రైలు పట్టాలపై ఘోరం.. 12 మంది మృతి..100 మందికిపైగా గాయాలు
Train Accident: కంటకాపల్లి రైలు ప్రమాదంలో పెరుగుతోన్న మృతులు
రైలు పట్టాలపై ఘోరం.. 12 మంది మృతి..100 మందికిపైగా గాయాలు
Train Accident: బాలాసోర్ రైలు ప్రమాద ఘటన.. ఆ ప్రమాదం మిగిల్చిన విషాదం మరువకముందే మరో ప్రమాదం చోటుచేసుకుంది. విజయనగరం జిల్లా కంటకాపల్లెలో రెండు రైళ్లు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇప్పటివరకు 12 మంది మరణించినట్టు సమాచారం అందుతోంది. అందులో పలాస రైలులోని గార్డు, విశాఖ రాయగడ రైలులోని లోకో పైలట్లు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. అర్ధరాత్రి వరకు పది మంది మృతదేహాలు వెలికితీయగా మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉన్నట్టు సమాచారం.
ఆదివారం రాత్రి 7 గంటల సమయంలో పలాస ప్యాసింజర్ సిగ్నల్ కోసం కంటకాపల్లె దగ్గర ట్రాక్‌పై నిలిచింది. అదే సమయంలో వెనుక నుంచి వచ్చిన రాయగడ రైలు సిగ్నల్ ట్రాక్ తప్పి పలాస ప్యాసింజర్ రైలును ఢీకొట్టింది. వేగంగా పలాస రైలును ఢీకొట్టడంతో అందులోని బోగీలు నుజ్జునుజ్జయ్యాయి. రాయగడ రైలులోని మూడు బోగీలు ఇంజిన్‌ను ఎక్కి పక్కనే ఉన్న గూడ్స్ రైలుకు తగిలాయి. పైకి లేచిన మూడు బోగీల కింది భాగంలోకి వెనకాల ఉన్న బోగీలు రావడంతో ప్రమాద తీవ్రత పెరిగింది. రాయగడ రైలులోని దివ్యాంగుల బోగీ పట్టాలు తప్పి పక్కనే ఉన్న పొలాల్లో పడింది.
బాలాసోర్ ఘటన తరహాలో జరిగిన ఈ ప్రమాదంతో కంటకాపల్లె ప్రాంతం భీతావహంగా మారింది. రెప్పపాటు కాలంలోనే ట్రాక్‌పై బోగీలు చెల్లాచెదురయ్యాయి. రెండుగా విరిగిపోయి నుజ్జనుజ్జయ్యాయి. దీంతో ఒక్కసారిగా ఆ ప్రాంతం ఆర్తనాదాలు, అరుపులు, కేకలతో భయానకంగా మారింది. మృతుల కుటుంబాల రోదనలు, బోగీల్లో చిక్కుకున్న వారి ఆర్తనాదాలతో కంటకాపల్లిలో పరిస్థితి దయనీయంగా మారింది.
బోగీలు నుజ్జునుజ్జవడంతో.. చాలా మంది ప్రయాణికులు అందులోనే చిక్కుకున్నారు. మొత్తం 12 మంది మృతదేహాలను ఇప్పటివరకు రెస్క్యూ టీమ్స్ వెలికితీశాయి. చిక్కుకున్న ప్రయాణికులను బయటకు తీసేందుకు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. బోగీలన్న నుజ్జవడంతో కట్టర్ల సాయంతో మృతదేహాలను బయటకు తీస్తున్నారు. ఒక ఎన్డీఆర్ఎఫ్, రెండ్ ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. సమాచారం అందిన వెంటనే రైల్వే సిబ్బంది హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అయితే విజయనగరం-కొత్త వలస ప్రధాన రహదారికి.. ప్రమాదం జరిగిన స్థలానికి 5 కిలోమీటర్లు పైగా దూరం ఉండటంతో సహాయక చర్యలు కష్టంగా మారాయి. క్షతగాత్రులను తరలించాలన్నా ఐదు కిలోమీటర్లు ట్రాక్‌పైనే వెళ్లా్ల్సి వచ్చింది. మరోవైపు విద్యుత్ కూడా లేకపోవడంతో అంతరాయం మధ్యే సహాయకచర్యలు కొనసాగించారు.
