కర్నూలు జిల్లాలో అరటి, టమోటా ధరల పతనం

* ఒక్కసారిగా పడిపోయిన అరటి ధర * కిలో టమాట రూపాయి * 50 రూపాయలకు పడిపోయిన అరటి గెల ధర

Update: 2020-12-28 06:21 GMT

ఆరుగాలం కష్టపడి పంట పండిస్తే కనీస ధర లేక రైతులు అవస్థలు పడుతున్నారు. ఒక పక్క ప్రకృతి ప్రకోపం.. మరోపక్క దళారుల మోసం.. రెండింటి మధ్యలో అన్నదాత అరిగోస పడుతున్నాడు. భూమిని నమ్ముకున్న రైతు.. ఏళ్లకు ఏళ్లు మోసపోతూనే ఉన్నాడు. ప్రభుత్వాలు ఎన్ని మారినా, ఎంత మంది నాయకులు మారినా, రైతుల తలరాతలు మాత్రం మారడం లేదు.. అయినా.. రైతు వ్యవసాయం చేయడం ఏనాడూ మానడు. సమాజానికి అన్నం పెట్టేందుకు.. తన పోరాటాన్ని ఆపడం లేదు. కర్నూలు జిల్లాలో రైతుల పరిస్థితి వర్ణాణతీతంగా మారింది.

మొన్న టమాట, నిన్న అరటి.. ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. ఈ రోజు కాకపోయిన.. రేపు అయినా ధర వస్తుందేమోనని అన్నదాతలు ఎదురు చూస్తున్నారు. కానీ, రోజు రోజుకు మాత్రం ధరలు మరింతగా పడిపోతున్నాయి. అదే సమయంలో వినియోగదారుడికి మాత్రం ఎక్కువ ధరకు లభిస్తున్నాయి. దీంతో పంట దిగుబడి బాగా వచ్చినందుకు ఆనందపడాలో.. లేక పంట అమ్ముకునేందుకు అప్పులు చేయాల్సిన వస్తున్నందుకు బాధపడాలో అర్ధంకాక అన్నదాతలు అల్లాడిపోతున్నారు..

కర్నూలు జిల్లాలో అరటి, టమోటా ధరలు పతనం అయ్యాయి. అరటి, టమాట ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. కిలో టమాట రూపాయికి కూడా కొనే నాథుడు లేడు. మిగతా ప్రాంతాల్లో మాత్రం కిలో టమాట 20 నుంచి 30 రూపాయలు పలుకుతోంది. అంతేకాదు.. ఇప్పుడు అరటి ధర ఒక్కసారిగా పడిపోయింది. 50 రూపాయలకు ఒక గెల ధర పలుకుతోంది. బయట మాత్రం డజను అరటి పండ్లు 40 నుంచి 50 రూపాయలు పలుకుతోంది. ట్రాన్స్ పోర్ట్ చార్జీలు కూడా రావడం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. అరటి, టమాటలను రోడ్లపై పడేసి రైతులు నిరసన తెలుపుతున్నారు.

ఆరుగాలం కష్టపడి కంటికి రెప్పలా కాపాడుకున్న పంటలకు సరైనా ధరలు రావడం లేదు. దాంతో పెట్టిన పెట్టుబడులు కూడా రావడం లేదని ఆవేదన చెందుతున్నారు. దాంతో తమ కూరగాయలను పశువులకు తినిపిస్తున్నారు.. భారతదేశంలో రైతు వెన్నెముక.. కానీ, ఆ రైతు బాధలు ఎవరికి పట్టడం లేదు. అందరికి అన్నం కావాలి.. కానీ, రైతులను ఆదుకునేవారు లేకుండా పోయారు.

Tags:    

Similar News