తెలుగుదేశం యువనేత.. రాయలసీమ నుంచినేనా!

Update: 2019-11-18 04:07 GMT

ప్రస్తుతం టీడీపీలో తెలుగుయువత అధ్యక్షుడు ఎవరన్న చర్చ జోరుగా జరుగుతోంది. మొన్నటివరకు ఆ పదవిలో ఉన్న దేవినేని అవినాష్ టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరారు. దాంతో ఈ పదవికి ఖాళీ ఏర్పడింది. అయితే తెలుగు యువత అధ్యక్ష పదవి కోసం ఎవరిని ఎంపిక చెయ్యాలా అని ఆలోచిస్తోంది టీడీపీ. ముఖ్యంగా జేసీ దివాకర్ రెడ్డి కుమారుడు పవన్ కుమార్ రెడ్డి, అయ్యన్నపాత్రుడు రాజకీయ వారసుడు విజయ్, పరిటాల వారసుడు శ్రీరామ్, కరణం బలరాం కుమారుడు వెంకటేష్, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కుమారుడు రాజగోపాల్ రెడ్డి, భూమా వారసుడు జగత్ విఖ్యాత్ రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. తెలుగుయువత అధ్యక్ష పదవిని ఈసారి రాయలసీమ వారికీ ఇస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో రాయలసీమలో తెలుగుదేశం పార్టీ ఏ స్థాయిలో చిత్తు అయ్యిందో వేరే చెప్పనక్కర్లేదు. 52 స్థానాల్లో కేవలం మూడంటే మూడే సీట్లు దక్కించుకుంది.

అదికూడా చంద్రబాబు, ఆయన బావమరిది బాలకృష్ణ, పయ్యావుల కేశవ్ మాత్రమే. ఈ క్రమంలో రాయలసీమ నేతల్లో నిస్తేజం ఏర్పడింది. ఇటీవల చంద్రబాబు సీమలో పర్యటించినా కూడా ఊపు రాలేదు. దాంతో రాయలసీమలో పార్టీకి పూర్వవైభవం తీసుకురావాలంటే అక్కడ ఎవరో ఒకరికి పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించాలని చంద్రబాబు డిసైడ్ అయ్యారట. ఈ నేపథ్యంలో ఖాళీ అయిన తెలుగుయువత అధ్యక్ష పదవిని రాయలసీమ యువనేతకు ఇవ్వాలని ఆలోచిస్తున్నారట. వాస్తవానికి చంద్రబాబు కూడా రాయలసీమకు చెందిన వారే. అయితే ఆయన టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్నారు. రాష్ట్ర అధ్యక్ష పదవిని ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన కళా వెంకటరావుకు ఇచ్చారు. పార్టీలో పదవులు కూడా ఆంధ్ర ప్రాంతానికే ఎక్కువగా ఉన్నాయి. దాంతో రాయలసీమ యువనేతకు తెలుగు యువత పదవి ఇవ్వడం ద్వారా సీమ నేతలను సంతృప్తి పరిచినట్టవుతోందని అభిప్రాయపడుతున్నారట..

ఈ క్రమంలో ఈ పదవికి కొందరి పేర్లు వినిపిస్తున్నాయి. జేసీ పవన్ కుమార్ రెడ్డి, పరిటాల శ్రీరామ్, భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి వంటి వాళ్ల పేర్లు ఈ జాబితాలో ఉన్నట్టు తెలుస్తోంది. ప్రధానంగా ఈ ముగ్గురిలో ఒకరికి ఆ పదవి దక్కబోతోందని ప్రచారం జరుగుతూ ఉంది. అయితే జేసీ పవన్ కుమార్ రెడ్డి వయసు 40 ఏళ్ళు ఉంటుంది. ఈ పదవికి 30 ఏళ్ల లోపు వయసు ఉండాలి. ఇటు శ్రీరామ్ కు కూడా ఇంచు మించు 30 ఏళ్ళు ఉంటాయి. వీరిద్దరూ కూడా గడిచిన ఎన్నికల్లో పోటీ చేసి ఘోరంగా ఓడారు. ఇటు భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి పోటీ చేయకున్నా రాజకీయాలపట్ల అంత ఆసక్తి కనబరచడం లేదు. దీనికి తోడు జగత్ సోదరి భూమా అఖిలప్రియ తెలుగుదేశం పార్టీలో ఉంటారా, ఉండరా అనేది మిస్టరీగానే ఉంది. వయసుతో సంబంధం లేకుండా అయితే ఈ పదవి తనకు ఇవ్వాలని జేసీ పవన్ కోరుతున్నట్టు తెలుస్తోంది. అలాగే పరిటాల శ్రీరామ్ కూడా తెలుగు యువత అధ్యక్ష పదవిపై ఆశలు పెట్టుకున్నారు. మరి అధిష్టానం మదిలో ఎవరు ఉన్నారో..అసలు రాయలసీమ నేతకు తెలుగు యువత అధ్యక్ష పదవి ఇస్తారో లేదో తెలియాలంటే మరి కొద్దిరోజులు ఆగాల్సిందే.

Tags:    

Similar News