ఆ స్కూల్ లో ఒకే ఒక విద్యార్థి.. అతని కోసం ఒక ఉపాధ్యాయుడు..

Government School: ప్రభుత్వ స్కూళ్లను పటిష్టం చేయడంతో పాటు విద్యార్థుల సంఖ్యను పెంచడం..

Update: 2022-07-22 10:00 GMT

ఆ స్కూల్ లో ఒకే ఒక విద్యార్థి.. అతని కోసం ఒక ఉపాధ్యాయుడు.. 

Government School: ప్రభుత్వ స్కూళ్లను పటిష్టం చేయడంతో పాటు విద్యార్థుల సంఖ్యను పెంచడం మెరుగైన విద్యాబోధన కల్పించడమే లక్ష్యంగా అమ్మఒడి, విద్యాకానుక, నాడు నేడు వంటి పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోంది. కానీ కొన్నిచోట్ల ఆయా పథకాల ఫలితాలు మాత్రం కనిపించడం లేదు. ప్రభుత్వ స్కూళ్లలో చదివేందుకు విద్యార్థులు ఆసక్తి చూపడం లేదు. ఓ ప్రాథమిక పాఠశాలలో అయితే ఏకంగా ఒక్క స్టూడెంట్ మాత్రమే ఉండటం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మరి ఆ స్కూల్ ఎక్కడుంది..?

వేల కోట్లు ఖర్చు చేశారు. కార్పొరేట్ లుక్ ఇచ్చారు. మెరుగైన సౌకర్యాలు కల్పించారు. క్వాలిఫైడ్ టీచర్స్‌తో బోధిస్తున్నారు. అయినా ప్రభుత్వ పాఠశాలలు విద్యార్థులు లేక వెలవెలబోతున్నాయి. పట్టుమని పది మంది కూడా లేని స్కూళ్లున్నాయంటే వినడానికే ఆశ్చర్యం కలగకమానదు. విశాఖ జిల్లా ఎలమంచిలి మండలం మర్రిబంద గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో అయితే ఒక్కరంటే ఒక్క విద్యార్థి మాత్రమే చదువుకుంటున్నాడు.

ఈ చిన్నోడి పేరు దినేష్. మర్రిబంద పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్నాడు. ఈ స్కూల్‌లో ఈ ఒక్కడే విద్యార్థి. పాఠాలు చెప్పేందుకు ఉపాధ్యాయులు కూడా ఒక్కరే. ఈ స్కూల్ మొత్తంగా చూస్తే ఒక టీచర్, ఒక స్టూడెంట్ అంతే. గతేడాది ఇదే స్కూల్లో 9 మంది విద్యార్థులు చదువుకోగా ఈ సారి మాత్రం ఆ సంఖ్య ఒకటికి పడిపోయింది. దీంతో ఆటలు, పాఠాలు అన్నీ ఆ ఒక్క విద్యార్థితోనే.

అయితే ఈ స్కూల్‌లో చేరేందుకు విద్యార్థులు ఆసక్తి చూపడం లేదు. ఎందుకంటే ఈ స్కూల్‌కు రావాలంటే సాహసాలు చేయాల్సి వస్తుంది. ఓ రైల్వేట్రాక్, హైవేతో పాటు ఓ చెరువును కూడా దాటి రావాల్సి ఉంటుందని అందుకే విద్యార్థులను పంపించేందుకు తల్లిదండ్రులు ఇష్టపడటం లేదంటున్నారు. ప్రస్తుతం ఉన్న ఒక్కగానొక్క విద్యార్థి తండ్రి ప్రదీప్ కూడా ఇదే విషయాన్ని చెబుతున్నారు.

గతంలో స్కూల్‌లో విద్యార్థుల సంఖ్య ఎక్కువగానే ఉండేదని క్రమంగా ఆ సంఖ్య తగ్గడంతో ఉపాధ్యాయులు కూడా ఈ పాఠశాలను ఎంచుకోవడం లేదని వినోద్‌కుమార్ చెబుతున్నారు. ఉన్న ఒక్క విద్యార్థి కూడా రావడం మానేస్తే స్కూల్ మూసేయ్యాల్సిన పరిస్థితి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ స్కూల్‌ విషయంలో అధికారులు ఏదైనా పరిష్కారం చూపించాల్సి ఉంది. లేకపోతే మూతపడ్డ జాబితాలో ఈ పాఠశాల పేరును కూడా చేర్చాల్సి వస్తుంది. 

Tags:    

Similar News