ఘటనా స్థలంలో సహాయక చర్యలు ముమ్మరం చేశారు రైల్వే అధికారులు. ఇప్పటికే జిల్లా పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. క్షతగాత్రులను విశాఖపట్నం, విజయనగరం, అనకాపల్లి ఆస్పత్రులకు తరలిస్తున్నారు. నాలుగు బోగీలు పట్టాలు తప్పగా.. ఇప్పటికీ పలువురు బోగీల కిందే చిక్కుకుకున్నారు. ప్రయాణికులు ఉన్న బోగీలు నుజ్జునుజ్జవడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. ఇక జిల్లా ఎస్పీ దీపిక, మంత్రి బొత్స సత్యనారాయణ ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారు.
రైలు ప్రమాద ఘటనపై సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అక్కడి పరిస్థితులను, ప్రమాద వివరాలను ఆరా తీసిన సీఎం జగన్.. వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. విజయనగరం సమీప నగరాలైన విశాఖపట్నం, అనకాపల్లి నుంచి వీలైనన్ని అంబులెన్స్ లు ఘటనా స్థలానికి పంపాలని ఆదేశించిన సీఎం.. సమీప ఆస్పత్రుల్లో క్షతగాత్రులకు చికిత్స అందించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఘటనకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు నివేదిక అందించాలన్నారు సీఎం.
రైలు ప్రమాద ఘటనపై కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ సీఎం జగన్ కు ఫోన్ చేశారు. ప్రమాద బాధితులను ఆదుకునేందుకు తీసుకుంటున్న చర్యలను సీఎం జగన్ కేంద్రమంత్రికి వివరించారు. సహాయక చర్యలు చేపట్టారని.. క్షతగాత్రులకు వైద్యం అందించేందుకు సత్వర చర్యలు చేపట్టామని తెలిపారు. మంత్రి బొత్సతో పాటు జిల్లా అధికారులు సహాయకచర్యలను పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. మరోవైపు అధికారుల నుంచి సహాయకచర్యల వివరాలు అడిగి తెలుసుకున్న సీఎం జగన్ .. మృతుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. ఏపీకి చెందిన వారు మరణిస్తే వారి కుటుంబాలకు 10 లక్షల ఎక్స్ గ్రేషియా, తీవ్రంగా గాయపడిన వారికి 2 లక్షల సహాయం ప్రకటించారు. ప్రమాదంలో ఇతర రాష్ట్రాల వారు మరణిస్తే 2 లక్షల ఎక్స్ గ్రేషియా..తీవ్రంగా గాయపడిన వారికి 50 వేల రూపాయల సాయం ప్రకటించారు సీఎం జగన్.
రైలు ప్రమాదంతో పలు రైళ్ల దారిమళ్లించారు అధికారులు. విజయవాడ-జార్జుగూడ రైలు ఖరగ్‌పూర్ మీదుగా.. మంగళూరు సెంట్రల్-సంత్రాగచ్చి ఎక్స్‌ప్రెస్.. సికింద్రాబాద్-హౌరా ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్.. బెంగళూరు-జాసిదిహ్ ఎక్స్‌ప్రెస్, బెంగళూరు-హౌరా, చెన్నై సెంటల్-హౌరా మెయిల్, వాస్కోడిగామా-షాలిమార్ ఎక్స్‌ప్రెస్ దారిమళ్లించారు. విజయనగరం వైపు వెళ్లే 9 రైళ్లను రద్దు చేసింది రైల్వేశాఖ. సంబల్‌పూర్-నాందేడ్ రైలు విజయనగరంలో నిలిపివేశారు. పూరీ-తిరుపతి ఎక్స్‌ప్రెస్ బలుగావ్‌లో.. విశాఖ-విజయనగరం రైలు పెందుర్తిలో.. ముంబై-భువనేశ్వర్ ఎక్స్‌ప్రెస్ విశాఖలో నిలిపివేశారు.