీసుకున్నారు. సాధారణ చెరువులకు సైతం 60 వేల నుంచి లక్ష వరకు పెట్టారు. అయితే నాణ్యమైన రొయ్య పిల్లలు లభించకపోవడంతో వేసిన రొయ్య పిల్లల్లో సగం మాత్రమే బతికాయి. మరికొన్ని చోట్ల 30 నుంచి 40 శాతం మాత్రమే పెరిగాయి. ఇలా ఓ వైపు పెట్టుబడులు పెరుగుతుంటే.... మరోవైపు దిగుబడులు తగ్గడమే కాకుండా మార్కెట్‌‌లో ధర క్షీణించి అప్పుల ఊబిలో కూరుకుపోతున్నామని వాపోతున్నారు సాగుదారులు.

ప్రస్తుత సీజన్‌లో తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా 50 వేల ఎకరాల్లో రొయ్యల సాగు చేస్తున్నారు. ఈ సారి పంట మొత్తం ఒకేసారి మార్కెట్ లోకి వస్తే ధరలు మరింత పడిపోతాయని రైతులు వాపోతున్నారు. తమకు నాణ్యమైన రొయ్య పిల్లలు లభించేలా ప్రభుత్వం చొరవ తీసుకుని చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

అంతేకాక ధరల పెరుగుదల పేరుతో రొయ్యల మేత తయారీ పరిశ్రమలు 25 కేజీల మేత బస్తాపై ఒక్కసారి 125 రూపాయలు పెంచి రైతులకు షాక్ ఇచ్చారు. దీంతో రైతుపై ఎకరాకు 15 వేల రూపాయల భారం అదనంగా పడుతోందని వాపోతున్నారు. అంతేకాక సున్నం, పొటాషియం, మెగ్నీషియం ఇతర రసాయనాల ధరలు పెరిగిపోయాయని. కరెంటు కోతలతో డీజిల్ కొనుగోలు మరింత భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం తమను ఆదుకోవాలని తూర్పు గోదావరి జిల్లా రైతులు కోరుతున్నారు.

Tags:    

Similar News