రథసప్తమి వేడుకలకు ముస్తాబవుతోన్న తిరుమల క్షేత్రం

Update: 2021-02-13 07:19 GMT

తిరుమల తిరుపతి దేవస్థానం (ఫైల్ ఇమేజ్)

రథసప్తమి వేడుకలకు తిరుమల క్షేత్రం ముస్తాబవుతోంది. సూర్యభగవానుడు మొదటిసారిగా భూమికి దర్శనమిచ్చిన పర్వదినాన రథసప్తమి వేడుకను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఒక్కరోజు బ్రహ్మోత్సవంగా పిలవబడే ఈ రథసప్తమి వేడుకకు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ నిర్వహించేందుకు తిరుమల శ్రీవారి ఆలయం సిద్ధమైంది.

మాఘ శుద్ధ సప్తమి, విశాఖ నక్షత్రంలో అదితి కశ్యపులకు జన్మించిన సూర్య భగవానుడి జయంతిని రథసప్తమిగా జరుపుకుంటారు. సప్తాశ్వ రథంపై సూర్యుడు భూమికి దర్శనమిచ్చిన రోజు కావడంతో ఈ పర్వదినాన్ని 'రథసప్తమిగా పిలుస్తారని పురాణాలు చెబుతున్నాయి. ఈ పర్వదినాన్ని తిరుమలలో ఒక్క రోజు బ్రహ్మోత్సవంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ప్రాతఃకాల ఆరాధన తరువాత శ్రీదేవి భూదేవి సమేత మలయప్పస్వామి వారు భక్తులకు దర్శనమిస్తారని ఆలయ మాజీ ప్రధానార్చకులు రమణ దీక్షితులు తెలిపారు.

ఏటా రథసప్తమి వేడుకలను ఘనంగా నిర్వహిస్తోంది టీటీడీ. ఈ నెల 19న తిరుమలలో ఈ వేడుకలు అంగరంగ వైభవంగా జరిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు టీటీడీ అధికారులు. రథసప్తమిని పురస్కరించుకుని శ్రీ మలయప్ప స్వామివారు ఏడు వాహనాలలో భక్తులకు దర్శనమిస్తారు. ఉదయం 5 గంటల30 నిమిషాలకు సూర్యప్రభ వాహనంతో మొదలై రాత్రి 9 గంటలకు చంద్రప్రభ వాహనంతో వాహనసేవలు ముగుస్తాయి. ఉదయం 5 గంటల 30 నిమిషాల నుంచి 8 గంటల వరకు సూర్యప్రభ వాహనం, 9 గంటలకు చిన్నశేష వాహనం, 11గంటలకు గరుడ వాహన సేవ నిర్వహిస్తారు. ఆ తర్వాత మధ్యాహ్నం ఒంటిగంటలకు హనుమంత వాహన సేవ జరుగుతుంది. 2 గంటలకు చక్రస్నానం, సాయంత్రం 4 గంటలకు కల్పవృక్ష వాహనం, 6 గంటలకు సర్వభూపాల వాహన సేవ జరుపుతారు. రాత్రి ఎనిమిది గంటలకు చంద్రప్రభ వాహనంలో స్వామివారి ఊరేగింపుతో రథసప్తమి బ్రహ్మోత్సవం ముగుస్తుంది.

రథసప్తమి వేడుకలు సంప్రదాయబద్దంగా, ఆలయ తిరుమాడ వీధుల్లో నిర్వహిస్తామన్నారు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి. పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతిస్తామన్నారు, కేవలం టిక్కెట్లు ఉన్న భక్తులను మాత్రమే తిరుమలకు అనుమతిస్తామని. ప్రతీ ఒక్కరూ కోవిడ్ నిబంధనలు పాటించాలని సూచించారు.

గతంలో కరోనా వైరస్ కారణంగా బ్రహ్మోత్సవాలను ఏకాంతంగా నిర్వహించిన టీటీడీ ఇప్పుడుడే కరోనా తగ్గుముఖం పట్టడంతో రథసప్తమి వేడుకలను పరిమిత సంఖ్యతో భక్తులను అనుమతించి మాడవీధుల్లో వాహన సేవలను ఊరేగించే విధంగా చర్యలు చేపట్టింది.ఈ సందర్భంగాశ్రీవారి ఆలయంలో ఈనెల 19వ తేదీ నిర్వహించే ఆర్జితసేవలైన కల్యాణోత్సం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్‌సేవ, సహస్రదీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది. అయితే సుప్రభాతం, తోమాల మరియు అర్చనలను ఏకాంతంలో నిర్వహిస్తారు.మాడవీధుల్లో ప్రత్యేకంగా అదనపు విజిలెన్స్ సిబ్బందిని,భద్రత బలగాలను,శ్రీవారి సేవకులను వినియోగించుకొనుంది.గాలరీల్లో ఉంటూ వాహన సేవలను తిలకించే భక్తులకు అన్న ప్రసాదాలు, మజ్జిగ, నీళ్లు, వేడిపాలు అందజేయనున్నారు. ఏకదాటిగా ఏడు వాహ సేవలు ఉండడంతో కచ్చితమైన సమయాభావాన్ని పాటించేలా అధికారులు ఇందు కోసం చర్యలు తీసుకుంటారు. కరోనా వైరస్ కారణంగా చక్రస్నాన కార్యక్రమాన్ని భక్తులు లేకుండా ఏకాంతంగా శ్రీవారి పుష్కరిణిలో నిర్వహించనున్నారు.

Tags:    

Similar News