Thieves loot gold from jewellery shop: బెజవాడ పోలీస్‌.. శభాష్

Update: 2020-07-25 07:21 GMT

Thieves loot gold from jewellery shop: బెజవాడ పోలీసులు శబ్భాష్ అనిపించుకున్నారు. గోల్డ్ రాబరీ కేసును కేవలం 4 గంటల్లోనే ఛేదించి ఖాకీల పవర్ చూపించారు. ఎంత ఫాస్ట్‌గా చోరీ జరిగిందో అంతే స్పీడ్‌గా రికవరీ చేశారు. సాయిచరణ్‌ జ్యూయలర్స్‌ చోరీ కేసులో గుమాస్తానే అసలు దోషిగా తేల్చారు. షాక్‌లు, ట్విస్ట్‌లతో సినిమా స్టోరీని తలపించిన బంగారం దోపిడినీ కూల్‌గా క్లోజ్ చేశారు.

సినిమాను తలపించే క్రైమ్ థ్రిల్లర్ స్మగ్లింగ్ ప్లాన్.. ఒక్కరోజులోనే కోటీశ్వరుడిగా మారాలనుకున్నారు. అందరూ చూస్తుండగానే పట్టపగలే భారీ చోరీకి పాల్పడ్డారు. గుమాస్తాను కొట్టి, కట్టేసి, కత్తితో గాయపరిచి మరీ లూటీ చేశారు. కానీ, అనుకున్న ప్లాన్ బెడిసి కొట్టింది. సినిమా సీన్లను తలపించే స్కెచ్, స్క్రీన్ ప్లే పోలీసుల తెలివి తేటల ముందు చిత్తయ్యింది. బెజవాడలో పట్టపగలే సంచలనం సృష్టించిన భారీ చోరీ కేసును పోలీసులు నాలుగు గంటల్లోనే ఛేదించారు.

ఈ కేసులో ప్రధాన నిందితుడు గుమాస్తా విక్రమ్ కుమార్ లోహాన్ గా పోలీసులు గుర్తించారు. అతడే వెనకాల ఉండి ప్లాన్ అంతా నడిపించినట్టు పోలీసులు వెల్లడించారు. ఒక ప్లాన్ ప్రకారమే రాజస్థాన్ నుంచి రెండు నెలల క్రితమే చరణ్ జ్యూవెలరీ షాప్ లో గుమాస్తాగా చేరాడు. రెండు నెలలు ఎలాంటి అనుమానం రాకుండా పని చేశాడు. యజమానికి నమ్మకంగా ఉన్నాడు. కానీ, షాప్ పై ఒక క్లారిటీ వచ్చాక తన ప్లాన్ అమలు చేశాడు. రాజస్థాన్ నుంచి ముగ్గురిని తీసుకొచ్చి చోరీ స్కెచ్ వేశాడు. అయితే అంతలోనే పోలీసులకు దొరికిపోయాడు.

దోపిడి నాలుగు గంటల్లోనే పోలీసులు ఛేదించారు. నిందితుల దగ్గర నుంచి 7.2 కిలోల బంగారం, 14 కిలోల వెండి, 42లక్షల నగదును స్వాధీనం పోలీసులు చేసుకున్నారు. ఈ చోరీలో నాలుగు కోట్ల సొమ్ము దోపిడి జరిగినట్టు గుర్తించారు. కీలకవిషయం ఏంటంటే సీసీ కెమెరాల్లో విక్రమ్ లోహాన్ తప్ప వేరెవరూ వచ్చినట్టు లేదు. విక్రమ్ ను కొట్టినట్టు ఎక్కడా లేదు. అంతేకాదు విక్రమ్ కుమార్ బ్లేడుతో చాలా జాగ్రత్తగా కోసుకున్నట్టు పోలీసులు గుర్తించారు. అయితే.. ప్లాన్ ప్రకారమే సొమ్మంతా వేరే చోట పెట్టేసి వచ్చి పక్క స్క్రీన్ ప్లే ప్రకారమే చేశాడు. తన వారితో దోపిడి నాటకం ఆడాడు.

ప్రస్తుతం పోలీసుల అదుపులో నలుగురు నిందితులున్నారు. ఈ కేసులో ఇంకా ఎవరు ఉన్నారని తేలాల్సి ఉందని విజయవాడ సీపీ శ్రీనివాస్ రావు తెలిపారు. అరగంటలో మొత్తం క్లూస్ అన్నీ దొరికాయని వెల్లడించారు.


Tags:    

Similar News