తునిలో టెన్షన్ టెన్షన్: టీడీపీ, వైఎస్ఆర్‌సీపీ వర్గీయుల మధ్య తోపులాట, లాఠీచార్జీ
Tuni Municipal Vice Chairman Election: కాకినాడ జిల్లా తునిలో హైటెన్షన్ నెలకొన్నది. తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక నేపథ్యంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది.
Tuni Municipal Vice Chairman Election: తునిలో మంగళవారం మరోసారి టెన్షన్ చోటు చేసుకుంది. తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక నేపథ్యంలో ఉద్రిక్తత నెలకొంది. దీంతో పోలీసులు లాఠీచార్జీ చేసి టీడీపీ, వైఎస్ఆర్సీపీ వర్గీయులను చెదరగొట్టారు. మున్సిపల్ కార్యాలయం వైపునకు టీడీపీ శ్రేణులు దూసుకు వెళ్లే ప్రయత్రం చేశారు. టీడీపీ శ్రేణులను వైఎస్ఆర్‌సీపీ అడ్డుకొనే ప్రయత్నం చేశారు.
ఈ క్రమంలో ఉద్రిక్తతలు చోటు చేసుకోవడంతో పోలీసులు లాఠీచార్జీ చేశారు. వాస్తవానికి సోమవారం మున్సిపల్ వైఎస్ చైర్మన్ ఎన్నిక జరగాల్సి ఉంది. కానీ, కోరం లేక వాయిదా పడింది. తునిలో మొత్తం 30 వార్డులున్నాయి. అన్ని వార్డులను వైఎస్ఆర్‌సీపీ గెలుచుకుంది. ఇందులో రెండు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఎన్నికల తర్వాత చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో 10 మంది వైఎస్ఆర్‌సీపీ కౌన్సిలర్లు టీడీపీలో చేరారు.
వైఎస్ఆర్‌సీపీకి 17 మంది కౌన్సిలర్లున్నారు. టీడీపీ బలం ఎమ్మెల్యేతో పాటు 11 మంది బలం. వైఎస్ఆర్‌సీపీకి చెందిన కౌన్సిలర్లలో కొందరు తమకు మద్దతిచ్చేందుకు సిద్దంగా ఉన్నారని టీడీపీ ప్రకటించింది. మున్సిపల్ చైర్మన్ ఇంట్లో తమ పార్టీకి చెందిన కౌన్సిలర్లతో మాజీ మంత్రి రాజా ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ శ్రేణులు మున్సిపల్ చైర్మన్ ఇంటి వైపునకు దూసుకెళ్లారు. కోరం లేని కారణంగా సోమవారం సమావేశం వాయిదా పడింది. మంగళవారం సమావేశం నిర్వహిస్తామని అధికారులు ప్రకటించారు. దీంతో మంగళవారం కూడా ఉద్రిక్తత నెలకొంది.
తుని మున్సిపల్ వైఎస్ చైర్మన్ ఎన్నిక నేపథ్యంలో ఛలో తునికి ఆ పార్టీ పిలుపునిచ్చింది. ఛలో తునిలో భాగంగా వైఎస్ఆర్ సీపీ కార్యక్రమంలో భాగంగా తునికి వెళ్తున్న ఫ్యాన్ పార్టీ కార్యకర్తలను గొల్లప్రోలు జంక్షన్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు.