40 ఏళ్లు సర్పంచ్‌గా ఒకే కుటుంబసభ్యులు

* 3 సార్లు ఏకగ్రీవం, 5 సార్లు ఎన్నికల్లో విజయం * అనంతపురం జిల్లాలోని బండ్లపల్లి పంచాయతీని.. * నలభై ఏళ్లు పాలించిన పోలినేని పెద్ద నారప్ప కుటుంబం

Update: 2021-02-05 02:09 GMT

Representational Image

రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరిగేది ఊహించలేం. ఒక్కసారి పదవిలోకి వస్తే చాలనుకుంటారు. ఎందుకంటే మరోసారి దక్కుతుందనే భరోసా ఎవరికీ ఉండదు. అలాంటిది ఓ కుటుంబం 40 ఏళ్లు ఓ గ్రామాన్ని పాలించింది. కేవలం పదవే కాదు అందుకు తగిన గౌరవాన్ని కూడా పొందింది. ఇంతకీ ఆ ఊరేంటి నాలుగు దశాబ్దాలు పాలించిన ఆ కుటుంబం చరిత్ర ఏంటి?

ఒకటి, రెండు కాదు ఏకంగా 40 ఏళ్లు ఓ కుటుంబం సర్పంచిగా ఏలుబడి సాగించింది. నిస్వార్థ రాజకీయాల్లో మండలంలోనే ప్రత్యేక గుర్తింపు పొంది రాజకీయ నేతలకు ఆదర్శంగా నిలుస్తున్నారు ఆ కుటుంబసభ్యులు. ప్రజా శ్రేయస్సే పరమావధిగా భావిస్తే ప్రజాదరణకు లోటు ఉండదని నిరూపించిన ఆ కుటుంబం అధికారంలో లేకపోయినా అభివృద్ధికి చేయూతనిస్తోంది.

అనంతపురం జిల్లా కొత్తచెరువు మండలం బండ్లపల్లి 1952లో పంచాయతీగా ఏర్పడింది. అప్పట్లో సర్పంచిగా కమ్మవారిపల్లికి చెందిన పోలినేని పెద్ద నారప్ప ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో 1956లో నారప్ప కుమారుడు వెంకటరమణప్ప సర్పంచిగా గెలుపొందారు. రెండోసారి ఆయన్నే గ్రామస్థులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆ తర్వాత మరో మూడుసార్లు ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు. 1991లో వెంకటరమణప్ప కాలం చేయగా ఆయన కుమారుడు కిష్టప్ప 1995లో సర్పంచిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 1995 ఎన్నికల తర్వాత మహిళలకు రిజర్వ్ కావడంతో కిష్టప్ప భార్య సుమిత్ర పోటీ చేసి అఖండ విజయం సాధించారు. ఇలా ఎనిమిది సార్లు సర్పంచిగా ఆ కుటుంబ సభ్యులు కొనసాగారు. మూడు సార్లు ఏకగ్రీవంగా, ఐదు సార్లు పోటీ చేసి గెలుపొంది రికార్డు సృష్టించారు.

పంచాయతీ అభివృద్ధికి ఎనలేని కృషి చేసిన ఆ కుటుంబం అంటే ఇప్పటికీ ఎనలేని గౌరవం ఉంది. గ్రామంలో పేదల ఇళ్ల పట్టాల కోసం 1.25 ఎకరాల పొలాన్ని దానంగా ఇచ్చారు. పాఠశాల నిర్మాణం కోసం వారి సమీప బంధువు ఏడు ఎకరాల స్థలాన్నిచ్చారు. అభివృద్ధికి కట్టుబడి పనిచేశామని రాజకీయాలకు అతీతంగా అందరి సహకారంతో పదవిలో కొనసాగామని ఆ కుటుంబీకులు చెబుతున్నారు.

గ్రామాభివృద్ధికి నారప్ప కుటుంబం చేసిన సేవలు మరువలేనివని స్థానికులు చెబుతున్నారు. ప్రజా సమస్యలపై స్పందించి గ్రామ అభివృద్ధికి కట్టుబడి పనిచేశారని చెబుతున్నారు. ఒక్క సారి పదవి వరిస్తేనే తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న ప్రస్తుత తరుణంలో నాలుగు దశాబ్దాలుగా పదవులు అనుభవించిన నేతలు ఇప్పటికీ పంచాయతీ అభివృద్ధికి పాటుపడుతూ నారప్ప కుటుంబం ఆదర్శంగా నిలుస్తోంది

Full View
Tags:    

Similar News