ముదిరిన ఎమ్మెల్యే శ్రీదేవి.. వైసీపీ కార్యకర్తల మధ్య వివాదం

వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, కార్యకర్తల మధ్య పేకాట వివాదం ముదిరింది.

Update: 2020-11-07 06:50 GMT

Controversy Between YCP MLA Sridevi and YCP Cader : వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, కార్యకర్తల మధ్య పేకాట వివాదం ముదిరింది. గుంటూరు జిల్లా తాడికొండలో పేకాట క్లబ్‌ నిర్వహిస్తూ వైసీపీ కార్యకర్తలు కొంతమంది పోలీసులకు పట్టుబడ్డారు. వారిని నిలదీయగా ఎమ్మెల్యే శ్రీదేవి అనుచరులమంటూ చెప్పుకొచ్చారు. ఇక.. ఈ విషయం శ్రీదేవి దృష్టికి వెళ్లగా.. ఆ వ్యాఖ్యలను ఎమ్మెల్యే ఖండించారు. చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచించారు. దీంతో ఎమ్మెల్యే శ్రీదేవిపై కక్ష కట్టిన కార్యకర్తలు.. సోషల్‌ మీడియాలో తనపై అసత్య ప్రచారం చేయడం ప్రారంభించారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే శ్రీదేవి.. నగరంపాలెం పోలీసులను ఆశ్రయించారు. తనపై అసత్య ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు.

మరోవైపు వైసీపీ ఎమ్మెల్యే శ్రీదేవి తనను వేధింపులకు గురిచేస్తోందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు వైసీపీ కార్యకర్త. తనపై అక్రమ కేసులు పెట్టిస్తోందని.. చేయని నేరాలను చేసినట్టు చూపుతోందని కన్నీటి పర్యంతమయ్యాడు. సీఎం జగన్‌ తనను కాపాడాలంటూ సోషల్‌ మీడియాలో వీడియో పోస్ట్ చేశాడు వైసీపీ కార్యకర్త.

ఇక శృంగారపాటి సందీప్‌, చలివేంద్రపు సురేష్‌ నుంచి తనకు ప్రాణహాని ఉందన్నారు వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి. తనను బ్లాక్‌ మెయిల్‌ చేస్తూ.. బెదిరిస్తున్నారని ఎమ్మెల్యే గుంటూరు నగరంపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. సందీప్‌, సురేష్‌ చట్ట వ్యతిరేకంగా మద్యం వ్యాపారం చేస్తూ, పేకాట ఆడిస్తూ పెదకాకాని పోలీసులకు పట్టుబడ్డారని.. దీంతో మండల పార్టీ నాయకులు వారిద్దరినీ పార్టీ నుంచి బహిష్కరించారన్నారు.

ఆ ఇద్దరిపై తానే అధిష్ఠానానికి చెప్పానని భావించి.. కొన్ని రోజులుగా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని శ్రీదేవి ఆరోపించారు. తన గొంతు మార్ఫింగ్‌ చేసి మాట్లాడుతూ నన్ను అవమానిస్తున్నారని.. తాను బయటకు వెళ్లినప్పుడు వెంటపడుతూ ప్రాణహాని తలపెట్టేలా ఉన్నారన్నారు. వారిద్దరిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను అని పోలీసులకు ఫిర్యాదులో తెలిపారు. ఎమ్మెల్యే శ్రీదేవి ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    

Similar News