తెలుగువారి మనసు దోచిన బాపు పుట్టిన రోజు నేడు

తన చిత్రాలు, సినిమాల ద్వారా తెలుగువారి మనసు దోచిన ప్రముఖ చిత్రకాలు, దర్శకుడు బాపు (సత్తిరాజు వెంకట లక్ష్మీనారాయణ) పుట్టిన రోజు నేడు.

Update: 2025-12-15 08:32 GMT

అమరావతి: తన చిత్రాలు, సినిమాల ద్వారా తెలుగువారి మనసు దోచిన ప్రముఖ చిత్రకాలు, దర్శకుడు బాపు (సత్తిరాజు వెంకట లక్ష్మీనారాయణ) పుట్టిన రోజు నేడు. 1933 డిసెంబర్ 15న పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో జన్మించిన బాపు న్యాయశాస్త్రంలో పట్టపభద్రుడు అయినప్పటికీ, బాల్యం నుంచీ పట్టిన కుంచెతో గీసిన గీతాలు, రాసిన రాతలు తెలుగువారి మదిలో చెరగని ముద్ర వేశాయి. దర్శకుడుగా చిత్రసీమలో బాపు తెలుగుదనంతో కూడి ఎన్నో ప్రయోగాలు చేసి తెలుగు ప్రజలలో సుస్థిర స్థానం పంపాదించుకున్నారు. 'బాపు' అన్న పేరు తెలుగువారికి మహా ఇష్టమై పోయింది. చిత్రకారుడుగా, దర్శకుడిగా అందనంత ఎత్తుకు ఎదిగిపోయిన తర్వాత కేంద్ర ప్రభుత్వం బాపుని గుర్తించి పద్మశ్రీ అవార్డు ప్రకటించింది. ఇప్పటికీ ఎప్పటికీ ఆయన చిత్రాలను చూస్తూ పరవశించిపోయేవారు తెలుగునాట ఉంటూనే ఉంటారంటే అతిశయోక్తి కాదు. అంతగా తెలుగు సంస్క‌ృతిని ఆయన ఒంటబట్టించుకుని, మనకు అందించార.

బీఏ, బీఎల్ తోపాటు ఆయన చిత్రలేఖనంపై ఆసక్తితో డ్రాయింగ్ ట్రైనింగ్ లోనూ డిప్లొమా చేశారు. బాపుకు తమిళ చిత్రకారులు గోపులు అంటే ఎంతో అభిమానం. బాపు బాల్యమిత్రుడు ముళ్ళపూడి వెంకటరమణ కథలకు, బాపు బొమ్మలు వేసి అలరించారు. అలా రమణ రాత, బాపు గీత కలసి ఆ రోజుల్లో పాఠకులను ఎంతగానో రంజింప చేశాయి. తెలుగునాట బాపు బొమ్మల కథలు విశేషాదరణ చూరగొన్నాయి. ముళ్ళపూడి వెంకటరమణ చిత్రసీమలో రచయితగా రాణిస్తున్న సమయంలో, ఆయన పనిచేసిన కొన్ని చిత్రాలకు పత్రికాప్రకటనలకు తగ్గ బొమ్మలు బాపు గీసేవారు. 'మూగమనసులు', 'మనుషులు – మమతలు', 'బాగ్దాద్ గజదొంగ' చిత్రాలకు ప్రచార చిత్రకారునిగా బాపు పనిచేశారు.

బాపుకు ఆంగ్ల చిత్రకారులు ఎడ్మండ్ డ్యులాక్,చైనా చిత్రకారులు హొకుసయ్, తమిళ చిత్రకారుడు గోపులు అంటే చాలా ఇష్టం. ఆర్.కె.లక్ష్మణ్ బొమ్మలంటే బాపుకు ప్రాణం. ఇలా తనకు నచ్చిన చిత్రకారుల శైలిని అభ్యాసం చేస్తూ, తనకంటూ ఓ ప్రత్యేక శైలిని బాపు రూపొందించుకున్నారు. రేఖాచిత్రాలలో బాపు లైన్ ను మించినది లేదనే పేరు సంపాదించారు. బాపు కొంత కాలం 'రేఖ' అనే పేరుతోనూ బొమ్మలు గీశారు. అందువల్లే 'బాపురే'ఖలు అంటూ ఆయనను పలువురు అభినందిస్తూ ఉండేవారు.


బాపు తన తొలి చిత్రం 'సాక్షి'ని తక్కువ బడ్జెట్ లోనే రూపొందించారు. కృష్ణ, విజయనిర్మల జంటగా నటించిన ఈ సినిమాలో వారి పెళ్లి సందర్భంగా వచ్చే పాట “అమ్మ కడుపు చల్లగా అత్త కడుపు చల్లగా” పాటను బాపు తెరకెక్కించిన తీరు జనాన్ని విశేషంగా ఆకట్టుకుంది. దాంతో బాపు-రమణ కథలకు తెలుగు ప్రజానికం నీరాజనం పట్టారు. అక్కినేనితో బుద్ధిమంతుడు, అందాల రాముడు, శోభన్ బాబు శ్రీరామునిగా సంపూర్ణ రామాయణము, ఆ తర్వాత ముత్యాలముగ్గు, భక్త కన్నప్ప, మనవూరి పాండవులు... వంటి గొప్ప చిత్రాలు బాపు దర్శకత్వంలో రూపుదిద్దుకున్నాయి. బాపు-రమణల చివరి చిత్రం శ్రీరామరాజ్యం. బాపు జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు.

Tags:    

Similar News